Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా!

Sun 13 Nov 04:58:38.123488 2022

              రిషి సునాక్‌ మన వాడు ! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు ! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు! భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ ! ఇలా అక్టోబరు 25న బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త, 25న పదవీ స్వీకారం 31న విధాన ప్రకటన అంటూ కొండంత రాగాలు. యువతలో పెండ్లికి ముందున్న ఉత్సాహం, ఊపు, రంగుల కలల గురించి తెలిసిందే. తాళిపడిన తరువాత గానీ తత్వం తలకెక్కదు. ఇప్పుడు పది రోజులు కూడా గడవక ముందే రిషి సునాక్‌ ఆ దశలో ఉన్నాడని వార్తలు. ఊరకుక్కల్లా అధికారం, లాబీలతో కొట్లాడుకొనే బ్రిటన్‌లో రిషి సునాక్‌ పదవీ కాలం ఎంత అనే ప్రశ్నలు కూడా కొందరు లేవనెత్తారు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారినందున అలాంటి ఊహాగానాలను కొట్టివేయగలమా? అంతకు ముందు ప్రధాని లిజ్‌ట్రస్‌ బ్రిటన్‌లో అతి తక్కువ కాలం కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి రికార్డు నెలకొల్పుతుందని ఎవరైనా ఊహించారా? ఎవరేమనుకున్నా రిషి మంచి చెడ్డల గురించి వివరాల్లోకి వెళదాం!
                 బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ను కన్సర్వేటివ్‌ పార్టీ ఎన్నుకోగానే మనవాడు, భారతీయుడు, హిందువు అంటూ మన మీడియా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, ఏకంగా చర్చలే నిర్వహించారు. ప్రధాని పదవి ఎంపికకు ముందు హిందూ పూజారులను కలిశారంటూ కొన్ని ఫొటోలను కూడా పెట్టారు. అంతకు ముందు ఆవులు, గుడులు గోపురాలను సందర్శించినప్పటి చిత్రాలవి. అంతేకాదు ప్రధానిగా పదవీ స్వీకారాన్ని కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు ముందే వాట్సప్‌లలో ప్రచారం జరిగింది. ప్రమాణ స్వీకార సందర్భ ఫొటోలు గానీ, వీడియోలుగానీ ఎక్కడా దొరకలేదు. గతంలో ఎంపీగా గెలిచినపుడు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు వార్తలు వచ్చాయి.
విదేశాల్లో భారతీయ మూలాలు :
31వ స్థానంలో రిషి సునాక్‌!
భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు విదేశాల్లో ప్రధాన పదవి స్వీకరణ ఇదే ప్రధమం అన్నట్లుగా కొందరు రిషి గురించి చిత్రించారు. అనేక మంది నిజమే అని నమ్మారు. నిజానికి అతనొకడు మాత్రమే, ఇంతకు ముందు, ఇప్పుడు ఎందరో ఉన్నారు. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రస్తుతం భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్‌ పని చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలిస్తే తరువాత అధ్యక్ష పదవికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన ఒక సంస్థ భారతీయ మూలాలు ఉన్న వారు ఎంత మంది, ఏ దేశాల్లో ఏ పదవుల్లో ఉన్నారో తెలుపుతూ 2021లో 200 మందికి పైగా ఉన్న ఒక జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 15 దేశాల్లో వివిధ బాధ్యతల్లో 60 మంది దేశాధినేతలు, కేబినెట్‌ మంత్రులు ఉన్నారు. ఆరుచోట్ల దేశాధినేతలుగా ఉన్నారు.
మంత్రులు, ఎంపీలుగా పనిచేసిన వారిని మినహాయిస్తే ప్రధాని, అధ్యక్షులుగా పని చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. మారిషస్‌లో ఎందరో భారత మూలాలు ఉన్న వారు దశాబ్దాల తరబడి అధినేతలుగా ఉన్నారు. ప్రధానిగా శివసాగర్‌ రామ్‌ గులామ్‌ 14 ఏండ్ల 110 రోజులు, అనిరుద్‌ జగన్నాథ్‌ ప్రధానిగా 18 ఏండ్ల 225 రోజులు, అధ్యక్షుడిగా 8ఏండ్ల 176 రోజులు, వీరస్వామి రింగడూ అధ్యక్షుడిగా 110 రోజులు, కాసమ్‌ ఉతీమ్‌ అధ్యక్షుడిగా 9 ఏండ్ల 230 రోజులు, ప్రధానిగా నవీన్‌ రామ్‌గులామ్‌ 14ఏండ్ల 59 రోజులు, అధ్యక్షుడిగా కైలాష్‌ ప్రయాగ్‌ రెండేండ్ల 312 రోజులు, అమీనా గురీబ్‌ ఫకీమ్‌ అధ్యక్షురాలిగా రెండేండ్ల 291 రోజులు, ప్రస్తుతం ప్రధానిగా 2017 జనవరి 23 నుంచి ప్రవింద్‌ జగన్నాధ్‌, అధ్యక్షుడిగా పృధ్వీసింగ్‌ రూపన్‌ 2019 డిసెంబరు రెండు నుంచి కొనసాగుతున్నారు.
పోర్చుగల్‌ ప్రధానిగా ఆల్‌ఫ్రెడో నొబెరా డి కోస్టా 86 రోజులు, అక్కడే ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఆంటోనియో కోస్టా 2015 నవంబరు 26 నుంచి కొనసాగుతున్నారు. మలేషియాలో ప్రధానిగా మహతిర్‌ మహమ్మద్‌ 24 ఏండ్ల 38 రోజులు పనిచేశారు. సింగపూర్‌లో ప్రధానిగా దేవన్‌నాయర్‌ మూడేండ్ల 155 రోజులు, అధ్యక్షుడిగా ఎస్‌ఆర్‌ నాథన్‌ పన్నెండేండ్లు, ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న హలీమా యాకబ్‌ 2017 సెప్టెంబరు నుంచి కొనసాగుతున్నారు. సురినామ్‌ అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్‌ ఫెడరిక్‌ రామదత్‌ మిసియర్‌ ఐదేండ్ల 351 రోజులు, ప్రధానిగా ఎరోల్‌ అలీబక్స్‌ 316 రోజులు, ప్రధానిగా ప్రతాప్‌ రాధాకిషన్‌ 264 రోజులు, ప్రధానిగా రామసేవక్‌ శంకర్‌ రెండేళ్ల 333 రోజులు, ప్రస్తుతం అధ్యక్షుడిగా చాన్‌ సంతోకి 2000 జూలై 16 నుంచి కొనసాగుతున్నారు.
గుయానా (లాటిన్‌ అమెరికా) అధ్యక్షుడిగా చెడ్డీ జగన్‌ నాలుగేండ్ల 148 రోజులు, అధ్యక్షుడిగా భారత్‌ జగదేవ్‌ 12 ఏండ్ల 112 రోజులు, డోనాల్డ్‌ రామావతార్‌ మూడేండ్ల 164 రోజులు అధ్యక్షుడిగా, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఇర్ఫాన్‌ ఆలీ 2020 ఆగస్టు నుంచి పని చేస్తున్నారు. కరీబియన్‌ దేశమైన ట్రినిడాడ్‌- టుబాగో ప్రధానిగా వాసుదేవ పాండే ఆరేండ్ల 45 రోజులు, ప్రధానిగా కమలా ప్రసాద్‌ విశ్వేశ్వర్‌ ఐదేండ్ల 108 రోజులు పని చేశారు. ఫిజీ ప్రధానిగా మహేంద్ర చౌదరి ఏడాది 8 రోజులు, ఐర్లండ్‌ ప్రభుత్వ అధిపతిగా లియో వరద్కర్‌ మూడేండ్ల పదమూడు రోజులు, సిషెల్స్‌ అధ్యక్షునిగా 2020 అక్టోబరు 26 నుంచి వావెల్‌ రామ్‌ కల్వాన్‌ పని చేస్తున్నారు. ఈ వరుసలో రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా 2022 అక్టోబరు 25 నుంచి పదవిలో ఉన్నారు.
ఈ జాబితాను చూసినపుడు రిషి సునాక్‌కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వీరంతా భారత మూలాలు ఉన్నవారే. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు? సమాధానం చెప్పేవారెవరూ లేరు. ఒకటే కారణం. ప్రస్తుతం మన దేశంలో కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో తాము హిందూత్వ వాదులమని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నామని అనే వారు తామరతంపరగా ఉన్నారు. వారు సృష్టించిన వాతావరణం కారణంగా హిందువు, భగవద్గీత మీద ప్రమాణాల గురించి పెద్దఎత్తున ప్రచారం జరిగింది తప్ప బ్రిటన్‌లో పట్టించుకున్నవారు గానీ ఒక క్రైస్తవ దేశంలో ఇదేమిటని అభ్యంతరం తెలిపిన వారు గానీ లేరు. ఎలాంటి చర్చ లేదు. ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు? ఎలాంటి శక్తులు ఈ రంగంలోకి వచ్చాయో బాబ్రీ మసీదు కూల్చివేతప్పుడు ఉత్తరాది పత్రికల తీరుతెన్నులు వెల్లడించాయి. ఇప్పుడు ఆ శక్తులు దేశమంతటికీ విస్తరించాయి. దానికి నిదర్శనమే రిషికి అవసరానికి మించి ఇచ్చిన ప్రచారం.
బ్రిటన్‌ చరిత్రలో మరో అధ్యాయం !
కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్‌ను బ్రిటన్‌ నూతన ప్రధానిగా అక్టోబరు 25న రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరేండ్ల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. ఆమె రాజీనామాతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది.
బ్రిటన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన రెండవ క్రైస్తవేత రుడిగా, తొలి హిందువుగా రిషి సునాక్‌ చరిత్రకెక్కాడు. అతని భారతీయ మూలాల కంటే హిందువు కావటంతోనే మన దేశంలో మీడియా, సామాజిక మాధ్యమంలో ప్రచారం జరిగింది. వలస పాలకులు ఎవరైనా ఆఫ్రికా నుంచి అక్కడి వారిని బలవంతంగా, బానిసలుగా అమెరికా, ఐరోపా ఖండాలకు తరలించిన దుర్మార్గ చరిత్ర తెలిసిందే. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వారి వలసలుగా ఉన్న ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, ఇతర ప్రాంతాలలోని దేశాల్లో వ్యవసాయం, ఇతర అవసరాల కోసం మన దేశంలోని ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించారు. అలాంటి వారే రిషి సునాక్‌ పూర్వీకులు. సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు. 1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. బ్రిటన్‌లో ఒకటిన్నర శతాబ్దం క్రితమే తొలి క్రైస్తవేతరుడైన యుదు బెంజమిన్‌ దిశరాయలీ రెండు సార్లు ప్రధానిగా పని చేశాడు. చరిత్రలో క్రైస్తవులు-యుదులకు ఉన్న వైరం-విబేధాల గురించి తెలిసినదే. బెంజమిన్‌ దిశరాయలీ 1868లో ఒకసారి 1874 నుంచి 1880 వరకు రెండవసారి పని చేశాడు. అతను కూడా కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన వాడే.
నిజంగా చెప్పాల్సి వస్తే రిషివి ఆఫ్రికా మూలాలు లేదా తాతలు పుట్టిందీ పెరిగినదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పాక్‌ మూలాలని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. అసలు ఇది అనవసరమైన, అదో తుత్తి (తృప్తి) కలిగించే అంశం తప్ప మరొకటి కాదు. మన మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ కుటుంబాలు విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చినవే. అలాగే పాక్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ కుటుంబం భారత్‌ నుంచి పాక్‌ వలస వెళ్లింది. వారు పదవుల్లోకి వచ్చినపుడు వారి మూలాలు, మతాల గురించి వారి పూజలు, పునస్కారాల గురించి ఎలాంటి చర్చ లేదు. ప్రస్తుతం ఆరు దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న రిషి లాంటివారే దేశాధినేతలు లేదా ప్రధానులుగా ఉన్నారు. వారిలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారున్నప్పటికీ మన మీడియా ఇంతగా రెచ్చిపోలేదు. అగ్రదేశాల్లో ఒకటిగా ఉన్న బ్రిటన్‌కు మానసిక భావదారిద్య్ర భజనలో భాగమా? ఎలా అర్ధం చేసుకోవాలి?
రిషి మూలాలు భారత్‌వా? పాకిస్తాన్‌వా?
రిషి మూలాలు భారత్‌వా-పాకిస్తాన్‌వా అని కుస్తీలు పడుతున్నవారు చేస్తున్న వాదనలేమిటో చూద్దాం. రిషి తాతలు పుట్టింది నేటి పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా కావచ్చు గానీ, వారు ఆఫ్రికా వెళ్లింది భారత (బ్రిటీష్‌ ఇండియా) పాస్‌పోర్టుల మీదేనని అప్పుడసలు పాకిస్తాన్‌ అనేదే లేనందున మూలాలను భారత్‌విగానే పరిగణించాలన్నది వారి వాదన. బ్రిటీష్‌ వారి పాలనలో జారీ చేసిన పాస్‌పోర్టుల మీద ''బ్రిటీష్‌ ఇండియన్‌ పాస్‌పోర్టు'' ''ఇండిియన్‌ ఎంపైర్‌'' (ఎంపైర్‌ అంటే సామ్రాజ్యము లేదా రాజ్యము) అని ఉండేది. అది కూడా సంపూర్ణమైనది కాదు. బ్రిటీష్‌ ఏలుబడి, వారితో అవగాహన ఉన్న ఇతర దేశాల వలసలుగా ఉన్న ప్రాంతాలలో రాకపోకలకు మాత్రమే వాటిని ఇచ్చేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్యం కూలిపోయింది. అంతకు ముందు అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన వారికి పాస్‌పోర్టు ఆ పేరుతోనే ఉండేది. ఇప్పుడు ఆ దేశాలకు చెందిన వారు తమ మూలాలు ఇప్పుడున్న దేశాలవే అని చెబుతారు తప్ప ఉనికిలో లేని దాని పేరు చెప్పలేరు కదా! ''ఇండిియన్‌ ఎంపైర్‌'' అంటే ఇప్పుడు గణతంత్ర దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వస్తాయి. పాకిస్తాన్‌ నుంచి తరువాత బంగ్లాదేశ్‌ విడిపోయింది. తరువాత అక్కడి వారు తమ మూలాలు పాకిస్తాన్‌వని లేదా భారత్‌వని చెప్పుకోగలరా? రిషిది భారత మూలమే అని వాదించేవారు అతని తండ్రి పుట్టింది ఆఫ్రికా అని, రిషి పుట్టింది బ్రిటన్‌ అనే దాన్ని పరిగణనలోకీ తీసుకోవటం లేదు. బ్రిటన్‌లో ఉన్న చట్టాల ప్రకారం వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారికి ఒక ప్రశ్నావళిని ఇస్తారు. రిషి సునాక్‌ తలిదండ్రులు ఆఫ్రికా నుంచి వచ్చారు. రిషికి ఇచ్చిన ప్రశ్నావళిలో తాను బ్రిటీష్‌ ఇండియన్‌ గడి మీద టిక్కు పెట్టారు గనుక అతని మూలం భారత్‌ అని వాదిస్తున్నారు. అదే రిషి కొన్నేండ్ల క్రితం మన దేశానికి చెందిన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనాభా గణాంకాల్లో బ్రిటీష్‌ ఇండియన్‌ గడి మీద టిక్కు పెట్టానని, తాను పూర్తిగా బ్రిటీషర్‌నని ఇది నా ఇల్లు, నా దేశం, నా మతపరమైన, సాంస్కృతిక వారసత్వం భారత్‌ది'' అని చెప్పాడు. అనేక మంది ఇతర దేశాల వారు హిందూమతంలోకి మారి తాము భారత సాంస్కృతిక వారసత్వాన్ని అనుసరిస్తామని చెప్పుకున్నంత మాత్రాన మూలాలు భారత్‌లో ఉన్నట్లా? అందుకే ఇది వృధా చర్చ తప్ప మరొకటి కాదు. పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా పట్టణం పహిల్వాన్లకు పెట్టింది పేరు. అనేక మంది నగర వాసులతో పాటు వారు కూడా వీధుల్లోకి వచ్చి తమ ప్రాంత వారసుడు బ్రిటన్‌ పీఠమెక్కినందుకు జిందాబాద్‌లు కొడుతూ సంతోషాన్ని వెల్లడించారు.
