Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...

Sun 29 Jan 05:40:18.314833 2023

            వెండితెరపై జమున అందం.. ఒక వెన్నెల వర్షం.. ఎన్నటికీ వాడిపోని పారిజాత పుష్పం.. తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీ చరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తి దాయకాలు.. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దం పట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. అల్లరి పిల్ల పాత్ర కావొచ్చు.. ఉక్రోషాన్ని ప్రదర్శించే మరదలి క్యారెక్టర్‌లో కావొచ్చు.. సంపన్నురాలైన అమ్మాయిగా కావొచ్చు.. ఇల్లాలు అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా అటు పౌరాణికాల్లో కావొచ్చు. ఇటు జానపద.. సాంఘికాల్లో కావొచ్చు. సినిమా ఏదైనా.. పాత్ర మరేదైనా.. అందులో ఇమిడి పోవటం.. అందులోకి పరకాయ ప్రవేశం చేయటం ఆమెకే చెల్లింది. తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి కాపురపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్‌ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన జమున లాగా మరే ఇతర నటీమణులూ నటించలేకపోయార నడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా ఆమె అపజయమెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే... తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి... జమున. పురాణాల్లో చదువుకున్న సత్యభామ ఎలా ఉంటుంది? ఆమె మన ముందు ప్రత్యక్షమైతే.. ఆ కోపం.. ఆ ఉక్రోషం.. అంతలోనే ప్రేమాభిమానాల్ని ప్రదర్శించే సత్యభామను కళ్లకు కట్టినట్లుగా చూపించిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అది జమునకు మాత్రమే సాధ్యమైంది. ఆహం, అహంకారం, ఆభిజాత్యం, ఆత్మాభిమానం, వళ్ళంతా సొగసు, మనసంతా పొగరుతో కూడిన ఒక అమ్మాయిని ఊహిస్తే నాడు జమున తప్ప మరొకరెవరూ మన దృష్టికి రారు. ఇలా తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన జమున అనారోగ్యంతో 27న హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే కన్నుమూశారు. ఆమెకు నివాళి అర్పిస్తూ అలనాటి అందాల తార గురించి నవతెలంగాణ ఆదివారం అనుబంధం 'సోపతి' కవర్‌స్టోరీ...
            జమున 1936లో చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్య పట్టణం కర్నాటకలోని హంపీలో నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యా దేవీ దంపతులకు జన్మించింది. ఆమె అసలు పేరు జానాభాయి. తండ్రి శ్రీనివాసరావు విద్యాధికుడు, వ్యాపారవేత్త. ఆయన పసుపు, పత్తి వంటి వాణిజ్య సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేవాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమున కుటుంబం ఆ గ్రామానికి వలస వచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవాడు. చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరి లోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళల మీద ఆసక్తి పెరిగింది. స్కూలు వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన 'ఢిల్లీ చలో' అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర వాసిరెడ్డి రచించిన 'మా భూమి' నాటకంలో నటించే అవకాశం వచ్చినప్పుడు, బుర్రకథ పితామహుడు నాజర్‌ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు! అందులో 'నరక కూపమీ క్రూర నైజాం పాలన రైతన్నా' అనే పాటను జమున ఆలపించి ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు అందుకుంది. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడ పట్టణాలలో ప్రదర్శిస్తే జమున కూడా ఆ బృందం వెంట వెళ్లి నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఒకసారి తెనాలి సమీపం లోని ముండూరులో 'ఖిల్జీ రాజ్యపతనం' అనే నాటకం వేయాల్సి వచ్చినప్పుడు, స్థానిక హైస్కూలులో టీచరుగా పని చేస్తున్న కొంగర జగ్గయ్య (సినీనటులు) జమునను తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటనగా చెప్పుకోవాలి.
సావిత్రి కారణంగా సినిమాల్లోకి..
            ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో వివిధ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన జమున సినీ రంగ ప్రవేశం విచిత్రంగా జరిగింది. చిన్నతనం నుంచే నాటకాల్లో నటిస్తున్న జమునను సావిత్రి గమనించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినప్పుడు జమున ఇంట్లోనే సావిత్రి ఉన్నారు. సినిమా లపై ఆసక్తిని గమనించిన సావిత్రి.. జమునను సినీ రంగంలోకి ఆహ్వానిం చింది. దాంతో 15 ఏండ్ల వయసులోనే జమున సినీ రంగంలోకి ప్రవేశించింది. 'మాభూమి' నాటకంలో ఆమె ప్రదర్శ నను చూసి 'పుట్టిల్లు' చిత్రంలో ఆఫర్‌ ఇచ్చారు. ఈ చిత్రంతో జమున సినీ రంగ ప్రవేశం జరిగినా.. సత్యభామా కలాపంతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది.
హీరోయిన్‌గా నిలదొక్కుకుంటూ...
            1954లో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారు నిర్మించిన 'బంగారుపాప', గోకుల్‌ ప్రొడక్షన్స్‌ వారు రజనీకాంత్‌ దర్శకత్వంలో నిర్మించిన 'వదినగారి గాజులు' చిత్రాలలో నటించిన జమునకు వెండితెర అగ్రనటులతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. గోకుల్‌ ప్రొడక్షన్స్‌ వారే నిర్మించిన 'నిరుపేదలు' సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. నాగూర్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించిన 'ఇద్దరు పెళ్లాలు' సినిమాలో ఎన్‌.టి. రామారావు సరసన హీరోయిన్‌గా నటించినా అది కూడా సరిగ్గా ఆడలేదు. తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత, బి.ఎన్‌.రంగా విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నిర్మించిన 'మాగోపి' చిత్రంలో వల్లం నరసింహారావు సరసన జమున హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా శత దినోత్సవం చేసుకుంది. 1955లో విజయావారి 'మిస్సమ్మ' సినిమాలో అమాయకంగా నటించిన జమునకు మంచి పేరొచ్చింది. అలాగే 1956లో బి.ఎన్‌.రంగా 'తెనాలి రామకృష్ణ' సినిమా నిర్మించి నప్పుడు అక్కినేనికి జోడిగా జమున నటించింది. యన్‌.టి. రామారావుతో పొన్నలూరి బ్రదర్స్‌ నిర్మించిన 'భాగ్యరేఖ', డి.ఎల్‌.నారాయణ వినోదా బ్యానర్‌ మీద నిర్మించిన 'చిరంజీవులు'లలో కూడా జమున నటించగా ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. దాంతో హీరోయిన్‌ ప్రధానాంశాలు గల చిత్రాలకు జమున అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే పేరు వచ్చింది. ఆ తర్వాత 'భూకైలాస్‌', 'పెళ్ళినాటి ప్రమాణాలు, 'అప్పుచేసి పప్పుకూడు', చిరంజీవులు', 'ఇల్లరికం', 'ఈడూజోడూ', 'రాముడు భీముడు', 'శ్రీకృష్ణ తులాభారం', 'గులేబకావళికథ', 'లేత మనసులు', 'తోడూ నీడా' 'ఉండమ్మా బొట్టుపెడతా', 'తాసిల్దారు గారి అమ్మాయి', 'బొబ్బిలి యుద్ధం', 'మట్టిలో మాణిక్యం', 'ఏకవీర', 'పండంటి కాపురం', వంటి అనేక సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరుకుని, సాహ సానికి మారు పేరుగా నిలిచింది.
            నాలుగేండ్ల పాటు బారుకాట్‌ చేసిన ఎన్టీఆర్‌, అక్కినేని
జమున వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని, ఎన్టీఆర్‌ ఇద్దరూ జమునతో నటించబోమని పత్రికాముఖం గా ప్రకటించారు. సినిమా పరిశ్రమలో ఇక జమున పని అయిపోయిందనుకున్నారు. జమున షూటింగుకు లేటుగా వస్తుందని, పొగరుబోతని, గర్విష్టని, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుందని, పెద్దల మీద గౌరవం లేదని ఈ ఇద్దరు అగ్రనటులు కారణాలుగా చూపించారు. అవి బారు కాట్‌ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్ర పరిశ్రమకు తెలి సినా అగ్రనటుల ప్రమేయం ఉండడం తో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించ లేదు. అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ కారణాన్ని చనిపోయే వరకు చెప్పకపోవడం ఆమె గొప్పతనం. ఆ దశలో జగ్గయ్య, శోభన్‌ బాబు, హరనాథ్‌, కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలలో నటించింది. ఆమెకు పరపతి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు ఎప్పుడూ ఐదారు సిని మాలు చేతిలో ఉండేవి. అదే సమయంలో జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. 1963, 64 లలో ఎల్వీప్రసాద్‌ నిర్మించిన 'హమ్‌ రాహి', 'బేటీ బేటే' సినిమాల్లో జమున నటించింది. విజయా సంస్థ 1962 లో 'గుండమ్మ కథ' సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్‌ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపజేయాలని నిర్ణయిం చారు. వీరి మనస్పర్థల వల్ల అప్పటికే 'గుండమ్మ కథ' రెండేండ్లు వెనకబడింది. చక్రపాణి, కె.వి.రెడ్డి రాజీ యత్నాలు మొదలుపెట్టారు. అగ్ర నటులి ద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని జమునకు సలహా కూడా ఇచ్చారు. కానీ ఈ ధీర వనిత ససేమిరా అంది. ''చేయని నేరానికి నాలుగేండ్ల పాటు హింస పెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి?'' అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక లాభం లేదని చక్రపాణి అక్కినేని, ఎన్టీఆర్‌, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి, చనువు కొద్దీ వారిని మందలించి ''ఇక అందరూ కలిసి పని చేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తోంది'' అంటూ చమత్క రించి సమస్యను తనదైన శైలిలో పరి ష్కారం చేశారు. తర్వాత వీరి కాంబినేషన్‌ లో 'గులేబకావళి కథ', 'పూజాఫలము' చిత్రాలు ఘనవిజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. వారిద్దరి కాంబినేషన్‌లో 'మూగమన సులు', 'మురళీకృష్ణ', 'రాముడు భీముడు', 'శ్రీకృష్ణ తులాభారం', 'పూలరంగడు' సినిమాలు వచ్చాయి.
జమున వివాహం
            1965లో జమున నటిగా పాపులర్‌ గా ఉన్న సమయంలోనే పెద్దలు నిర్ణయిం చిన జూలూరి రమణారావుతో తిరుమల బాలాజీ సన్నిధిలో జమునకు వివాహం జరిగింది. పెండ్లి తర్వాత జమున సినీ జీవితం కంచికి చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ, జమున మాత్రం పెండ్లైన తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అప్పుడు రమణారావు తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పి.హెచ్‌.డి చేస్తుండేవారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి వంశీకృష్ణ మీడియా ప్రొఫెసర్‌గా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో పని చేస్తున్నారు. కూతురు స్రవంతి ఇక్కడే హైదరాబాద్‌లో నివసిస్తుండగా జమున ఆవిడ వద్దే ఉంటుంది. భర్త రమణారావు 2014లో గుండెపోటుతో మరణించారు.
రాణి మాలినీదేవిగా
            పండంటి కాపురం సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన జమున... ఆ సినిమాలో చేసిన ''రాణి మాలినీ దేవి'' పాత్ర కూడా తెలుగు సినిమాల చరిత్రలో ఒక ల్యాండ్‌ మార్క్‌ అని చెప్పాలి. 'పండంటి కాపురం'లోని 'రాణి మాలిని దేవి' పాత్ర అందుకు నిలువెత్తు నిదర్శనం. అహంభావం నిండిన ఆ పాత్రను ఆమె అద్భుతంగా పోషించింది. అక్కడ నుంచి ఆ పాత్రని అంత పవర్‌ ఫుల్‌గా పోషించేందుకు ప్రతీ హీరోయిన్‌ ప్రయత్నించే వారంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర ఎంతటి పవర్‌ ఫుల్‌గా నిలిచిందో, దానికి స్ఫూర్తి ఆనాటి జమున పాత్రే అని చెప్పాలి. అలా ఇండిస్టీలో ఒక రోల్‌ మోడల్‌ గా నిలిచింది.
రాజకీయాల్లోనూ ఎంట్రీ
            జమున సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. సినీ తారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో జమున అగ్ర స్థానంలో ఉన్నా.. ఎక్కువ కాలం రాజకీయాలలో ఇమడలేకపోయింది. శ్రీమతి ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం తనను రాజకీయాలలోకి లాక్కొచ్చాయని తన రాజకీయ జీవితం గురించి అప్పట్లో జమున చెప్పారు. 1988లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సైతం పని చేసిన జమున ఆ తర్వాత పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంది. అనంతరం బీజేపీలో చేరి వాజపేయి తరపున ప్రచారం చేసినా, ఆ తర్వాత రాజకీయాల నుండి తప్పుకుంది.
            జమున గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే పలు కార్యక్రమాలకు అతిధిగా పాల్గొంటూ.. హుషారుగా ఉండేది. సీనియర్‌ నటీమణుల్లో ఎంతగా కాలం గడిచినప్పటికీ ఒకేలాంటి గౌరవ మర్యాదల్ని పొందిన అతి కొద్ది మంది నటీమణుల్లో జమున ఒకరిగా చెప్పక తప్పదు. సినీ రంగంలో ఉంటూనే సేవ, రాజకీయ రంగాల్లోనూ జమున విశేషంగా కృషి చేసింది. తెలుగు ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అనే సంస్థ నెలకొల్పి 25 ఏండ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న జమున ఏటా తన పుట్టినరోజున పేద కళాకారులకు ఆర్థిక సాయం చేస్తుంది. పాత తరంలో హీరోయిన్లలో సావిత్రి తర్వాత స్థానం జమునదే.
జమునకు షివరింగ్‌ ఎందుకు వచ్చిందంటే..
            జమున ఎప్పుడు ఇంటర్వ్యూలో కనిపించినా కూడా షివరింగ్‌ అవుతుండేది. అయితే వయసు ఎక్కువ కావడంతో ఆ విధంగా ఆమె వణుకుతూ ఉండేవారు అనుకునేవారు. కానీ అందుకు కారణం వేరే ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె సినిమా ఇండిస్టీలోకి వచ్చిన కొన్ని నెలలకి ఒక తమిళ హీరో జయ శంకర్‌ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురయిందని, ఆ విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా వివరణ ఇచ్చారు. 1965లో 'లేత మనసులు' తమిళ సినిమాషూటింగ్‌ లో పాల్గొన్నప్పుడు ఊహించిన విధం గా సినిమాలోని హీరో కారణంగా గాయపడినట్లు ఆమె తెలిపింది. ఒక సాంగ్‌ షూటింగ్‌ చేస్తున్న ప్పుడు ఒక గడ్డివాము మీద రిహార్సల్స్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడు జయ శంకర్‌ గడ్డివాము మీద ఎలా పడుకున్నాడో అర్థం కాలేదు. టేక్‌ సమయానికి వచ్చే టప్పటికి అంతటి భారీ మనిషి వచ్చి ఒక్కసారిగా నా తల మీద పడ్డాడు అప్పుడే నేను కింద కూర్చున్నాను. అలా తల మీద పడడంతో నేను మెడ విరిగి పోయిందని అనుకున్నాను. ఇక అలానే పట్టుకొని కూలిపోయాను. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి కాస్త ఐస్‌ కూడా పెట్టుకున్నాను. అటు ఇటు తిప్పి చూశాను. కొంతసేపటికి బాగానే అనిపిం చింది. ఏమీ అనిపించలేదు. ఇక తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో పెద్దగా టెక్నాలజీ ఎక్స్‌రేలు లేవు అని అలా వదిలేసాను. కానీ, 'రాజపుత్ర' సినిమాలో చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడే ప్రేక్షకులకు అర్థమైంది. స్కానింగ్స్‌ వచ్చిన తర్వాత ఒకసారి తల మొత్తం పరీక్షించారు. అయితే ఏదో బ్రెయిన్‌లో ఒక నర్వ్‌ అలా అంటుకుపోయి ఉంది అని తెలిసింది. ఆ సమస్య వల్ల షివరింగ్‌ వచ్చిందని అర్థమైంది. అప్పుడు బ్రెయిన్‌ ఆపరేషన్‌ అవసరమన్నారు. ఇక నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అది అవసరం లేదని దాని గురించి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదని జమున తెలిపింది.
