పెత్రమాస నుంచి తెలంగాణలో చేసుకునే పండుగ ఆడపిల్లల పండుగ. ఆడపడచులు ఎల్లకాలము సంతోషంగా బతకాలని కోరుకునే పండుగ. ఆడబిడ్డలందరు కలిసి ఒక చోట కూడి తొమ్మిది రోజులూ తమ తమ ఆలోచనలను, సుఖదు:ఖాలను కలబోసుకునే పెద్ద పండుగ బతుకమ్మ. అందులోనూ ఆడపిల్లలకు ప్రతీకగా నిలిచే పూలతో చేసుకునే పండుగ. ప్రకృతిలోని రకరకాల పూలను, రంగురంగుల పూలను పరచి ఆటపాటలతో అలరించే పండుగ. బతుకమ్మా బతుకు! అని ప్రతి ఆడపడుచుకూ దీవెనలందించే పండుగ. ఈ కోరుకోవడం ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే వున్నది. ఎందుకంటే ఆడపిల్ల సమాజంలో బతకలేకపోతున్నది. సంతోషంగా జీవితాన్ని గడపలేకపోతున్నది. పండుగలను, పండుగలలోని రూపాలను కూడా మార్కెటైజ్ చేయటంలో, రాజకీయ ఈవెంట్స్‌గా మార్చటం, సాంస్కృతిక ఆధిపత్యానికి వినియోగించడం పెరిగింది కానీ, అసలు ఆడపిల్లల బతుకు నానాటికీ దిగజారుతూనే వున్నది. వివక్షత, హింస, దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమై పోయాయి.
పండుగలయినా పబ్బాలైనా ప్రజలందరూ ఆనందంగా గడపాలనే ఆకాంక్ష అందులో వుంటుంది. అది సాంస్కృతిక వారసత్వమయినా సరే. మనుషులు బాగుండాలి. సారాంశంగా కోరుకునేది అదే! బాగుండాలి అనే కోర్కెలోనే బాగాలేని తనం వెన్నాడుతోందనే ధ్వని స్పష్టంగానే అర్థమవుతుంది. అసలు బాగుండటమంటే ఏమిటి? ఏముంటే బాగున్నట్టు! ఎలా వుంటే బాగున్నట్టు! ఇవి చర్చించాల్సిన విషయాలే. ప్రాథమికంగా ఆలోచించినట్లయితే తినటానికి తిండి వుండాలి. తాగటానికి రక్షిత మంచినీళ్లూ వుండాలి. ఉండటానికి ఇళ్లుండాలి. కట్టుకోవటానికి గుడ్డ వుండాలి. తిండీ బట్టా వుండాలంటే ఆదాయముండాలి. అంటే ఏదో ఒక పని, ఉద్యోగం దొరకాలి. అనారోగ్యమొస్తే వైద్య సదుపాయం వుండాలి. విజ్ఞానాభివృద్ధి జరగటానికి విద్య అందుబాటులోకి రావాలి. ఇవి మానవ నాగరికతలో మనుషులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాలు. వీటన్నింటి తర్వాత మానసికోల్లాసానికి సాంస్కృతికావసరాలూ వుంటాయి. సంగీతం, నృత్యం, గానం, వాయిద్యం, నటన, నాటకం, సినిమా, చిత్రకళ, శిల్పకళ, కవిత్వం మొదలైనవెన్నో అవసరమవుతాయి. సరే ఆ చర్చ చాలా పెద్దది. ఇవన్నీ తీర్చుకునే సమాజంలో సామరస్యత, శాంతియుత జీవనం, సహనం, సమానత, సౌభ్రాతృత్వం మొదలైన భావనలతో సమాజ గమనం సాగుతుండాలి.
ఇవన్నీ ఇంకా సమకూరలేదు కనుకనే పండుగలలో, దేవుళ్లను వేడుకోవడం, కోరుకోవడం చేస్తుంటారు. సామూహికంగా కొలుస్తుంటారు. ప్రకృతి వీటన్నింటినీ మనుషులకు సమకూరుస్తుందనే విశ్వాసంతో ప్రకృతిని పూజించటం ఆదిమ కాలం నుంచీ ఒక సంప్రదాయాంగా వస్తూ వున్నది. అందుకనే దీపాలను వెలిగించి, చుట్టూ వున్న చీకటిని తొలగించుతారు. అంటే బతుకులోని చీకటిని పారద్రోలటం అనేది ఇందులో అంతస్సారం. చెట్టూ పుట్టలను కూడా పూజిస్తారు. చెట్టు ఫలాలిస్తుందని, పుట్టలోని పాములు చంపకుండా బతకనిస్తాయని నమ్మకం. పంట బాగా పండాలని, నీరు సమృద్ధిగా పారాలని, జబ్బులు రాకుండా దేవత చల్లగా చూడాలని మొదలైన నమ్మకాలు, భక్తి తరతరాలుగా కొనసాగుతూ వస్తూ వున్నది. అయితే మానవుడే అన్నింటినీ శోధించి, ప్రయోగించి, శ్రమించి, తనకు కావలసిన అవసరాలను తీర్చుకోవడం , విజ్ఞానాన్ని వృద్ధిచేసుకోకడమూ జరుగుతూనే వుంది. అయితే ఆ విజ్ఞానమంతా అందరికీ అందుబాటులోకి రాకపోవటం వల్ల అసమానతలు, హెచ్చుతగ్గులు, దు:ఖము సమాజంలో ఏర్పడింది. అంటే మనుషులందరికీ దక్కాల్సిన, చెందాల్సిన వసతులు, సౌకర్యాలు, అవసరాలు దక్కకపోవటానికి మానవ సమూహంలోని ఒక భాగమే కారణంగా నిలుస్తున్నది.
బతుకమ్మా బతుకమ్మా! అని మనం పెత్రమాస నుంచి తెలంగాణలో చేసుకునే పండుగ ఆడపిల్లల పండుగ. ఆడపడచులు ఎల్లకాలము సంతోషంగా బతకాలని కోరుకునే పండుగ. ఆడబిడ్డలందరు కలిసి ఒక చోట కూడి తొమ్మిది రోజులూ తమ తమ ఆలోచనలను, సుఖదు:ఖాలను కలబోసుకునే పెద్ద పండుగ బతుకమ్మ. అందులోనూ ఆడపిల్లలకు ప్రతీకగా నిలిచే పూలతో చేసుకునే పండుగ. ప్రకృతిలోని రకరకాల పూలను, రంగురంగుల పూలను పరచి ఆటపాటలతో అలరించే పండుగ. బతుకమ్మా బతుకు! అని ప్రతి ఆడపడుచుకూ దీవెనలందించే పండుగ. ఈ కోరుకోవడం ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే వున్నది. ఎందుకంటే ఆడపిల్ల సమాజంలో బతకలేకపోతున్నది. సంతోషంగా జీవితాన్ని గడపలేకపోతున్నది. పండుగలను, పండుగలలోని రూపాలను కూడా మార్కెటైజ్ చేయటంలో, రాజకీయ ఈవెంట్స్‌గా మార్చటం, సాంస్కృతిక ఆధిపత్యానికి వినియోగించడం పెరిగింది కానీ, అసలు ఆడపిల్లల బతుకు నానాటికీ దిగజారుతూనే వున్నది. వివక్షత, హింస, దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమై పోయాయి. స్త్రీని శక్తిగా కొలుస్తూనే సమాజంలో మహిళను అబలగా అశక్తురాలుగా దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. నిర్భయ సంఘటనలు, హత్రాస్ హత్యాదుర్మార్గాలు కొనసాగుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో అంకిత భండారి అనే అమ్మాయి రిసెప్షనిస్టుగా పనిచేస్తుండగా ఆమె తను చెప్పినట్లు లొంగిపోలేదని యజమాని హత్య చేయటం ఎంత దారుణ ఘటన. అధికార నాయకుల కొడుకులే ఇలాంటి అరాచకానికి పాల్పడటం అత్యంత దారుణం. ఇంకా ఎవరు రక్షణ కల్పిస్తారు?
బతుకమ్మా అని పండుగలు, సంబురాలు ఈవెంట్లు చేయటమేకాదు, ఆడపిల్లల బతుకులు ఆనందంగా కొనసాగేందుకు కావాల్సిన చర్యలు చేపడితేనే నిజమైన పండుగ వెలుగులు అందరికీ అందుతాయి. ఆడపిల్లలు మంచిగా బతకటం కోసం, సమానంగా బతకటం కోసం అందరం కృషి చేయాలి.
Sat 01 Oct 23:04:47.327485 2022