Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన 300మంది ప్రమేయం : లోక్‌సభలో అమిత్‌షా
పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లు..
- 700మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం..
- అభినవ నీరో అమిత్‌షా అంటూ నినాదాలు
- సభలో వాడివేడి చర్చ... కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్
న్యూఢిల్లీ : ఢిల్లీ మత ఘర్షణల వెనుక కుట్ర దాగివుందనీ, ఉత్తరప్రదేశ్ (యూపీ) నుంచి వచ్చిన 300మంది అల్లర్లకు కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ నుంచి ఢిల్లీకి వచ్చి హింస సృష్టిం చారని అమిత్‌షా అనటం చర్చనీయాంశమైంది. ఢిల్లీ అల్లర్లపై చర్చ సందర్భంగా అమిత్ షా లోక్‌సభలో సమాధానమిస్తూ.. అల్లర్ల సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్నారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా ..
ఢిల్లీ అల్లర్లతో సంబంధమున్న వారు ఏ మతం, ఏ కులం, ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా వదిలే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ హింస ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా కనిపిస్తున్నదని అన్నారు. అల్లర్లను నియంత్రించేందుకు తాను ఢిల్లీ పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉన్నాననీ, తన అభ్యర్థన మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో పర్యటించారని షా తెలిపారు. ప్రస్తుతం అక్కడ 80 సీఆర్‌పీఎఫ్ కంపెనీల బలగాలను మోహరించామన్నారు.
ఏ ఒక్కర్నీ వదలబోం...
ఫిబ్రవరి 27 తర్వాత 700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ఈ అల్లర్లతో సంబంధం ఉన్న ఇరు వర్గాలకు చెందిన 2647మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అమాయకులెవర్నీ పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. బలమైన ఆధారాలతోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు. ఢిల్లీ అల్లర్లను 36 గంటల్లో నియంత్రించడంలో పోలీసులు విజయవంతమయ్యారని అన్నారు. ఈ అల్లర్లకు పాల్పడిన వారిని ఎవర్నీ వదిలేది లేదని స్పష్టం చేశారు. దేశంలో సీఏఏ వ్యతిరేక ర్యాలీలకన్నా, అనుకూల ర్యాలీలే ఎక్కువగా జరిగాయన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమన్న అమిత షా, ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదలబోమని లోక్‌సభలో ప్రకటించారు.