Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త పొద్దు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

కొత్త పొద్దు

Sun 25 Jul 06:16:08.245329 2021

'ఏంరో.. ఎటు పోతున్నవ్‌..?'' మాదిగ బజారు నుంచి వస్తున్న వెంకులుని అడిగిండు రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ నారాయణ.
    సాయంత్రాల్ల పొద్దు దిగే సూర్యుణ్ణి చూసెటందుకు ఇంటి ముంగిట మడత కుర్చీ ఏసుకొని కూసునే అలవాటుంది నారాయణకు. వేడి వేడి టీ ఆస్వాదించుకుంట... వచ్చేటోల్లని, పోయేటోల్లని పలకరించుకుంట మంచిచెడ్డలు విచారిస్తుంటడు.
      'దుర్గమ్మ గుడి కాడికి బాబారు' ఆగి సమాధానమిచ్చిండు వెంకులు. 'ఎమో పని మీద బోతున్నవ్‌..?'' 'ఝరి ఓటల్ల..! గారెలో బజ్జీలో తెద్దామని పోతున్న'
      'ఝరి ఎవరా? కొత్తగ హౌటల్‌ వచ్చిందా మనూర్లకి' ఆశ్చర్యపోయిండు నారాయణ.
      'ఔ బాబారు. ఎప్పుడొచ్చిర్రు మీరు ఊర్లెకి? అయ్యో... మీకు తెల్వలేదా ఇంకా? మూడు నెల్లు కావొస్తుంది ఆమె ఓటల్‌ పెట్టి. ఐద్రాబాద్‌ చేసినట్టె చేస్తుంది బాబారు. పొద్దున్నే ఇడ్లీ, దోశ, వడ, పూరీలు ఏస్తుంది. ఇడ్లీలైతే పెద్ద పెద్దగ ఏస్తుందనుకోరాదు. రెండు తింటే సాల్‌ కడుపు నిండుతుంది. ఏమన్న తెమ్మని పిల్లలు ఒకటే ఎంటబడుంటే ఇటొచ్చిన' చెప్పుకుంట పోతనే ఉన్నడు వెంకులు.
      'మేం మొన్ననే వచ్చినంరా. అంత బాగున్నరా? ఎట్లెట్లుంది ఊళ్ళె..?'' ఆరాగా అడిగిండు హైదరాబాద్‌లో పిల్లలకాడ మూడు నెల్లు ఉండొచ్చిన నారాయణ.
      'అట్లనా బాబారు. అందుకె ఇంక తెల్వలేదు. ఈరి బాబారు... ఈరీ... మన భోజ్య గాని తండాల ఉండేటోడు చూడు సేవా. ఆని బిడ్డ. కమ్మోల్ల ఇంట్ల జీతం ఉండేది. రెండో పెండ్లి చేసుకొని ఎల్లి పోయింది. గుర్తుకొచ్చిందా.. ?'' కండువా దులిపి భుజం మీద ఏసుకుని గడప పక్కన ఉన్న అరుగు మీద కూలబడ్డడు వెంకులు.
      'ఓ... ఆ పిల్లనా..! హీరీ. అదేందిరా... ఈడికొచ్చి హౌటల్‌ పెట్టుకుందా? పాతికేండ్లు అయ్యుంటది కదరా ఆమె పెండ్లయి. ఇంకా ఆమె ఆనవాల్లని పెండ్లి ముచ్చటే చెప్తరేందిరా.. నచ్చినోడ్ని పెండ్లి చేసుకుంటే అంత చిన్న చూపేందిరా? చదువు లేకున్న తెలివైన పనే చేసింది' బాధపడుతూ, కొంచెం పొంగిపోతూ, వెంకులు మీద కొంచెం కోపం చూపుతూ ఆశ్చర్యపోయిండు నారాయణ.
      'అట్ల అలవాటైందిలే బాబారు. కొడుకు మంగ్యా. బాగనే పెదోడైండు. డిగ్రీ సదివిండంట. మనూర్ల ఎరువుల దుకాణం పెట్టిండు. ఈమె ఓటల్‌ పెట్టింది. మంచిగనే నడుస్తుంది. అన్ని రకాలు వండుతుంది. పండ్లు అమ్మేటోల్లు, బట్టలు అమ్మేటోల్లు, ఉల్లిగడ్డలు అమ్మేటోలు... ఓ... ఒక్కల్లేంది? మధ్యాన్నం పూట ఆడనే తిని యాపారం సూస్కోని ఎల్లిపోతున్నరు.'' వివరంగా చెప్తున్నడు వెంకులు. -
      'అట్లనా..! ఆల్లింట్ల హీరీ ఒక్క తెలివైంది. గట్టిగుంటది ఏ ముచ్చట్లనన్న. ఏమన్న అయ్యి వచ్చిందటనా..? లేకుంటే మంచిగనే ఉండి ఈడనే ఉందామని వచ్చిందా..?'' నారాయణ ముఖంల ఆతత కనబడుంది.
      'బాగనే కష్టం జేసింది బాబారు. పిల్లలను మంచిగ సదివించిందంట. ఐద్రాబాద్‌ కాలేజీ పిల్లల ఆస్టల్ల వండి పెట్టేడు ఇష్టమైన పెండ్లి చేస్కున్నా దానికి సుఖం రుణంల లేదు. మొగడు తాగి తాగి సచ్చిండంట. ఎన్నేండ్లున్న ఎవ్వలకేం గాని పట్నంల ఒక్కరై ఏం ఉండాలని అనుకున్నదంట. అత్తగారూరు మైబునగరే అయినా అలవాటు లేని ఊరయింది కాదు. ఇంగ మనసు సచ్చి వచ్చిన్నని మొన్న మా ఆమెతోటి చెప్పిందంట. ఇప్పుడు యీడ బాగనే ఉందే. కూరలు గూడ బాగుంటున్నయని ఊరు ఊరంత అటే పోతున్నరు. బీపీ షుగర్లు వచ్చినకాన్నుంచి లంబడోల్లు అని ఎవ్వలు అనుకుంట లేరు. పొలం కాంచి వస్తవస్తనే ఆడ కొనుక్కోనొస్తున్నరు. ఇగ సాంబయ్య ఓటల్లనైతే బాబారు. ఈగలు దోమలు తోలుకుంటున్నడు' నష్టు ఆపుకుంట అన్నడు వెంకులు.
      నారాయణ పెదవులపై చిరునవ్వు విరబూసింది. కానీ, మెదడు మాత్రం హీరీకి ఏమై ఉంటుంది..? కళ్ళ ముందు పెరిగిన పిల్ల. ఇన్నేండ్లకు మల్ల ఈడికెందుకొచ్చింది.? పొలం గురించి కొట్లాడాలనుకుంటుందేమో..! రకరకాల ఆలోచనలతో నిండిపోయింది అతడి మెదడు.
      ''సరే బాబారు. నేను పోయెస్త. పగట్యాల వస్తలే. చిన్నమ్మను గూడ కలుస్త. ఉంటరుగ కొన్ని రోజులు' అంటూ లేచి కండువా సవరించుకున్నడు.
      'ఆ ఉంటం ఉంటం. సరే..! పోయి రా' సాగనంపి, కుర్చీ మడత పెట్టి, ఖాళీ కప్పు, కుర్చీ తీసుకొని లోపలికి వెళ్ళిండు.
      'ఏం చేస్తం చెప్పు మావయ్యా. ఎన్నాళ్ళని ఆడయీడ ఉండుడు? నాకు తెలిసినకాణ్నుంచి ఇదే నా ఊరాయే. యాడున్నా రెక్కల కష్టం తప్పదు గానీ మనూళ్లే ఉన్నట్టుంటాది? హైద్రాబాదుల్నే సదివిర్రు పిల్లలుగూడ. పిల్లను ఆడబిడ్డ కొడుక్కే ఇచ్చి పెండ్లి చేసిన. ఆడు పదే సదివిండు కానీ మంచోడు మావయ్యా. మైబూబ్‌నగర్‌లనే సొంతింట్ల ఉంటున్రు. నా పెనిమిటేమో తాగి తాగి లివరు, కిడ్నీలు పోయినరు. సచ్చిపోయిండు. రెండు లక్షలు దాంక పెట్టిన వైద్యానికి. ఇగ నా కొడుకు, నేను... ఇద్దరమే మిలిగినం.' 'యాభై ఏండ్లిచ్చినరు. ఇగనన్న కొద్దిగ నిమ్మలం కా..' అని చెప్పి మావోడు ఈడికి తీసుకొచ్చిండు మావయ్యా. 'ఉన్న పైసలు యాడ అయిపోతయో అని ఇగో ఈ జాగా కొన్న. రెండు గదులు ఏసిన. ఆడికి పెండ్లి అయితే సూద్దాం... ఆల్లకు నచ్చినట్లు కట్టుకుంటరుగా. చేసినకాడికి చేసిన. ఇగ వచ్చిన...' గొంతుల అదముకుంటున్న మాటలను పట్టి పట్టి చెప్తున్నది హీరీ.
