Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే కోతి! కల్లు తాగింది! ముల్లుతొక్కింది! ఆ సీన్ ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనోన్ముఖంగా పయనిస్తున్న సంగతి ఆ ఆర్థిక వ్యవస్థ ''సంరక్షణ'' బాధ్యత నెత్తికెత్తుకున్న వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లే అంగీకరిస్తున్నాయి. మోడీ సర్కార్ లాగా కొందరు దేశాధినేతలు వాస్తవాలను అంగీకరించేందుకు మొరాయిస్తున్నా ఆయా దేశాల్లో ''మేడిపండ్ల పొట్టవిప్పి చూసే వారు'' లోపలి వాస్తవాల్ని బహిర్గతం చేసేవారు లేకపోలేదు. అంతర్జాతీయ సంస్థలు ఉండనే ఉన్నాయి.
2019 డిసెంబర్‌లో వెలువడిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అనే అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల వేదిక రిపోర్టు ప్రపంచవృద్ధి రేటు 2020లో 2.9శాతంగాను, స్వల్పంగా పెరిగి 2021లో 3.1శాతంగాను ఉంటుందని అంచనా వేసింది. ఐ.ఎం.ఎఫ్. 2008 తర్వాత అత్యంత తక్కువగా 2020లో 3శాతం వృద్ధిరేటు ఉంటుందని తెల్పగా ప్రంచబ్యాంకు 2.6శాతమే వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ) అయితే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలు అవలంబించే ఆర్థిక విధానం తమకేమీ ఉపయోగపడట్లేదనీ, అసలు అవి తమ కోసం కాదని భావిస్తున్నారనీ, ఇది సామాజిక ఉద్రిక్తలకు దారితీస్తుందని పేర్కొంది. సంపద అసమానతలపై క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆచార్యులు గాబ్రియల్ జుక్‌మెన్ తన నివేదికలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత సమాజంలోని పైనుండే వారి వద్ద సంపద కేంద్రీకరించ బడుతున్నదని రాశారు. దీన్నే ఆక్స్‌ఫామ్ నివేదికలు గత కొన్ని సంవత్సరాలుగా పేర్కొంటున్నాయి. 2019 జూలైలో విడుదలైన ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) ప్రపంచ వ్యాపితంగా 82 కోట్ల మంది ఆకలి మంటలతో అల్లాడుతున్నారని రాసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా అవలంబించబడే విధానాలే కొనసాగితే 2030 కల్లా ప్రపంచం నుంచి ఆకలిని తరిమేయాలనే లక్ష్యం ఉట్టి మాటేనని కూడా పేర్కొంది.
నేడు ప్రపంచంలో ముసురుకున్న మాంద్యానికి కారణం పెట్టుబడిదారులకు ఉపయోగపడే, వారి బొక్కసాల్ని నింపే పాలకుల విధానం. సరిగ్గా ఈ సమయంలో కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని కమ్ముకుంది. ప్రపంచానికి 'గ్రోత్ ఇంజన్'గా పిలవబడుతున్న అమెరికా నుంచి, ప్రపంచ 'వర్క్‌షాపు'గా పిలవబడే చైనా వరకు పరిశ్రమలు షట్టర్లు దించుకుంటున్నాయి. చైనా నుంచి ముడిసరుకు రాకుంటే మనదేశంతో సహా అనేక దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు ఆగిపోతాయి. అమెరికాలోని డేజోన్స్ నుంచి మన దేశ సెన్సెక్స్ వరకూ, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ వరకు ప్రతిదేశంలోనూ షేర్లు పతనమయ్యాయి. లక్షల కోట్ల డాలర్లు ప్రజల సంపద ఆవిరైపోయింది. మనదేశంలో నిన్న ఒక్కరోజులో మన దేశంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం కరిగిపోయింది. అమెరికాలో వాల్‌స్ట్రీట్ నుంచి మన దలాల్ స్ట్రీట్ వరకూ కుదేలయ్యాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రగల్భాలు పలుకుతున్న పెట్టుబడి వకాలత్‌దార్లు ఊహించని దెబ్బ కరోనా వైరస్. నేడు ప్రపంచం మూటగట్టుకుంటున్న ఈ నష్టాలకు, స్టాక్ మార్కెట్లు కుంగడానికి కారణం కరోనా వైరసేనన్నట్టు దానికి కారణం చైనానే అన్నట్టు అమెరికా న్యూస్ ఏజెన్సీలు ప్రపంచమంతా వార్తల్ని పంపిణీ చేస్తున్నాయి. దానికి చైనాలో గబ్బిలాల్ని తింటున్నారనీ దాని ఫలితమే కరోనా వైరస్ అనీ ప్రచారం సాగుతోంది. దున్నపోతు ఈనిందంటే గట్టున కట్టేయమనే సంఫ్‌ుపరివార్ నేతలు ఉండనే ఉన్నారుగా! మొన్న ఒక బీజేపీ నాయకుడు మాంసం తినడం వల్లే ఇలాంటి జబ్బులోస్తాయన్న పల్లవి అందుకున్నాడు.
ఇటీవల హైదరాబాద్‌లో సీసీఎమ్‌బీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో గబ్బిలాల వల్లే ఇది ప్రారంభమైందని గానీ, ఇది చైనాలోనే ప్రారంభమైందని గానీ చెప్పడానికి సైన్స్ అంగీకరించజాలదని చెప్పారు.
సంక్షోభం అసలు కథకు మరో ప్రధాన కారణం ఉంది. పెట్టుబడి గ్రంథంలో మార్క్స్ చెప్పినట్టు నేటి అమెరికన్ ఆయిల్ ఎంఎన్‌సీలు వాటి లాభాల కోసం అమెరికా ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ఇరాన్, రష్యాలను చావుదెబ్బకొట్టడానికి అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచడం, ఫలితంగా క్రూడ్ ధరలు కుప్పకూలాయి. ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు దెబ్బతింటున్నాయి. అమెరికా రాజకీయ భౌగోళిక అవసరాల ప్రకారం ప్రపంచం నడవాలనే యావ! దీన్నే మొన్న ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ప్రపంచానికి ''త్రిబుల్ వ్యామి ఎఫెక్ట్'' అని రాసింది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం వ్యవస్థీకృతమైందన్నది ఒక సత్యం. దానికి కారణం పెట్టుబడిదారుల లాభాలు తప్ప మరేమీ కనపడని పాలకులు. నయా ఉదారవాద విధానాలు తమని కష్టాల్లోకి నెడుతున్నాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోరాటాల్లోకి వస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు సాగవనీ అన్నింటినీ కరోనా పేరుతో దుప్పటి కిందకి నెట్టేయాలనే ప్రయత్నాలు చెల్లుబాటు కావనీ ఎలుగెత్తి చాటుదాం.