సత్యభామగా
            'వినాయక చవితి' సినిమాలో సత్యభామ గా జమున నటన చూసి జనం నీరాజనం పట్టారు. దాంతో ఆ పాత్రకి ఆ బ్రాండ్‌ అంబాసిడార్‌గా జమున నిలిచి పోయింది. ఇక ఎన్టీఆర్‌తో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమా... జమున కెరీర్‌లో మేలి మకుటంగా మారింది. ఇక అప్పటి నుంచి సత్యభామ అంటే జమునే అన్నంతగా జనం ఫిక్స్‌ అయిపోయారు. తర్వాత కాలంలో ఆ స్థాయిలో మరెవరూ పోషించలేకపోయారంటే అతిశయోక్తి కాదు. సత్యభామ అంటే జమునే అనే అభిప్రాయం సినీ అభిమానులలో నాటుకుపోయిన అభి ప్రాయం. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. ఎన్టీఆర్‌.. ఏఎన్నార్‌.. జగ్గయ్యతో సహా పలువురు అగ్ర హీరోలతో నటించిన ఆమె.. హీరో యిన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆమె పోషిం చిన పాత్రలు ఎన్ని ఉన్నా.. సత్యభామగా మాత్రం ఆమెకు సాటి వచ్చే వారే లేరని చెప్పాలి. కృష్ణుడు.. రాముడు అంటే ఎన్టీఆర్‌ ఎలా గుర్తుకు వస్తారో.. సత్యభామ పేరు చెప్పగానే తెలుగు వారి మనసుల్లో గుర్తుకు వచ్చే రూపం జమునదే. జమునంటే సత్యభామ, సత్యభామ అంటే జమున గా నిల్చింది.
అవార్డులు
            జమున తెలుగులోనే కాకుండా తమిళంలో పాతిక సినిమాలకు పైగా నటించింది. హిందీలో ఇరవై, కన్నడంలో ఆరు సినిమాల్లో నటించింది. 1935లో 'పుట్టిల్లు' తో మొదలైన జమున సినీ నటప్రస్థానం హిందీలో నటించిన 'రాజ్‌తిలక్‌', తమిళంలో 'తూంగాదే తంబిం తుంగాదే' తో ముగిసింది. తెలుగులో 1989 లో వచ్చిన 'రాజకీయ చదరంగం' ఆమె చివరి చిత్రం. దాదాపు రెండు వందల చిత్రాలలో నటించిన జమునను 'ఆంధ్రా నర్గీస్‌' అని, 'హంపి సుందరి' అని పిలుస్తుంటారు. నిజాయితీకి, ఉత్తమ సంస్కారానికి పెట్టింది పేరు జమున. అయితే తెలుగు చలన చిత్రరంగంలో తన ప్రతిభతో అందరి మన్ననలు పొందిన ఎందుకో జాతీయ అవార్డులు, నంది అవార్డులు అందుకోలేక పోయింది. పద్మశ్రీ అవార్డు వస్తుందని సినీ పరిశ్రమలోని వారందరూ అనుకున్న ఆ పురస్కారం దక్కలేదు.
1964లో 'మూగమనసులు' చిత్రంలో నటనకు జమునకు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. మరలా 1968లో అదే గౌరి పాత్రను హిందీ 'మిలన్‌' చిత్రంలో జమున పోషించింది. అందులో నటనకు కూడా ఆమెకు మరొకసారి ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. 2008లో యన్‌.టి.ఆర్‌ జాతీయ పురస్కారం అందుకుంది. 2021 సెప్టెంబర్‌ 17న సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జమున జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

-పొన్నం రవిచంద్ర, 9440077499

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
కళాతపస్వి విశ్వనాథ్‌
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.