దేశంలో 80-20 పేరుతో ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితి నేడు ఉంది. ఇంకేముంది వచ్చే రోజుల్లో ముస్లిం జనాభా పెరిగి ఆ మతానికి చెందిన వారు ప్రధాని అవుతారని, హిందువులు మైనారిటీగా మారతారన్న ప్రచారమూ ఒక పధకం ప్రకారం జరుగుతున్నది. అది ఊహాజనితమైన, విద్వేషాన్ని పెంచే ఒక ప్రచారదాడి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా తొలి ఆఫ్రికన్‌ సంతతికి చెందినవాడు. లాటిన్‌ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాల్లో ఇలా వలస వచ్చిన వారు, వారి సంతతి ఉన్నత పదవులను పొందారు. అందువలన అదేమీ వింత కాదు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది కాదు, వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నాడు అన్నది కీలకం. రిషి సునాక్‌ను కూడా ఆ ప్రాతిపదికనే చూడాలి. ఈ దేశంలో మెజారిటీ హిందువులకు లొంగి ఉండకపోతే ఇక్కడ పుట్టిన ముస్లింలను పాకిస్తాన్‌ పోవాలని చెబుతున్న విద్వేషశక్తులే రిషి సునాక్‌ మూలాల గురించి ఎక్కువగా ముందుకు తెస్తున్నాయి. బ్రిటన్‌లో కూడా జాత్యహంకార శక్తులు లేకపోలేదు. వారికి భారత్‌, పాకిస్తాన్‌, చైనా ఇలా ఎక్కడ నుంచి వలస వచ్చిన కుటుంబాలనైనా ఆసియన్లంటూ చులకనగా చూసే వారున్నారు. మొత్తం మీద చూస్తే అలాంటి సంకుచిత భావాలకు అతీతంగా అక్కడి సమాజం ఎదిగిన కారణంగానే సునాక్‌తో సహా అనేక మంది ఇతర ఖండాల మూలాలు ఉన్న సంతతికి చెందినప్పటికీ మంత్రులుగా, ఏకంగా ఇప్పుడు ప్రధానిగానే అంగీకరించారు. రిషి సునాక్‌ తమ కోసం పని చేస్తాడా లేదా అన్నదే అక్కడి పాలకవర్గం చూస్తున్నది.
మన మీడియా భారతీయ మూలాలున్న అందరి పట్ల ఒకే విధంగా లేదనేందుకు ప్రస్తుతం రిషి సునాక్‌ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్న సుఎలా బ్రేవర్‌మాన్‌ ఉదంతమే ఒక నిదర్శనం. ఆమె గురించి పట్టించుకోలేదు, ప్రస్తావించినా ఆమె చేసిన ప్రతికూల వ్యాఖ్యలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె తల్లి మారిషస్‌కు చెందిన ఉమ (తమిళ, హిందూ) తండ్రి గోవా నుంచి కెన్యా వెళ్లిన క్రిస్టీ ఫెర్నాండెజ్‌. ఇద్దరూ 1960దశకంలో బ్రిటన్‌కు వచ్చి అక్కడే పెరిగి వివాహం చేసుకున్నారు. వారికి 1980లో బ్రేవ్‌మాన్‌ జన్మించింది. తల్లి ఉమ గతంలో కన్సర్వేటివ్‌ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. రిషి సునాక్‌ ఎంపీగా భగవద్గీత మీద ప్రమాణం చేస్తే బ్రేవ్‌మాన్‌ బౌద్ద దమ్మపద మీద ప్రమాణం చేశారు. తల్లి హిందూమతం, తండ్రి క్రైస్తవ మతాలను కాదని బౌద్దమతాన్ని ఆమె అనుసరిస్తున్నారు. మనిషికి బదులు హిందువుగా జన్మించు, హిందువుగా జీవించు. హిందువుగా గర్వించు అంటున్న ఉన్మాద (ఇలా ఇతర మతాల్లో జన్మించాలని చెప్పే వారికి కూడా వర్తిస్తుంది) హోరులో ఉన్న కారణంగా మన మీడియాకు అంతగా నచ్చి ఉండదు. దానికి తోడు ఆమె భారతీయుల మీద విరుచుకుపడ్డారు. ఇప్పటికే బ్రిటన్‌లో పెద్ద సంఖ్యలో (15లక్షలని అంచనా) వచ్చిన భారత వలస జనం వీసాల గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారని చెప్పటమే గాక, వలసలకు వ్యతిరేకమైన కన్సర్వేటివ్‌ పార్టీ విధానాన్ని ఆమె గట్టిగా సమర్ధించారు.
