Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోముపై చెరగని చిరునవ్వు. నలుగురికీ సాయం చేసే తత్వం. తన పాత్ర ద్వారా ఆడపిల్లను పవర్‌ఫుల్‌గా చూపించాలనే బలమైన కోర్కె. పుట్టింది పంజాబ్ అయినా తెలుగు బుల్లితెర పరిశ్రమలో స్థిరపడ్డారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో, ఆకట్టుకునే మనస్తత్వంతో అభిమానులకు దగ్గరయ్యారు. పరిశ్రమలో ఎంతో మంది అప్యాయంగా గుడియా(బొమ్మ) అంటూ పిలుచుకునే ఈ పంజాబీ బొమ్మ 'అంజు అస్రాని'తో మానవి ఇంటర్వ్యూ...
మీరసలు పంజాబ్ నుండి ఇక్కడికెందుకొచ్చారు?
చదువుకోసం. అమ్మ కిషోరీదేవి, నాన్న శ్యామ్‌లాల్. నాకు అక్కా, అన్నయ్య ఉన్నారు. ఆంధ్రావైపు స్టడీస్ బాగుంటాయని మా ముగ్గురినీ నాన్న ఇక్కడే ఉంచి చదివించారు. అలా వైజాగ్‌లో ఐదు సంవత్సరాలు ఉన్నాం. తర్వాత హైదరాబాద్ వచ్చాం. అమ్మ మాకు తోడుగా ఇక్కడే ఉండేది. నాన్న మాత్రం యుపిలో వ్యాపారం చూసుకుంటూ అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తుంటారు.
మరి సినీ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు?
2002లో నా కెరీర్ ప్రారంభమైంది. వైజాగ్‌లో ఆరోతరగతి పూర్తి చేసి హైదరాబాద్ వచ్చేశాం. స్కూలు, కాలేజీలో చదివేటపుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. నా స్నేహితురాలి నాన్న ప్రొడ్యూసర్. కాలేజీలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆయన నన్ను చూసి 'లండన్ హెయిర్ అండ్ స్కిన్ కేర్' అనే యాడ్ ఫిలిమ్‌కి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను ఇంటర్‌లో ఉన్నా. ఇక ఆ తర్వాత చాలా యాడ్స్‌లో నటించా. తర్వాత ఓ సినిమాలో అవకాశం వచ్చింది. దానిలో నటించి తర్వాత సినిమాల వైపుకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా.
అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
నా మొదటి సినిమ సాయికిరణ్‌తో చేసిన 'విజయానికి సిద్ధం'. కాని అది రిలీజ్‌కి మాత్రం సిద్ధం కాలేదు. అందులో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వచ్చింది. అలా చేయడం నాకు ఇష్టం లేదు. సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ బొమ్మల్లా చూపిస్తారు. అది నచ్చకే సినిమాలు వదిలేసి సీరియల్స్ వైపుకు వచ్చేశా..
ఇప్పటి వరకు మీరు నటించిన సీరియల్స్?
కర్తవ్యం, బొమ్మరిల్లు, శిరీష, ఎగిరే పావురమా, ధర్మయుద్ధం, మౌనమేలనోయి, మేఘసందేశం, రుద్రవీణ, తూర్పు-పడమర ఇలా 35 సీరియల్స్‌లో నటించా.
మీరు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి?
2002లో 'కర్తవ్యం' (సూపర్ ఉమెన్) అనే ప్రాజెక్ట్ చేశా. ఇదే నా మొదటి సీరియల్. ఆ సీరియల్‌లో చాలా నేర్చుకున్నా. ఇందులో నాది చాలా పవర్‌ఫుల్ పాత్ర. కెరీర్ ప్రారంభంలోనే ఫైట్స్, హార్స్ రైడింగ్ చేయించారు. ఇందులో అన్యాయంపై పోరాటం చేస్తుంటా. ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడే పాత్ర నాది. మళ్ళీ అటువంటి ఆవకాశం వస్తుందో లేదో చెప్పలేను.
ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు?
అవును. ఎక్స్‌పోజింగ్ లేకుండా, కాస్త పెర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నా. 'గోపాల గోపాల'లో వెంకటేష్‌కి చెల్లిగా చేసే అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుండి వెంకటేష్ అంటే చాలా అభిమానం. దాంతో ఒప్పుకున్నాను. ఇప్పుడు 'గబ్బర్‌సింగ్ 2'లో లాయర్ పాత్ర చేస్తున్నా.
ఖాళీ సమయం దొరికితే ఎలా గడుపుతారు?
అన్నయ్య పిల్లలతో ఆడుకుంటా. టీవీలో హిందీ ప్రోగ్రామ్స్ చూస్తా. హిందీ, తెలుగు పాటలు వింటా. అమ్మతో కలిసి సినిమాలకు వెళుతుంటా. షాపింగ్ చేస్తుంటా.
మొదటి సారి మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నపుడు ఎలా ఫీలయ్యారు?
నాకంటే ఎక్కువగా మా అక్క సంబరపడింది. తనే నన్ను హీరోయిన్‌గా చూడాలనుకుంది. తన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా. కాని ఇప్పుడు అక్క లేదు. అయినా తను ఎప్పుడూ నాతో ఉన్నట్లే అనిపిస్తుంది.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఎలా నేర్చుకున్నారు?
కొత్తలో తెలుగు వచ్చేది కాదు. నేర్చుకోవాలనే పట్టుదలతో స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నా. స్కూల్లో అయితే నా స్నేహితురాలు ఓ సారి కడుపు నొప్పి వచ్చి క్లాసు మధ్యలో ఇంటికి వెళ్ళి పోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి స్కూల్‌కి వస్తే 'కడుపు తగ్గిందా' అని అడిగాను. అప్పట్లో తెలుగు ఇంత దారుణంగా మాట్లాడేదాన్ని. కాని ఫీల్డ్‌లోకి వచ్చాక చాలా మంది నేర్పించారు. అలా నేర్చుకుంటూ ఇప్పుడు బాగా
మాట్లాడగలుగుతున్నా.
ఎప్పుడైనా బాధపడ్డ సంఘటనలు ఉన్నాయా?
మా అక్క 2005లో చనిపోయింది. అక్క నాకు మంచి స్నేహితురాలు. అక్కలేని లోటు ఎవరూ తీర్చలేరు. నన్ను ఈ రంగంలో చూడాలనుకుంది అక్కనే. అలాంటిది ఇప్పుడు అక్క లేదు. నేన్ను ఎప్పటికీ బాధపెట్టే సంఘటన ఇదే.
మీ డ్రీమ్‌రోల్స్ ఏమైనా ఉన్నాయా?
అవకాశం వస్తే అంధురాలిగా, మానసిక వికలాంగురాలిగా చేయాలని ఉంది.
మిగిలిన ఆర్టిస్టుల కంటే మీ హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకలా?
రకరకాల పాత్రల కోసం తలకు విగ్గు పెట్టీ పెట్టీ జట్టు పాడైపోయింది. దాంతో కటింగ్ చేయించుకోవాలనుకున్నా. వెంటనే అమ్మకు చెబితే ఒప్పుకుంది. ఇక నా హెయిర్ స్టైల్‌కి తగ్గ పాత్రలు వస్తేనే చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే సమయంలో 'అగ్నిపూలు' సీరియల్ కోసం మంజులానాయుడు గారు పిలిపించారు. నా హెయిర్ స్టైల్ చూసి, ఈ పాత్రకు నేనే కరెక్టుగా సరిపోతావని వెంటనే ఓకే చేశారు.
ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్టులు?
ప్రస్తుతం 'అగ్నిపూలు', 'మూగమనసులు' సీరియల్స్‌లో చేస్తున్నా. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. సీరియల్స్‌కు, సినిమాలకు ఇబ్బంది లేకుండా వీలు చూసుకొని షూటింగ్‌లకు ప్లాన్ చేసుకుంటున్నా.
నచ్చే అంశాలు
ఈర్ష్యా, ద్వేషాలకు దూరంగా ఉండటం. మంచి ప్రవర్తనతో, అందరితో కలివిడిగా ఉండటం. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం. నేర్చుకునే తత్వం. నా ఆలోచనలకు తోడు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం. ముఖ్యంగా నేను కోరుకునేది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అయితే ఈ ఆత్మ విశ్వాసం మన అభివృద్దికి తోడ్పడాలి. అలాగే నలుగురికీ మంచి చేసేలా ఉండాలి.
ఇష్టపడే పాత్రలు
ఆడపిల్లను శక్తివంతంగా చూపే పాత్రలంటే చాలా ఇష్టం. మనలో ఉన్న నైపుణ్యాన్ని మన పాత్ర చూపించాలి. ఛాలెంజింగ్‌గా వుండే పాత్రలు చేయాలి. గతంలో చేసిన 'కర్తవ్యం'లో(సూపర్ ఉమెన్) మంచి పాత్ర చేశా. ఇప్పుడు చేస్తున్న 'అగ్నిపూలు' (ఎంపి రాజ్యలక్ష్మి) సీరియల్‌లో కూడా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లగా, ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో తపించే ఓ అమ్మాయి పాత్ర చేసే అవకాశం వచ్చింది.
- సలీమ