      నారాయణ వింటున్నడు.
      'బతుకు మన సేతుల్లకు తీస్కోకపోతే నావలెక్క బిడ్డా. అదెటుపోతె అటుపోవుడు కాదు. దాన్నే మనం తిప్పాలె. అన్నడు.
      'నిజమే మావయ్యా. కానీ, అందరికి సాద్యమైతాదె. నన్ను సూస్తనే ఉన్నవ్‌ కదా. ఏం జేశిన? సెప్పుకుని ముర్వ. సూసి ఏడ్వ. ఏ దిగులు లేకుండా గడుస్తదనుకుంటానికి ఎకరాలెకరాలుండె. బతుకంత తీరని ఆకలేనాయె. మా అయ్యా... అట్లనే సచ్చె. రేపటి దినాన మేం గూడ అట్లనే పోతం. దోసుకునేటోడు దోసుకుంటనే ఉంటడు. ఉన్నోల్లు ఉన్నోల్లు అంటరు గానీ... ఆల్లే మనల్ని దోసుక తింటుంటిరి? ఈసారి ఎట్లనన్న గట్టిగ చేయాలె మామయ్యా. ఇప్పుడు నువ్వు చెప్తుండు. నేను నిలబడ్డ' హీరీ ముఖం ఎర్రబడింది. ఆవేశంతో ఊపిరి పీల్చుకుంటున్నది. ఆమె దఢంగ విశ్వాసంగ కనిపిస్తున్నది.
      ఏం చేస్తం చెప్పు. పలుకుబడి ఉన్నోడిదే రాజ్యమైపాయె. మనసంటోల్ల బతుకులు ఎప్పుడెక్కడ తెల్లార్లయొ వలకెరక సర్లే నేను పోతున్న. నిన్ను సూద్దామని దబదబా వచ్చిన. నీ పని చేసుకో బిడ్డా..!'' అనుకుంట లేచి నిలబడ్డడు నారాయణ.
      'అత్తమ్మను అడిగిన్నని చెప్పు. పని అయిపోయినంక వస్త కానీ ఇడ్లీలు ఏడేడిగ ఉన్నరు. తీస్కపో మావయ్యా' అంటూనే...
      'ఇడ్లీ ప్యాక్‌ బాంధ్‌' అని కొడుకును పురమాయించింది. అప్పటికే బండి ఎదురుంగ నిలబడిన గిరాకీ పనిల పడింది.
      'వద్దులే. తిన్నంకనే ఇటొచ్చిన. అత్త గూడ తిన్నది కానీ నువ్‌ పని చేస్కో..!' అంటూ ఆప్యాయతగ చెప్పి, టిఫిన్లు కొంటానికి వచ్చిన వారి పలకరింపులకు నవ్వుకుంట, జవాబులు చెప్పుకుంట ఇంటిబాట పట్టిండు.
      హీరీ బతుకంతా యుద్ధమే అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల బతుకు ముద్ద ముద్దకూ తండ్లాటే. సేవా, భార్య కషీ బాయి... ఇద్దరూ తండా నుంచి ఊళ్లెకి వచ్చి... ఊర్ల ఉన్న అందరి పశువులు అడవికి తీస్కపోయి కాసేటోల్లు. పొద్దుగూకంగ మల్ల ఎవరి పశువులు ఆల్ల ఇండ్లకు చేర్చి, మాపటేలకు ఆల్ల తండాకు పోయేటోల్లు. హీరీ వెనకాల ఇద్దరు చెల్లెండ్లు, ఇద్దరు తమ్ముండ్లు ఉండె. ఒక తమ్ముడు సరింగ ఎదగకుండనే పొట్టిగ, పొట్ట లావుగ ఉండి... పదేండ్ల వయసులనే సచ్చిపోయిండు. అసలెందుకు అట్లయిందని దవాఖానాల సూపించే సోయే లేకుండే ఆల్లకు. ఇంకో తమ్ముడు చేతందుతున్నడు అనుకున్నంతల మెదడువాపు వచ్చి చచ్చిపోయిండు. ఇగ మిగిలింది. ముగ్గురు ఆడపిల్లలే.
      సేవా, కమ్లీ పడుతున్న బాదలు చూసి, హీరీకి పదకొండేండ్లున్నప్పుడు కమ్మ రామారావు ఆల్లింట్ల జీతానికి కుదుర్చుకున్నడు. ఆయన భార్య సీతమ్మ హీరీకి చిన్న చిన్నగ పనులన్నీ నేర్పించింది. పశువులు కాసినందుకు సేవాకు, జీతానికి పని చేస్తున్న హీరీకి ఏడాదికి ఒకపాలు పంటలు పండంగనే వడ్లు వచ్చేటియి. ఆటితోనే సమచ్చరమంత గడుపుకునేటోల్లు. పదిహేనేళ్ళు ఉన్నప్పుడు మేనత్త కొడుకుతోటి హీరీకి పెండ్లి చేసిన్రు.
      'చిన్న పిల్లకు పెండ్లి వద్దురా..!' అని సీతమ్మ ఎన్నోసార్లు చెప్పి చూసింది.
      'నా చెల్లెలు కొడుకే అమ్మగారూ' అనేవాడు సేవా.
      మేనత్త ఇంట్లకి కోడలిగ అడుగుపెట్టిన హీరీ ఆర్నెల్లు గడవకముందే మల్ల రామారావు ఇంట్ల ఎప్పటిలెక్కనే పనిల చేరింది. వయసుల పదిహేనేండ్లు పెద్దాడైన హీరీ భర్త ఆమెను భార్య లెక్క సూడలేకపోతున్న అన్నడు. ఇంగేముంది..? హీరీని తీసుకొచ్చేసిండు సేవా. హీరీకి వయసొచ్చేదాకా సేవా మల్ల ఆమె పెండ్లి ఊసు తీయలేదు. కానీ బిడ్డ బతుకు ఆగం జేసిన్ననే దిగులుతోటే మనిషి వంగిపోయిండు.
      'పొలముంది అంటవ్‌ గానీ దాన్ని సొంతం చేసుకుంటే ఈ బాదలుండవురా' సేవా బతికి ఉన్నప్పుడు నారాయణ చెప్తుండేవాడు.
      'ఏ... నా ఒక్కనితోటి ఏమైతది బావా. అందరు కల్సి రావాలె. మంచిగ పంటలు పండే పొలాన్ని గుంజుకుని మాకీ గతి పట్టించిర్రు. పిల్లల కడుపుకింత అన్నం సరింగ పెట్టుకోలేక పోతున్నం..'కండ్లల్ల నీళ్లు తిరుగుతుండ సమాధానమిచ్చేటోడు.
      ''బాద పడకులే. ఏ యాళ్లప్పుడు తిన్నవో. బాయి కాడ చేతులు, కడుక్కుని రాపో. అన్నం తిందువు... మంచి రోజులు రాకపోతాయి...'' అంటూ ఓదార్చేది నారాయణ భార్య ముత్తవ్వ.
      'ఏమో అక్కా, తిండి సయిస్త లేదు. ఆగమాగమైతిమి..' అనుకుంటనే ఎక్కిళ్లు వచ్చేటట్లు ఏడ్సేవాడు నాగార్జున సాగర్‌ నిర్వాసితుడిగా గుర్రంపోడు పునరావాస కేంద్రానికి వలస వచ్చిన సేవా.
      'నువ్వన్న కలెక్టరుకు లెటర్‌ పంపు. నేను రాసిస్త. మీవోల్లను కూడగట్టుపో.'' అక్షరం ముక్క రాని సేవాను ఉత్సాహ పరిచేవాడు నారాయణ.
      'ఇనరు బావా. పొద్దున్న లేస్తే కడుపు తిప్పలే అయిపోతుండె. ఎన్ని బూములుంటె యేంది బావా.. బతుకు దెరువు ఎతుక్కోవాల్నాయి. ఆపీసుల సుట్టు తిరుగుతె మాడిపోతం.'' అన్నం తినుకుంట నిరాశగ చెప్పేటోడు.