హిందూమతాన్ని అవలంభించటం, భారతీయ సంస్కృతిని అనుసరిస్తున్న కారణంగానే రిషి సునాక్‌ అధికారానికి వచ్చారని ఎవరైనా చిత్రిస్తే అంతకంటే తప్పుదారి పట్టించటం వేరే ఉండదు. వాటికంటే అతనికి ఉన్న సంపద ప్రధాన కారణం. బ్రిటన్‌ చరిత్రలో రాణి లేదా రాజు కంటే ఎక్కువ సంపద ఉన్న తొలి ప్రధానిగా రిషి ఉన్నట్లు చెబుతున్నారు. సునాక్‌, భార్య అక్షిత ఆస్తి విలువ 83 కోట్ల డాలర్లు. పాలకవర్గాలకు కావలసింది సంపదలేకున్నా తమకు విశ్వాసపాత్రంగా సేవ చేసేవారు లేదా ధనికులైతే స్వామి కార్యం, స్వకార్యం చూసుకుంటారు గనుక తమకు ఢోకా ఉండదనే భరోసా ఉంటుంది.
మన వాడని చంకలు కొట్టుకున్న రిషి మనకేం చేస్తాడన్నది కాదు, తనను ఎన్నుకున్న దేశ ప్రజలకు ఏం చేసేదీ ఇంతవరకు తేల్చుకోలేదు. అక్టోబరు 31న తన ఆర్థిక విధాన ప్రకటన చేస్తాడని చెప్పారు. నవంబరు 17కు వాయిదా వేసిన దాన్ని ఎప్పుడు వెల్లడిస్తారో చూడాల్సి ఉంది. ఈలోగా వెలువడుతున్న విశ్లేషణలు, ఊహాగానాలను చూస్తే ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ పునరావృతం కావచ్చని చెబుతున్నారు. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిలో కార్పొరేట్ల నుంచి పన్నులు పిండితే వారికి కోపం- కార్మికుల మీద భారాలు పెంచితే వారికి ఆగ్రహం. తాజా వార్తల ప్రకారం 2019లో టోరీ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలను సమీక్షించనుంది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తరువాత ప్రధాని పదవికి పోటీ పడినపుడు చెప్పిన వాటిని కూడా సమీక్షించనున్నట్లు, వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది తగిన తరుణమా కాదా అని మధనం చేస్తున్నట్లు స్వయంగా రిషి అధికార ప్రతినిధి చెప్పారు.
ప్రధానిగా చేసిన తొలి ప్రసంగంలో 2019 ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు మౌలిక సదుపాయాలు, పౌరసేవలపై ప్రభుత్వ ఖర్చు పెంచాలన్న దానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు. మరోవైపు ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, లోటు పూడ్చేందుకు పన్నుల పెంపు గురించి ఆలోచిస్తున్నట్లు లీకులు వదులుతున్నారు. ఆదాయ పన్నును 20 నుంచి 2024 నాటికి 16శాతానికి తగ్గిస్తామన్న వాగ్దానం గురించి ఏమీ చెప్పటం లేదు. ఇచ్చిన గడువు ప్రకారం వైద్యుల వద్దకు రాని రోగుల నుంచి పెనాల్టీగా పది పౌండ్లు వసూలు చేస్తామన్న దాన్ని సునాక్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
భారత్‌-బ్రిటన్‌
నూతన సంబంధాలకు ఉపయోగపడతుందా?
