Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన పలువురు జాతీయ నాయకులు
న్యూఢిల్లీ : సుమారు ఎనిమిది నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను, ఇతర నాయకులను విడుదల చేయాలని పలువురు జాతీయ పార్టీల నాయకులు కేంద్రాన్ని కోరారు. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని మోడీ సర్కారు రద్దు చేసిన తర్వాత ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద కేంద్రం గృహనిర్బంధం విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరీలు ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.
లేఖలో... 'ఆ నాయకులు బయట ఉండటం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనే మోడీ సర్కారు వాదనలు నిరాధారం. అందుకు సంబంధించి గతంలో వారిపై అలాంటి ఆరోపణలేం లేవు. అంతేగాక ఆ ముగ్గురితోనూ కేంద్రంలోనో లేక రాష్ట్రంలోనో బీజేపీ గతంలో పొత్తులు కూడా పెట్టుకుంది' అని పేర్కొన్నారు. అయినా 370ని రద్దు చేయడంతో దాని ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయిన నేపథ్యంలో పీఎస్‌ఏ చట్టబద్దతను సవాల్ చేయొచ్చు అని తెలిపారు. దీర్ఘకాలం వారిని నిర్బంధించడం అంటే వాళ్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌లో అంతా సాధారణంగా ఉందని చూపించడానికి కేంద్రం తాపత్రాయపడుతున్నదని ఆరోపించారు. అంతేగాక కేంద్ర సర్కారు వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు నొక్కుతుందని విమర్శించారు. 'భారత రాజ్యాంగం వైవిధ్యంలో ఐక్యతను కలిగి ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు గౌరవించబడుతాయి. కానీ మోడీ ప్రభుత్వంలో అసమ్మతి వ్యక్తం చేసిన వారి నోరు నొక్కుతున్నారు' అని లేఖలో పేర్కొన్నారు.