Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్ లో ఆ జట్టు ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇందుకు కారణమైంది. క్రికెటర్లు ఉన్న హోటల్‌కు కిలోమీటర్ దూరంలో గురువారం ఉదయం తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. ఇటీవలే పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ పై దుండగుడు కాల్పులు జరిపి గాయపరిచిన నేపథ్యంలో తాజా ఘటనతో ఆందోళన రెట్టింపైంది.
దీంతో, వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల ఘటన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు. మరోవైపు ఈ ఘటన ఇంగ్లండ్ జట్టును పెద్దగా ప్రభావితం చేయలేదు. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టు కోసం ఆటగాళ్లు యథావిధిగా ప్రాక్టీస్ చేశారు. కాగా, 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న సందర్భంలో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణించిన లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. దాంతో పలు జట్లు చాలా కాలం పాటు పాకిస్థాన్ వచ్చేందుకు నిరాకరించాయి.