భారత్‌-బ్రిటన్‌ మధ్య నూతన సంబంధాలకు ఇది నాంది అని కొందరు చెప్పారు. రెండు దేశాల మధ్య సునాక్‌ సజీవ వారధి అని మన ప్రధాని నరేంద్రమోడీ వర్ణించారు. ఇటీవలనే జిడిపిలో బ్రిటన్‌ను వెనక్కు నెట్టిన మన దేశం మీద తాను పదహారణాల బ్రిటీషర్‌ని చెప్పుకున్న రిషి కసిదీర్చుకొని తిరిగి ఎగువకు నిలుపుతాడా లేక పూర్వీకులది భారత్‌ అని తన సతీమణి భారతీయురాలని మనలను అదే స్థానంలో ఉంచేందుకు వీలుగా పని చేస్తాడా? మొదటిది చేస్తే బ్రిటన్‌ దేశభక్తుడు, రెండోదాన్ని ఎంచుకుంటే దేశద్రోహిగా అక్కడి వారు భావిస్తారు మరి. మనవాడిగా చెప్పుకుంటున్న వారు అతనికే సలహా ఇవ్వాలి? అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన తొలి ఆఫ్రో-అమెరికన్‌ సంతతికి చెందిన బరాక్‌ ఒబామా తల్లి అమెరికన్‌, తండ్రి కెన్యా దేశస్తుడు. ఎనిమిదేండ్ల పదవీ కాలంలో తండ్రి పుట్టిన కెన్యాకు అనుకూలంగా ఒబామా చేసిందేమీ లేదు. అలాంటిది రిషి సునాక్‌ తండ్రి, తాతలు పుట్టింది భారత్‌లో కాదు. అందువలన అతను బ్రిటన్‌ ప్రధాని అయితే మన దేశానికి ఏదో ఒరగబెడతాడని కొంతమంది ఎలా చెబుతున్నారో అర్ధం కావడంలేదు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నికైనపుడు కూడా ఇలాగే కబుర్లు చెప్పారు. మనకు అనుకూలంగా చేసిన ఒక్క మంచి పని ఉందా?
కంట్రీ కౌన్సిల్స్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థ ఇటీవలనే 40 స్థానిక సంస్థల బడ్జెట్లను సమీక్షించి చేపట్టనున్న పొదుపు గురించి చెబుతూ గ్రంథాలయాలను మూసివేస్తారు. బస్‌రూట్లను రద్దు చేస్తారు, రోడ్ల గోతులను అలాగే వదలివేస్తారు. రిషి సునాక్‌ ఆర్థిక మంత్రి జెర్మీ హంట్‌ సూచించిన కోతలివే. ప్రభుత్వ ఖజానాకు 40 బిలియన్‌ పౌండ్ల లోటు గండి ఇప్పటికే ఉంది. దాన్ని పూడ్చాలంటే అప్పులు లేదా జనం మీద పన్నులు విధించాలి. 1997లో చేసుకున్న చట్టాల ప్రకారం అంత అప్పు చేసేందుకు నిబంధనలు అంగకరించవు. దాన్ని ఈ ఏడాది ఆర్థిక మంత్రిగా రిషి సునాక్‌ ప్రతిపాదించిన మేరకు జనవరిలో మరోసారి పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు దాన్ని తిరగదోడతారా? లేకపోతే పన్నులు పెంపు లేదా ఖర్చుకు కోత తప్ప వేరే మార్గం లేదు. జిడిపికి 102 శాతం అప్పు ఉందని అమెరికా, కెనడా, స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బెల్జియం, పోర్చుగల్‌, జి7 దేశాల సగటు కంటే తక్కువే అని మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌ గతంలో చెప్పారు. ఆమె ప్రకటించిన పన్నుల తగ్గింపులో 17బి.పౌండ్ల మేరకు రద్దుకు అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. పన్నుల పెంపుదల సున్నితమైన అంశంగా మారింది.
వందల సంవత్సరాల పాటు అనేక దేశాలను పీల్చి పిప్పిచేసి వాటి భద్రతలకు ముప్పుగా మారి, ఇప్పటికీ కుట్రలు చేస్తున్న సామ్రాజ్యవాద బ్రిటన్‌ చంకనెక్కిన సునాక్‌ చైనా, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా బ్రిటన్‌ ఆర్ధిక రంగానికి తద్వారా దేశ భద్రతకు అతి పెద్ద ప్రమాదకారి అని చెప్పాడు. అంటే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి. బ్రిటన్‌ కఠినాత్మరాలిగా (కొందరు ఉక్కు మనిషి అని పిలుస్తారు) పేరు పొందిన మార్గరెట్‌ థాచర్‌కు అతగాడు వీరాభిమాని. అందువలన సునాక్‌ బతుకు తెరువు కోసం బ్రిటన్‌ వెళ్లిన భారతీయుల కంటే తన మాదిరి ధనవంతులైన వారి సరసన తప్ప సామాన్యులను పట్టించుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న.

- ఎం కోటేశ్వరరావు, 8331013288

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి
పుస్త‌క‌మేవ జ‌య‌తే
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు
నాటి నవ్వుల కలలరాణి షర్మిలా ఠాగూర్‌
అవగాహన! అప్రమత్తత!!
ఆన్‌లైన్‌లో తెవెలుగు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.