      'ఎట్టరా మరి?'' బాధపడిపోయేటోడు నారాయణ
      'ఈసారి ఎట్లనన్న క్లియరెన్సు రావాల్సిందే. మన పిల్లల కన్నా ఇది పనికి రావాలి.'' పట్టుదలగా ఉన్నడు రబ్బానీ. పాతిక ఎకరాలకు వారసుడైన రబ్బానీ తాత, నాయనమ్మల కుటుంబం పెదవీడు గ్రామంల స్థిరపడింది. రబ్బానీ తండ్రి ఖాజా మియా టైలరింగ్‌ చేస్కుంట, సీజన్‌ టైంల కూలీనాలీ చేస్కుంట ఆరుగురు పిల్లలను సాకిండు. ఆ కష్టంతోనే అయిదుగురు ఆడపిల్లలకు పెండ్లిల్లు చేసిండు. పెండ్లిల్లు అయ్యేదాంక ఆ ఆడపిల్లలు గూడ నాట్లకే పోయ్యేటోల్లు. రబ్బానీ.... ఆల్ల ఊరికి దగ్గర్ల ఉన్న సిమెంటు ఫ్యాక్టరీల రోజూ కూలీలెక్క పని చేస్తుండు.
      'ఏమొస్తదో ఏమో. తిరిగెటందుకైనా పైసలు గావాలె కదా. పనికి పోకుండ ఉంటె తిండికి ఎలలేదు. పిల్లల స్కూల్‌ టీచరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఫీజు కోసం.' అన్నడు భీమ్లా వేప పుల్లను చేతుల్ల తిప్పుకుంట.
      'అట్ల కాదన్న. మంచిగ పంటలు పండే పొలాన్ని గౌర్మెంటోల్లు గుంజుకున్నరు. సరే..! నీల్లు పార్తె పచ్చగైతమనే కదా మన తాతముత్తాతలు ఆలోసించింది. ఆల్ల తరువాత తరాలు మంచిగుంటయని ప్రాజెక్టు రావాలని కోరుకున్నరు. ఊరు మీద కొట్కలాడే పానానికి నచ్చజెప్పుకొని పట్టా భూములు ఇచ్చేసిర్రు. పొలానికి పొలం అన్నరు. ఇంటికి ఇల్లు అన్నరు. దేవరకొండల చందం పేట ఏంది? చందంపేటల గువ్వల గుట్ట ఏంది? యాడ బత్కేటోల్లం మనం. సూడుర్రి ఇగ. హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం, మఠంపల్లి మండలం. అడవిల తెచ్చి పడేసిన్రు. తరాలు మారినయి. గుర్రంపోడు తండా ఇప్పుడు మన ఊరు అయిపాయె. ఈడ పట్టాలు చేస్తరని సూస్కుంట సూస్కుంటనే తాత ముత్తాతలు పాయె. ఇప్పుడున్న మనకు ఒక్కొక్కల్ల తల్లిదండ్రులు ఎల్లిపోతనే ఉన్నరు. ఇంగ మనం గూడ నిరుపేదలుగనే బతుకుతుంటిమి. మన పిల్లలకన్న ఇంత భూమియ్యాల్నే! ఏమంటరు..!?'' ఆవేశంగ చెప్పుకుంట పోతున్నడు భూక్యా నాయక్‌ కొడుకు తేజ్యా. తేజ్యాకు పదిహేను ఎకరాల పొలం రిజిస్టర్‌ అయి ఉంది.
      'ఎహె ఆపుర్రి. ఇట్ల చెప్పుకుంట పోతే ఏమొస్తది..? మంచిగ పండేటి భూములు తీస్కునే దేంది? మనకు అడవిని అప్పగించుడేంది. పాపం.. మన పెద్దలు పురుగూ పుట్రలకోర్సిర్రు. రాయీరప్పల్ని ఏరిపారేసిర్రు. అడవిని అప్పగిస్తే సాగు అయ్యేటట్లు చేసిర్రు. బతుకంత కాయకష్టం చేసిన ఆల్లకు దక్కిందేంది? పెద్ద మనుసులు రాజకీయం చేస్తున్నరు. మనల్ని బెదిరిస్తున్నరు. నాయకుల కన్ను పడ్డది. మన హక్కు కోసం మనం కష్టపడదం. కష్టమో నష్టమో... మన తరంతోటి ఖతం చేద్దం. ఏమంటరు?'' అందరి దిక్కు సూస్కుంట అడిగింది హీరీ. నాగార్జున సాగర్‌ నిర్వాసితుల పునరావాస హక్కుదారులు పెట్టుకునే మీటింగుకు హీరీ వచ్చిన ప్రతిసారీ కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు నింపి పోతుంటది. హీరీ వచ్చిందంటే ఎడారి గుండెల్ల వాన కురిసినట్టే ఉండేది ఆల్లకు. ఎక్కడో పాతాళానికి తొక్కి పెట్టుకున్న ఆశలకు రెక్కలు వచ్చేటియి.
      'ఇప్పుడేంది? మనం ధర్నా చేద్దమంటవా హీరీ?'' అడిగిండు బాలు. బాలూ నాయక్‌ తల్లి గోరి బాయి పట్టా అయిన భూమిల తిరగాడాలని కుషాల్‌ పడ్డది. కంపెనీ పెడ్తమని వచ్చినోల్లు 1800 ఎకరాల భూములను కొనుక్కున్నమని, అటువైపు కన్నెత్తి చూసినా చంపేస్తమని బెదిరించిర్రు. ఇన్నేండ్లు ఆల్శ్యంగనైన మా భూములు మాకు వస్తయని గంపెడాశ అయినా ఉండేది. కంపెనీ ఓల్ల బెదిరింపులకు మనసు చెదిరి, గుండె ఆగి చచ్చిపోయింది. ఇప్పుడు గౌర్మెంటోల్లకాడ ఉన్న రికార్డులను ఎట్లనన్న బయటకు తీయాలని పట్టుపడుండు బాలూ నాయక్‌. ఇన్నేండ్లకు సపోర్టు దొరికిందని, ఎట్లనన్న సచ్చేలోపట్ల పట్టా కండ్ల చూడాలన్నది బాలూ నాయక్‌ తండ్రి లాకు నాయక్‌ మొండి తనం.
      'సరే గాని మనం వచ్చే సోమారం నాడు ఎమ్మార్వో ఆఫీసుల ధర్నాకు కూసుందాం. ఏమంటరు?'' అన్నడు బాలాజీ వేప చెట్టు నీడ తరిగి, తగిలే ఎండ నుంచి నీడవైపుకు జరుగుతూ.
      'అట్లనే. మంచి ఆలోచన చేసినవ్‌. ఇంగ ఈసారి నాకలు పెట్టకుర్రి. ఐద్రాబాదుల ఉన్నోల్ల యినా సరే. అయాల్టికి రావా ల్సిందే.'' హీరీని, బాలాజీని చూస్కుంట రబ్బానీ అన్నడు.
      'సరే గానీ, ఇగ అందరికి ఫోన్లు చేసి ఆరోజు రమ్మనుర్రి. పహాణీలు తీసుకొని రమ్మని సెప్పుర్రి. ఇంగపోదాం పాండి ఇంటికి. ఎండ ఎక్కుతనే ఉంది.' అన్నడు బాలాజీ. అందరూ ఎవరిండ్లకు ఆల్లు వెళ్ళిపోయిర్రు చెట్టు నీడను ఖాళీ చేసి.
      'అడగని తరం పోయింది. నోరు లేని తరానికి ఏమిచ్చిర్రు? ఏం దక్కలేదు. మన తరం దాంక సదువు, వయసు... అన్నీ పోగొట్టుకున్నం. ఇగ మన పిల్లల కోసమన్న భూమి ఉండాలి' బాలాజీ చెన్నా అన్నడు. తెలంగాణ ఉద్యమంల విద్యార్థి ఉద్యమ నాయకుడుగా పాల్గొన్నడు బాలాజీ. ఇంట్ల ఉన్న పశువులు ఒక్కటొక్కటిగ అమ్ముకుంట చదివిచ్చిర్రు తల్లిదండ్రులు. ఎంబీఏ చేసినంక ఉద్యోగం చేద్దామనకున్నడు. కానీ, రెండు వేల మందికి సంబందించిన బూమి కేసు ఏ లాయరూ పడలేడు. ఒక్యాల వచ్చినా కంపెనీ అని చెప్తున్న పెద్దలకు బయపడి ఎనక్కు తగ్గుతున్నరు. దీంతోటి సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కడుగు ముందుకైతే ఐదు అడుగులు ఎన్నకైతుంది. ఈ బాదలన్ని చూసిన బాలాజీ తన పేద గిరిజనుల కోసమే లా చదివిండు. ఇప్పుడు సొంతంగ కేసులు నడుపుతుండు. ధర్నాకు పెద్ద దిక్కయిండు.
      తరువాత రోజున మఠంపల్లి మండలంల జరిగిన ఉద్యమాన్ని పత్రికలన్ని పెద్ద ఎత్తున వార్తలు రాసినయి. రోజుకొక పార్టీ నాయకుడు వచ్చి ధర్నా చేసెటోల్ల పక్కన కూసొని మద్దతు పలికి పోయిర్రు. ధర్నా చేసినోల్లు వారం రోజులు జైలుకు పోయిర్రు. నిజాలు బయటపడ్డ తరువాత ఇద్దరు ఎమ్మార్వోలు సస్పెండ్‌ అయ్యిను. వాళ్లు 430 ఎకరాల భూములను వేరేవాళ్ళ పేర్లతోటి పట్టాలు జారీ చేసిన్రని అభియోగాలు ఉన్నయి. కాస్తో కూస్తో సదువుకున్న పిల్లలు ఉద్యమాలు చేస్తుంటే నిశ్శబ్దంగా వాళ్లనే అనుసరించిండు సేవా. పాతిక ఎకరాల పొలం వస్తే ఉన్న ముగ్గురు బిడ్డలకు కొంతనన్న భరోసా ఉంటదనుకున్నడు. చేతులారా బిడ్డ బతుకు పాడు చేసిన్ననే దిగులుతోటే మంచం పట్టిండు. ఆ తరువాత ఇద్దరు అమ్మాయిల పెండ్లి విషయాన్ని గూడ పట్టించుకోలేదు. ఒక రోజు కనుమరుగై పోయిండు. బూముల విషయం ఎప్పటిలెక్కనె ఆల్ల ఆల్ల పనుల్ల పడ్డరు.
      'ఒక్కొక్కల్లు పిల్లగాల్లకు సదువులు చెప్పించి మంచి బతుకులు ఇస్తుంటే... మనమేంది ఇంకా పూట తిండికోసమే తనుకులాడుతున్నం?' రబ్బానీని అడిగింది హీరీ. ఆమెకు వచ్చే కోడలికన్న ఇంత బతుకు భరోసా ఉందని చూపించాలను కుంటుంది ఆమె. ఊరికి వచ్చి, ఇల్లూ, హెటల్‌ తెరిపిన పడ్డయని అనిపించంగనే దష్టి భూముల పట్టావైపుకు మల్లించింది.
      'లక్ష్మణ్‌ నాయక్‌ బిడ్డలున్నరు సూడు... సక్కూ క్రిష్ణా బాయి మిరప ఏర బోతున్నరు. ఓ... చానామంది పోతున్నరు. ముత్యాలంపాడు, తంగెడ, దాచేపల్లి, మాచెర్ల, ఏటవతల ఉన్న ఊర్లకు మనూరోల్లే కూలీలు.' నిట్టూర్చిండు రబ్బానీ.
      'ఏంచేస్తం? ఇట్లయినం మనం. భూములు ఉండీ లేనోల్లమైతిమి. పూట గడవాల్నంటే పోవాల్సిందేనాయె.' దిగులుగా అన్నది హీరీ.
      'మారు బాయి సూడు ఎట్ల సచ్చిందో. పిల్లలు ఆగమాగమైనట్లే. మొగుడు తాగుబోతయిండు. పట్టించు కుంటనే లేడు. ఏ సుట్టాలు చూసిన తల్లి లెక్క సూస్తారు. చిన్నబోయిన గొంతుకతోటి చెప్పిండు.
      'ఎట్ట జరిగిందన్నా' బాధగ అడిగింది.
      'మన ఊర్ల రోడ్ల సంగతి నీకు ఎర్కేనాయె. ఇప్పుడు కూలీలను తీస్కపోయేటందుకు కాంట్రాక్టర్లు వస్తుర్రు. ఆల్లను ట్రాక్టర్లల్ల తీస్కబోతుంటే ఒక ట్రాక్టరు ఏటి కట్ట మీదుంగ బోల్తా పడ్డది. చానామందికి దెబ్బలు తగిల్నరు. మారు బాయి అక్కడికక్కడ్నే పానం ఇడ్సింది.''
      'గోరం జరిగిందే.' సానుభూతిగ చూసింది. మళ్ళీ తనే అడిగింది.
      'మారు బాయి ఓల్లకు ఎన్ని ఎకరాలున్నదే'
      'ఉన్నట్టుంది పదెకరాలు.' సాలోచనగ అన్నడు రబ్బానీ.
      'ఆ పిల్లల పేర్లు కూడ మన లిస్టులో రాయిద్దాం.' అన్నది హీరీ.
      'పలుకుబడి ఉన్నోల్లదే -
      రాజ్యమైందే హీరీ. ఏ లీడర్ను కలిసినా చిన్న పనే అంటున్నరు. సమత్సరాలు గడుస్తున్నా సప్పుడు జేస్తలేరు. పార్టీలోల్లకు బాగ ముడుతున్నయి. దాంతోటి ఆల్లు సప్పుడు జేస్తలేరు. ఈసారి సర్వే చేయమని గట్టిగ అడుగుదాం. హద్దులు గీసేదాంక వదిలి పెట్టొద్దు. ఏమంటవ్‌?''
      'ఔ.. మనంగూడ ఒకపని చేద్దాం. అందరం తలా ఇన్ని పైసలు అని వసూలు చేసి ఆ ఆపీసర్ల చేతుల పోద్దాం .'' ఏ ఊకో. లక్షలు లక్షలు తింటున్నోల్లకు మనం ఇచ్చే చిల్లర పైసలు సరిపోతారు.'' కొట్టిపారేసిండు రబ్బానీ.
      'అదేనే కిటుకూ. నోర్లు కట్టుకుందాం. ఆ చిల్లర పైసలే కూడబెడదాం. ఆ మాటే ఆపీసరు చెప్పి పైసల మూట చేతిలపెడదాం. ఎట్లుంటది. ఆలోసించు.' అన్నది హుషారుగ. 'నిజమే హీరీ. బాగనే ఉంది.
      కానీ మనోల్లు ఒప్పుకుంటరంటవా?'' 'ఎందుకు ఒప్పుకోరు? ఇది కాకుండ ఇంకేమన్న ఐడియా ఉంటే చెప్పమందాం. లేకుంటే ఇదే కరెక్టు అనుకుంటరు అందరు. ముందుగాల గా లాయరు బాలాజీకి ఫోన్‌ చేసి చెప్పు.'' అన్నది.
      'సరే... ఇగో చేస్తున్న' అంటూ బాలాజీకి రింగ్‌ చేసిండు రబ్బానీ. ఫోన్లనే విషయం వివరించిండు. కొద్దిసేపైన తరువాత ఫోన్‌ పెట్టేసిండు.
      'మస్తుంది. ఆలోచన అన్నడు. శనివారం వస్తడంట మాట్లాడుకుంటానికి. ఎట్లనన్న అమలు చేద్దామంటుండు.'' రబ్బానీ గొంతులో కొత్త ఉత్సాహం పొంగుకొస్తున్నది.
      'ఈ లోపట అందరిని కూడగడదం. నేను గూడ ఊళ్లికే వచ్చిన కాబట్టి చానా టైం దొరుకుతదిలే. ఇంగ మన గొంగడిని మనమే కదపాలె. ఏమంటవ్‌ రబ్బానన్నా?'' అడిగింది.
      'అంతే. తెలంగాణ ఉద్దెమానికి ఎంత చరిత్రున్నదో మన కొట్లాటకు అంత చరిత్ర అయింది. ఈసారి తిండి లేదు. కూలీకి పోవాలె అనొద్దు. ముఖ్యమంత్రి దాంకనైనా పోదాం.'' పట్టుదలగా అన్నడు రబ్బానీ.
      'ముందుగాల్ల ఈ ముక్క నారాయణ మామకు చెప్పి పత్రం రాయిద్దాం. మన బాదితుల కుటుంబాల సంతకాలు చేపిచ్చి కలెక్టరుకు ఇచ్చే పనికూడా మొదలు పెడదాం. కష్టం చేసుడు మనకు కొత్తా? మన వారసత్వమే ఎడారి గొంతు తడపడం కదా.. దీన్ని మనమే సాధించాలె' స్థిరంగా అన్నది. తన కొత్త నిర్ణయం మారే బతుకును కండ్లల్ల చూపుతుండంగ.
- నస్రీన్‌ ఖాన్‌, 9652432981

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.