Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న మారటోరియం నిలిపివేత
- పూర్తి లావాదేవీలకు పచ్చజెండా
- కేంద్రం నోటిఫికేషన్ విడుదల
- కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్
ముంబయి : యస్ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట లభించనుంది. మరో మూడో రోజుల్లో ఈ బ్యాంక్‌లో అపరిమిత లావాదేవీలకు వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మారటోరియాన్ని మార్చి 18న ఎత్తివేయనున్నట్టు శనివారం ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఆర్‌బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్దరణ ప్రణాళిక-2020 మార్చి 13 నుంచే అమల్లోకి వచ్చినట్లయ్యింది. యస్ బ్యాంకును గట్టేక్కించేందుకు ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన మూడో పనిదినాల సాయంత్రం నుంచి నిషేధం ఎత్తివేత అమల్లోకి రానుంది. దీంతో ఈనెల 18న సాయంత్రం 6గంటలకు యస్ బ్యాంకుపై ఈ తాత్కాలిక నిషేధం తొలగిపోనుంది. మార్చి 5న యస్ బ్యాంకుపై మారటోరియాన్ని విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.50,000కు మించి నగదు ఉపసంహరించకుండా ఖాతాదారులపై నిషేధం విధించిన విషయం విదితమే. మారటోరియం విధించిన వెంటనే పునరుద్ధరణ ప్రణాళికను ఆర్‌బీఐ రూపొందించగా.. ఆ ప్రణాళికను శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రశాంత్‌కే బాధ్యతలు
ప్రస్తుతం యస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్‌కుమార్‌ని ఆ బ్యాంక్ నూతన బోర్డుకు ఎండి, సిఇఒగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ మాజీ సీిఎఫ్‌ఓ, డిప్యూటీ ఎండిగా అనుభవం కలిగిన ప్రశాంత్‌ను యస్ బ్యాంక్ పాలనాధికారిగా ఆర్‌బిఐ నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పీఎన్‌బీ మాజీ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మహేష్ కష్ణమూర్తి, అతుల్ భేడాలను నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెర్టర్లుగా ఎంపిక చేశారు. యస్ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్న నిషేధాన్ని ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. దీంతో యస్ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. అదే విధంగా యస్ బ్యాంక్ బోర్డులో ఎస్‌బీఐ మరో ఇద్దరు అధికారులను డైరెక్టర్లుగా నియమిం చనుంది. వీరికి జతగా ఆర్‌బీఐ సైతం మరో డైరెక్టర్‌ను నియమించే అవకాశాలున్నాయి. ప్రణాళిక ప్రకారం పునరుద్ధరించాక యస్ బ్యాంకుకు కొత్త బోర్డు ఏర్పాటు అయ్యేంత వరకూ లేదా ఏడాది కాలం పాటు వీరంతా బాధ్యతలు నిర్వహించనున్నట్టుతెలుస్తోంది.
మరో రెండు సంస్థల పెట్టుబడులు
యస్ బ్యాంక్‌లో ఇప్పటికే పలు సంస్థలు పెట్టు బడులకు అంగీకారం తెలుపగా.. మరో రెండు బ్యాంక్‌లు ముందుకు వచ్చాయి. తాజాగా బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు రూ.300 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్ట డానికి ముందుకు వచ్చాయి. దీనికి బంధన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును రూ.8 అధికంగా అంటే రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది.
నగదు రూపంలో ఈ పెట్టుబడులు పెట్టనుంది. మరో గ్లోబల్ విత్త సంస్థ ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.10 విలువ చేసే 30 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బిఐ రూ.7,250 కోట్లు పెట్టుబడికి సిద్దం అయ్యింది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులు రూ.1000 కోట్లు చొప్పున, యాక్సిస్ బ్యాంక్ రూ.600 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి.