Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విజేత.. విజయన్‌... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

విజేత.. విజయన్‌...

Sun 16 May 06:11:55.090178 2021

ఒక చరిత్ర గురించి చర్చించాల్సి వస్తే బ్రిటిష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టిన భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి చర్చించాలి..
ఒక తిరుగుబాటు గురించి విశ్లేషించాల్సి వస్తే వీర తెలంగాణ విరోచిత సాయుధ పోరాటం గురించి విశ్లేషించాలి..
ఒక మారణహౌమం గురించి మాట్లాడాల్సివస్తే 'జలియన్‌ వాలాబాగ్‌' నెత్తురుతో తడిసిన నేల గురించి మాట్లాడాలి..
కానీ.. ఒక ఆదర్శవంతమైన, నిస్వార్థమైన ప్రజాపాలన ఎలా ఉంటుందో చూడాలంటే కమ్యూనిస్టు రాష్ట్రం కేరళను చూడాలి...
గుండెలో ఆత్మవిశ్వాసం.. ప్రసంగంలో విప్లవ చైతన్యం.. ఆలోచనలో శాస్త్రీయ దృక్పథం.. ఆచరణలో కార్మిక విధానం.. అమల్లో ప్రజా సంక్షేమం.. అంతకుమించి విపత్తులనెదుర్కొనే ధైర్యం.. అన్నింటినీ కలిపిచూస్తే ఆయన కామ్రేడ్‌ పినరయి విజయన్‌. పేరుకు తగినట్టుగానే కేరళ ప్రజల మనసుల్ని గెలిచిన అజేయుడు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిజం ఔన్నత్యాన్ని చాటిన వారిలో ఇతనొకడు. సోషలిజం ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని బలంగా నమ్మిన వ్యక్తి. వామ పక్షాలను కలుపుకుని ఉద్యమాలు నిర్మించిన సిద్ధాంతకర్త. సమిష్టి పని విధానంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ధీశాలి. విజయన్‌ పుట్టి పెరిగింది కేరళలోనే. మలబార్‌ జిల్లా (అప్పటి మద్రాస్‌ ప్రిసిడెన్సీ) పినరయి గ్రామంలో 1945 మే24న జన్మించాడు. తల్లిదండ్రులకు ఆయన 14వ సంతానం. సామాన్య మధ్య తరగతి కుటుంబం వారిది. తండ్రి మరోలి కరోన్‌ కల్లు గీత కార్మికుడు, తల్లి కళ్యాణి గృహిణి .పెరాలస్సెరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, బ్రెన్నాన్‌ ప్రభుత్వ కళాశాలలో బీఏ పూర్తిచేశాడు. 1979లో కమలను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయిని. వీరికి వీణ కూతురు, వివేక్‌ కిరణ్‌ కుమారుడు ఉన్నారు. విజయన్‌ కాలేజీలో చదువుతున్నప్పుడే రాజకీయా లకు బీజం పడింది. ఎస్‌ఎఫ్‌ఐలో యాక్టివ్‌గా ఉండేవాడు. విద్యార్థి ఉద్యమాల నుంచే నాయకుడయ్యాడు. సీపీఐ(ఎం) సిద్ధాంతం నచ్చి 1964లో సభ్యత్వం తీసుకున్నాడు. అప్పటికే కేరళ లో పార్టీకి పటిష్టమైన నాయకత్వం, ప్రజాబలం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, వీఎస్‌ అచ్యుతానందన్‌, ఏకె గోపాలన్‌, క్రిష్ణపిళ్తై వంటి నేతలు గట్టి పునాది వేశారు. అసెంబ్లీ ఏర్పడిన తర్వాత 1957లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నంబూద్రిపాద్‌ తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది దేశ చరిత్రలోనే నూతన ఒరవడికి నాంది పలికింది. మరో విశేషమేమిటంటే ప్రపంచ దేశాల్లో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో ఇదొకటి. తర్వాత కాలంలో అచ్యుతానందన్‌ కూడా ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ క్రమంలోనే ఉద్యమ కార్యాచరణ, రాజకీయ విశ్లేషణ కలిగిన నేతగా విజయన్‌ను పార్టీ గుర్తించింది. 1970లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దింపడంతో విజయం సాధించాడు. అప్పటికీ ఆయన వయసు 25ఏండ్లు. పార్టీ విధానాలకు కట్టుబడి పని చేయడంతో పాటు అంకితభావం, క్రమశిక్షణ, సమిష్టి నిర్ణయాలు అమలు చేసే నేతగా పేరు తెచ్చుకున్నాడు. మండల స్థాయి నుంచి, జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. 1998లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, తర్వాత జాతీయ స్థాయిలోనూ బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నాడు. ఇందిరా హయాం ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం కూడా గడిపాడు. కేరళను ఒక శాస్త్రీయ అవగాహనతో అధ్యాయనం చేసిన విజయన్‌ పార్టీ విధానాన్ని అనుసరించి సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఆలోచించాడు. ఇవి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో పాటు ఆయన నాయకత్వంపై ప్రజాధరణ పెరిగింది. ఐదు దశాబ్దాల కిందట సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన విజయన్‌ విప్లవ భావజాల వ్యాప్తిలో వీఎస్‌ అచ్యుతానందన్‌కు ప్రియశిష్యుడు అనే పేరు.
ఆదర్శ వ్యక్తిత్వం.. అ'సాధారణ'నేత...
ఒకసారి కౌన్సిలర్‌గా గెలిస్తేనే తరానికి సరిపడే సంపదను పోగేసుకునే నేతల్ని మన కండ్ల ముందు చూస్తున్నాం. కానీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినా ఆయనకున్న ఆస్తిపాస్తులు కమ్యూనిస్టు విలువలు. ముఖంపై చెదరని చిరునవ్వు ఆయన సహజత్వానికి నిదర్శనం. కేరళ సంప్రదాయ దుస్తులైన తెల్లని చొక్కా, లుంగీతో సాదాసీదాగా జనాల్లో కలిసిపోయే నైజం. రోడ్డు పక్కన మెస్‌లో భోజనం చేసి డబ్బులు చెల్లిస్తాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే వారితో ఎక్కువసేపు గడపాలనే ఆయన నాయకత్వాన్ని చాలా మంది ఇష్టపడతారు. సభలు, సమావేశాలకు వెళ్లినా పనులు ఆయనే చేసుకుంటాడు. విజయన్‌ కూతురు వీణ బెంగుళూర్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. గతేడాది డీవైఎఫ్‌ఐ సీనియర్‌ నేత పీఎ అహ్మద్‌ రియాజ్‌కు ఇచ్చి ఆదర్శ వివాహం చేశాడు. రియాజ్‌ కూడా ఎమ్మెల్యేనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైపోర్‌ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచాడు. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. 75ఏండ్ల విజయన్‌ ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కుతుపరంబ నియోజక వర్గం నుంచి 1970లో మొదటిసారి పోటీచేసి ప్రజా సోషలిస్ట్‌ అభ్యర్థి రాఘవన్‌పై 743 ఓట్లతో గెలిచాడు. 1977లో అదే నియోజక వర్గం నుంచి రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) అభ్యర్థి అబ్దుల్‌ ఖాదర్‌పై 4,401 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి మూడోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి రామకృష్ణన్‌పై 12,960 ఓట్ల మెజార్టీ చేజిక్కించుకున్నాడు. 1996లో పయ్యూర్‌ నుంచి కేఎన్‌ కన్నత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 28,078 ఓట్ల మెజార్టీ, 2016లో ధర్మదోమ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దివాకరన్‌పై 36,905 మెజార్టీ దక్కించుకుని 2016 మే 25న కేరళ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రఘునాథన్‌పై 50,123ఓట్ల మెజార్టీతో గెలిచాడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
విపత్తులు ఎదుర్కొని.. విజేతగా నిలిచి...
ప్రకృతి విపత్తులు ఎదురైనా, కరోనా రాక్షసి కబళించాలని చూసినా పార్టీ సహకారం, సమిష్టి నిర్ణయంతో రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు విజయన్‌. అదే రెండోసారి ఎల్‌డీఎఫ్‌ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఐదు సంవత్సరాలుగా కేరళను ఉపద్రవాలు ముంచెత్తాయి. ఒకదానిపై ఒకటి రావడంతో దిక్కు తోచని పరిస్థితి. 2017లో ఓఖి సైక్లోన్‌, 2018, 19లలో నిఫా, వరదలు, 2020లో కరోనా ఇలా అన్ని విపత్తులనూ విజయన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అధికార యంత్రాంగాన్ని ఎప్పటి కప్పుడు అలర్ట్‌ చేస్తూ మీడియా ద్వారా జనాల్లో ధైర్యం నింపాడు. మంత్రులు, శాసన సభ్యులు రంగంలోకి దిగి ప్రజలకు సహాయం చేశారు. ఇండ్లు కూలి పోయిన వారికి ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించారు. వరదల నుంచి ప్రాణాలు రక్షించు కునేందుకు కిట్లను అందజేశారు. కొంత మంది కలెక్టర్‌లు వరద సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఏ విపత్తు రాష్ట్రంలో ఎదురైనా విజయన్‌ ముందుగా ప్రతిపక్షాల సలహాలు, సూచనలతో సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాడు. వారిని వెంట పెట్టుకుని హెలిక్యాఫ్టర్‌ ద్వారా వరద ప్రాంతాలను సమీక్షించాడు. ప్రజల బాగోగులకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాడు. దేశ చరిత్రలో ప్రతిపక్షాలతో కలిసి పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది విజయన్‌కే చెల్లుతుంది. అదే కమ్యూనిస్టు రాష్ట్రం ప్రత్యేకత. కానీ కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్‌ కేరళను పట్టించుకున్న పాపాన పోలేదు. వరదల సమయంలో ప్రకృతి విపత్తుల కింద ఉడుత భక్తిలా వాస్తవ అంచనా లేకుండా పైసలు విదిల్చి చేతులు దులుపుకుంది. అది రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం భరోసానివ్వ లేదు. ఎవరినీ చేయిచాచి అడగకుండా 'నేనున్నాను' అంటూ సమస్యలకు ఎదురొడ్డి పోరాడాడు విజయన్‌. చాకచక్యంగా వ్యవహరించి ప్రజలకు అండగా నిలిచాడు. 2020లో వచ్చిన కరోనా వైరస్‌ను తొలి రోజుల్లోనే అరికట్ట గలిగాడు. వైరస్‌ వ్యాపిస్తున్నదన్న విషయం తెలియగానే విమానా శ్రయాలను బంద్‌ చేయించి రాకపో కలను నిషేధించాడు. ఆర్థికలోటు వస్తుందని తెలిసినా వెనుకడుగు వేయలేదు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు లాక్‌ డౌన్‌ను అమలు చేశాడు. వైరస్‌ను అడ్డుకు నేందుకు కట్టుదిట్ట మైన చర్యలు తీసుకున్నాడు. మొదట్లోనే వైరస్‌ను వ్యూహా త్మకంగా అణచివేసిన కేరళ సర్కార్‌ను ఐక్యరాజ్య సమితి, అంత ర్జాతీయ ఆరోగ్య సంస్థతో పాటు, ప్రపంచ దేశాలు ప్రశంసిం చాయి. కేంద్రం లాక్‌డౌన్‌ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. కానీ విజయన్‌ మాత్రం సంక్షేమ పథకాలు, సేవలతో ప్రజలకు ఆపన్నహస్తం అందేలా చేశాడు. అడ్వాన్స్‌ పింఛన్‌, ఉచిత రేషన్‌ సరుకులు ఇప్పించాడు. వలస కూలీలను తమ అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించాడు. నేటికీ 80 లక్షల కుటుంబాలకు సరుకులు అంద జేస్తున్న ఘనత విజయన్‌కే దక్కుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో దేశమంతా వణుకు తున్న పరిస్థితి. కానీ కేరళ మాత్రం ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కరోనా మొదటిదశలోనే ఏర్పాటు చేసింది. ఇప్పుడది రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు తమిళనాడు, కర్నాటక, గోవా, లక్షద్వీప్‌లకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ వేలాది మంది ఊపిరి నిలుపుతున్నది. ప్రస్తుత లాక్‌డౌన్‌లో కరోనాతో ఎవరూ పస్తులుండకూడదని 17 రకాల నిత్యావసర సరుకులు, కుటుంబానికి రూ.7 వేలు అందిస్తున్నది. కరెంటు, వాటర్‌ బిల్లులు ప్రభుత్వమే భరిస్తున్నది.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట...
కేరళలో విజయన్‌ సర్కార్‌ ప్రజా సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంటున్నది. దేశంలో విద్యా, వైద్యరంగాలను ప్రయివేటీ కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విద్యా, వైద్య రంగాలను తమ ఆధీనంలో ఉంచుకుని మెరుగైన ఫలితాలు సాధించింది. వ్యవసాయం, సేవా రంగాన్ని బాగా అభివృద్ధి చేసింది. ఆర్థిక లోటు ఉన్నా గణనీయమైన జీవన ప్రమాణాలు పెంచడంలో సర్కార్‌ సఫలీకృతమవుతున్నది. వనరుల కొరత వేధిస్తున్నా కెఐఐఎఫ్‌బి (కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు) సంస్థ ద్వారా నిధులను సమకూర్చుతున్నది. దీని ద్వారా ప్రజల జీవన విధానానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. దేశంలోనే వందశాతం సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ. మానవాభివృద్ధి సూచీలలో కూడా ముందు వరుసలోనే ఉన్నది. విదేశాల్లో కేరళీయుల ఉద్యోగ ప్రతిభ కూడా రాష్ట్రానికి గర్వకారణం. అక్కడి నుంచి వారి కుటుంబాలకు పంపే నిధులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ కొంతమేరకు దోహదం చేస్తున్నవనే చెప్పాలి. పేదరిక వ్యవస్థ నిర్మూలన, ప్రాథమికవిద్యను బలోపేతం చేసి డ్రాపౌట్స్‌ను తగ్గించడం, నిరుద్యోగం లేకుండా చేయడం, విజయన్‌ ప్రభుత్వంపై ప్రజలకు అంచనాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, కుల వివక్ష దరి చేరకుండా దళితులను పూజారులుగా నియమిం చడం మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆరోగ్య సదుపాయ వ్యవస్థకు ఐక్య రాజ్య సమితి శిశు సంక్షేమ నిధి (యునిసెఫ్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ) నుంచి పిల్లలకు అనుకూలమైన రాష్ట్రంగా కేరళ మన్ననలు అందుకున్నది. ఇక్కడ గర్భిణులకు పోషకాహారంతో పాటు రక్షణ చర్యలు తీసుకున్నది. 95శాతం జననాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయంటే ప్రజలకు ప్రభుత్వంపైన ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. మహిళా సాధికారతకు తీసుకొచ్చిన 'కుటుంబ స్త్రీ' పథకం ద్వారా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకుని మహిళలు స్వయం సంవృద్ధిని సాధించారు. వ్యవసాయ రైతులకు స్వామినాథన్‌ కమిషన్‌ సిపార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన విజయన్‌ తన రాష్ట్రంలో పండే 16 రకాల కూరగాయల ధరలకు మద్దతు ప్రకటించాడు. వరి క్వింటాల్‌కు కేంద్రం ఇస్తున్న మద్దతు కంటే వెయ్యి రూపాయల బోనస్‌ ఇచ్చి రైతులను ఆర్థిక భరోసా కల్పించాడు. సహకార సంఘా లను బలోపేతం చేయడం, కౌలుదారులకు వ్యవసాయ రైతు లతో సమాన హక్కులు కల్పిం చాడు. కార్మికులకు చట్టాలు అమలు చేస్తూ వారికి కనీస వేతనం అందేలా చూశాడు. కేంద్రం ప్రజల నడ్డివిరిచే చర్యలు తీసుకుంటున్నా విజయన్‌ మాత్రం ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా చర్యలు తీసుకున్నాడు. గడిచిన ఐదేండ్లలో పెరి గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ట్యాక్స్‌ను ఎత్తివేసి ప్రజలపై భారం పడకుండా చూశాడు. పెరిగిన నిత్యావసర ధరలు, వంట గ్యాస్‌ ధరలను రాష్ట్ర ప్రభు త్వమే భరించేలా చూశాడు. కేంద్రం సాయం చేయకున్నా ప్రజాసేవకు లోటు రానివ్వ లేదు. సరళీకృత విధానాలు వ్యతిరేకించడంతో పాటు శ్రమశక్తిని దోచి, ప్రజాధనం కొల్లగొట్టే పెట్టుబడిదారులను రాష్ట్రంలోకి రానివ్వ లేదు. సర్కార్‌ ఆదాయానికి ఇక్కడ సేవా రంగమే ప్రధానం. అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ట్రాన్‌పోర్ట్‌ నుంచి 60శాతం నిధులు సేకరిస్తారు. అగ్రికల్చర్‌, ఫిషరీస్‌ది మరో 20శాతం ఉంటుంది. ఘర్షణలు లేని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది కేరళనే. లైంగిక దాడులు, గృహహింస కేసులు చాలా తక్కువ.
2021 ఎన్నికలు.. ప్రజాతీర్పు...
దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇక్కడ ప్రధానంగా రెండు రాజకీయ కూటములున్నాయి. ఒకటి లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ఇది సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష పార్టీల ఐక్యతతో ఉంటుంది. రెండోది యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేరళలో 55 శాతం హిందూ, 27శాతం ముస్లిం, 18శాతం క్రిస్టియన్‌, 21 శాతం ఇజ్జవాలు, 12 శాతం నాయర్‌ ఓట్లున్నాయి. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో 40 ఏండ్లుగా ప్రతి ఐదేండ్లకోసారి అధికార మార్పిడి జరుగుతోంది. కానీ ఈసారి విజయన్‌ సారథ్యంలో ఎల్‌డీఎఫ్‌ కూటమి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికింది. 1969 నుంచి 1979 వరకు వరుసగా రెండు సార్లు అధికారాన్ని నిలుపుకున్న పార్టీగా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఉంది. ఈ చరిత్రను తిరగరాస్తూ 40ఏండ్ల తర్వాత విజయన్‌ సర్కార్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి 1957లో నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత 29 నెలల తర్వాత ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. తర్వాత 1967లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. 1980 ఎన్నికల తర్వాత ఇకె నయనార్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా స్వల్పకాలమే పఁచేసింది. 1987, 1996, 2006ల్లో వామపక్ష కూటమి పూర్తి పదవీకాలాలు పూర్తిచేశాయి. ఇప్పుడు ఏకంగా రెండుసార్లు వరుసగా అధికారాన్ని చేపట్టిన సర్కార్‌గా ఎల్‌డీఎఫ్‌ చరిత్ర సృష్టించింది. దీనికి తోడు సీట్లు కూడా పెంచుకుని స్పష్టమైన మెజార్టీని సాధించింది. 2016లో ఎల్‌డీఎఫ్‌ 91 సీట్లు, యుడిఎఫ్‌47 సీట్లను గెలిచింది. 2021లో 99 సీట్లను సాధించగా యుడిఎఫ్‌ 41 సీట్లకే పరిమితమైంది. ఎల్‌డీఎఫ్‌ కూటమిలో ప్రధానంగా సీపీఐ(ఎం) 62, సీపీఐ 17, ఇతరులు 20 స్థానాలు దక్కించుకున్నారు. యూడిఎఫ్‌లో కాంగ్రెస్‌ 21, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) 15, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నారు. ధర్మదామ్‌ నుంచి పోటీచేసిన విజయన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘునందన్‌పై 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. విజయన్‌ మంత్రివర్గం సహచరుల్లో ఒక్కరు తప్ప అందరూ మళ్లీ గెలిచారు. ఎంఎం మణి, ఏసీ మొయిదిన్‌, సురేంద్రన్‌, రామచంద్రన్‌, క్రిష్ణకుట్టీ, టీపీ రామకృష్ణన్‌, చంద్రశేఖరన్‌, కేటీ జలీల్‌ గెలుపొందారు. ఫిషరీస్‌ మంత్రి మెర్సీ కుట్టీ అమ్మ ఒక్కరే ఓటమి పాలయ్యారు. కరోనాను కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేసిన ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ మట్టనూర్‌ నియోజకవర్గం నుంచి 61వేల మెజార్టీతో గెలుపొందారు. కేరళ అసెంబ్లీలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మెజార్టీ. ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలిస్తారు. గెలిచాక వాటిని నెరవేర్చలేకపోవడం, నిధులు లేవని దాటవేయడం, చివరకు మొఖం చాటేయడం చేస్తారు. కానీ విజయన్‌ మాత్రం అలా కాదు. ఆయన ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో 570 హామీలను నెరవేర్చాడు. ప్రజల భవిష్యత్తును పథకాల ద్వారా రూపుదిద్దాడు. 'లైఫ్‌ మిషన్‌' ద్వారా ఇండ్లులేని, భూమి లేని నిరు పేదలకు రెండు లక్షల ఇండ్లు కట్టించాడు. 'అర్ట్రమ్‌ మిషన్‌' ద్వారా ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ప్రతి గ్రామంలో రోగులకు సరైన వైద్యమందేలా చూశాడు. 'ఎడ్యుకేషన్‌ మిషన్‌' ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్డాడు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్‌ క్లాస్‌రూమ్స్‌, హైటెక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి దేశంలోనే తొలి డిజిటల్‌ రాష్ట్రంగా పేరుగాంచాడు. కేంద్రం ప్రకటించిన ఎన్నో సూచిల్లో కేరళ మొదటిస్థానంలో నిలవడం విజయన్‌ సర్కార్‌ పని తీరుకు నిదర్శనం.
దేశం చూపు... కేరళ వైపు...
పశ్చిమబెంగాల్‌లో ఓటమి, త్రిపురలో అధికారం కోల్పో వడం, ఇక కమ్యూనిస్టుల పని అయిపోయిం దని హేళన చేసే వారికి కేరళ విజయం ఓ గుణపాఠం. ఇప్పుడు దేశం కేరళవైపు చూస్తోందనేది నిజం. వాస్తవానికి కమ్యూనిస్టులకు వరుసగా అధికారంలోకి రావడం కొత్తేమి కాదు. గతంలో పశ్చిమ బెంగాల్‌ను సీపీఐ(ఎం) ఏకధాటిగా 35 ఏండ్లపాటు ఏలిన చరిత్ర మరువరానిది. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పూర్తి భిన్నం. ఎప్పుడైతే కేంద్రంలో రెండోసారి ఎన్‌డీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చిందో హిందుత్వవాదం చాపకింద నీరులా విస్తరించింది. మోడీ, అమిత్‌షా దేశప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో విజయవంతమయ్యారు. అప్పటినుంచి ప్రజా వ్యతిరేక విధానాలు వేగంగా అమలు చేయడం మొదలు పెట్టారు. పార్లమెంటులోని మందబలంతో నల్లచట్టాలు తీసుకొచ్చి రైతుల ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. కార్మిక చట్టాల స్థానంలో కోడ్‌లు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఊతమిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించడం, రాజకీయ సంక్షోభాలకు తెరదీయడం, అడ్డదారుల్లో అధికారాలు చేజిక్కించుకోవడం, వినని వారిని సీబీఐ దర్యాప్తుల పేరుతో లొంగదీసుకోవడం ఎన్‌డీఏ మార్క్‌ పాలన. మొదటి నుంచి కేంద్రం విధానాల్ని వ్యతిరేకిస్తున్న విజయన్‌ రాష్ట్రాల హక్కులపై కేంద్ర జోక్యం సరికాదని తేల్చి చెప్పాడు. ఈ చర్యలపై పోరుకు కలిసొచ్చే పార్టీలతో సమా వేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై జరుగుతున్న అరాచ కాన్ని ఖండించాడు. రోజురోజుకూ కమ్యూ నిస్టుల పాత్ర పెరుగు తున్నదని కేరళలో బీజేపీని ఎలాగైనా అది óకారంలోకి తీసుకురావా లని బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ వంటి అగ్రనేతలందరూ స్వయంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. సీఎం అభ్యర్థి గా మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను నిలబెట్టి 30 నుంచి 40 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేేశంలోనే అత్యధిక ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలున్న కేరళ లో భారత్‌ ధర్మ జనసేన (బీడీజే ఎస్‌) సాయం తీసుకు న్నారు. కానీ హిందూ, ముస్లిం, క్రైస్తవు లంతా బీజేపీని ఓట్లు వేయకుండా వామపక్ష కూటమి వైపే మొగ్గు చూపారు. ఇకపోతే శబరిమల వివా దాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పావులాగా వాడుకోవాలని చూశారు. అయ్యప్పస్వామి ఆలయం లోకి 10 నుంచి 50 సంవత్స రాల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ విజయన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఆందో ళనలు చేశారు. మహిళలు ఆలయం లోకి వెళ్లకుండా దాడులకు దిగారు. ఈ అంశంపై కోర్టుకు కూడా వెళ్లారు. కానీ కోర్టు రాష్ట్ర సర్కార్‌కు అనుకూల తీర్పు నిచ్చింది. బంగారం స్మగ్లింగ్‌లో ముఖ్య మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని విష ప్రచారం చేసి విజయన్‌ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ అమానుష చర్యలన్నీ కేరళ ప్రజలు గమనిస్తూనే వచ్చారు. బీజేపీకి ఉన్న ఒక్క సీటును కూడా లేకుండా చేశారు. సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఎల్‌డీఎఫ్‌ తరపున కేరళలో క్యాంపెయినింగ్‌ చేశారు. ప్రజా సంక్షేమానికి కేరళ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు, దేశంలో మతోన్మాద విధానాలపై ప్రజలు ఆలోచించేలా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వయనాడ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తమ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేసినా ఫలితం లేదు. కేరళలో అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో ఎన్నో రాయితీలు, తాయిలాలు ప్రకటించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా వారిని ప్రజలు విశ్వసించలేదు. దేశంలో దశాబ్దాలుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించే బూర్జువా పార్టీల అధికార దుర్వినియోగం, అవినీతి డబ్బు, ఓట్ల కొనుగోలు, అప్రజాస్వామిక గెలుపులనేకం చూశాం. కానీ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళ ఓటర్లు తమ రాష్ట్రంలో కుల, మత ఎజెండాల పార్టీలకు తావులేదని నిరూపించారు. లౌకికతత్వం, మత సామరస్యాన్ని కాపాడగలిగే ఎర్రజెండానే తమ ఎజెండానని చాటిచెప్పారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడే వామపక్షమే తమ భవిష్యత్తు అని తీర్పునిచ్చారు.
అందాల సుందర తీరం..కేరళ..
14 జిల్లాలతో కూడిన కేరళ భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇండియా మ్యాప్‌లో ఎక్కడో ఆరేబియా సముద్రానికి ఆనుకుని కన్యాకుమారికి చేరువైనట్టుగా చిన్న ప్రదేశంగా కనిపిస్తుంది. వైశాల్యం 38,863 చ.కి.మీ. రాజధాని తిరువనంతపురం. అత్యధిక జనాభా ఉన్న ప్రధాన నగరం కూడా ఇదే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంతకుముందున్న తిరువాస్కుర్‌, కోచ్చిన్‌ సంస్థానాలను కలిపి రాష్ట్రంగా గుర్తించారు. 1956 నవంబర్‌1 నుంచి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రంగా అమల్లోకి వచ్చింది. కేరళ జనాభా 3కోట్ల 50లక్షలు. 51శాతం మహిళలు, 49 శాతం పురుషులు ఉంటారు. మతపరంగా హిందువులు 54, ముస్లిములు 26, క్రైస్తవులు 18, ఇతరులు 0.3శాతం ఉన్నారు. కేరళను దక్షిణ కేరళ, మధ్య కేరళ, ఉత్తర కేరళగా పిలుస్తారు. కోజికోడ్‌, కొచ్చిన్‌, ఎర్నాకుళం, త్రిసూర్‌ వాణిజ్య నగరాలు. హైకోర్టు ఎర్నాకుళంలో ఉంటుంది. నదులు, జలపాతాలు, బీచ్‌లు, కొబ్బరి తోటలు, తేయకు తోటలకు కేరళ ప్రసిద్ధి. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. దేశంలో అత్యధిక జల మార్గాలున్న రాష్ట్రం కూడా కేరళనే. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే శబరిమలై కేరళ రాష్ట్రంలోనిదే. అనంత పద్మనాభస్వామి ఆలయం ఇక్కడిదే. కేరళలో ప్రధాన పంట వరి. కూరగాయలు కూడా ఎక్కువనే పండిస్తారు. తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిమామిడి, సుగంధ ద్రవ్యాలు (మిరియం, యాలకు, వనిల్లా, దాల్చినీ, పోక) వంటివి ఇతర పంటలు. కేరళ అధికారిక భాష మలయాళం. ద్రావిడ మూలాలున్న కేరళను సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా అభివర్ణిస్తారు. కథాకళి, కూడియట్టం, కేరళ నటనం, మోహినియట్టం, తుళ్లాల్‌, పాదయాని, తెయ్యం ప్రత్యేక రూపాలు. కేరళకు ఈ పేరు ఎలా వచ్చిందంటే కేర అంటే కొబ్బరిచెట్టు, ఆళం అంటే భూమి అని ఈ రెండు కలిపితే కేరళకు ఆ పేరు వచ్చిందని ప్రచారం. కేరళ సంప్రదాయంలో భాగంగా పడవల పోటీలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. మహిళలకు ఓనం ఇష్టమైన పండుగ.
కేరళ ఫలితాలు హైలెట్స్‌...
- ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధర్మదామ్‌ నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రఘు నాథన్‌పై 50,123 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆయన ఆరుసార్లు పోటీ చేసి గెలిచిన వాటిలో ఇది అత్యధిక మెజార్టీ
- డివైఎఫ్‌ఐ నేత, ముఖ్యమంత్రి అల్లుడు మహ్మద్‌ రియాజ్‌ బైపోర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి నియాస్‌పై 21,674 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మామ సీఎంగా.. అల్లుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
- కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ టీచర్‌ సీపీఐ(ఎం) తరపున బరిలోకి దిగి రెవ ల్యూషనరీ సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఇల్లికల్‌ ఆగస్థీకిపై 60,963 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొం దారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇదే అతిపెద్ద మెజార్టీ.
- మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఆ పార్టీకి ఊరట.
- నీలాంబర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన వీవీ ప్రకాష్‌ స్వతంత్ర అభ్యర్థి అన్వర్‌పై 1,659 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచాడు. కానీ పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రకాష్‌ కరోనాతో చనిపోయాడు.
- కేరళ కాంగ్రెస్‌ చైర్మెన్‌ జోస్‌ కెమణి పాలా నియోజక వర్గం నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి మణిసికప్పెన్‌ చేతిలో ఓడిపోయాడు.
- బీజేపీ సీఎం అభ్యర్థిగా పలక్కాడ్‌ నియోజకవర్గం నుంచి పోటీలోకి దించిన మెట్రోమాన్‌ శ్రీధరన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి షపిపరంబిల్‌ చేతిలో 2,740 ఓట్లతో గెలుపొందాడు.
- 2016 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, మిజోరం మాజీ గవర్నర్‌ రాజగోపాలన్‌ నెమామ్‌ నుంచి పోటీచేసి ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి శివకుట్టి చేతిలో ఓటమిచెందాడు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ కొన్ని, మంజేశ్వరం రెండు నియోజక వర్గాల నుంచి పోటీ ఒక్కచోట కూడా గెలవలేదు. ఇతను ప్రచారానికి ఏకంగా హెలిక్యాప్టర్‌నే ఉపయోగించడం విశేషం.
- త్రిస్కూర్‌ నుంచి బీజేపీ తరపున పోటీచేసిన రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు సురేష్‌గోపి కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మజ వేణుగోపాల్‌ చేతిలో కేవలం 304 ఓట్ల తేడాతో పరాజయం పొందాడు.
- కేంద్ర మాజీ మంత్రి కేజే ఆల్పోన్స్‌ కంజిరపల్లి స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
ఇది ప్రజా విజయం... :
సీఎం పినరయి విజయన్‌
ఇది ప్రజావిజయం. ఈ గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది. ప్రజలు సరైన తీర్పుని చ్చారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మా పాలనపై విశ్వాసం ఉంచి వెన్నంటే ఉన్నారు. ఓట్లేసి ఎల్‌డీఎఫ్‌కు అండగా నిలి చారు. ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు. నాతో పాటు కార్యకర్తలు, మం త్రివర్గ సహ చరులు, ఎమ్మెల్యేలందరూ ఎన్నికల్లో చాలా కృషిచేశారు.కానీ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ గెలుపు సంబరాలు చేసుకోవద్దు. ముందు కరోనా వైరస్‌ను అంతం చేయాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.అప్పుడే మనకు నిజమైన ఆనందం,గెలుపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేరుస్తాం.
- నమిలికొండ అజయ్‌కుమార్‌
9490099140

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.