Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న కార్యక్రమాలకు వామపక్షాల పిలుపు
న్యూఢిల్లీ : మార్చి 23ను సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక దినంగా పాటించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేశ్‌లు చేసిన పోరాటం, బలిదానాలను ఆ రోజున గుర్తుచేసుకొని ప్రస్తుత బీజేపీ పాలనలో కొనసాగుతున్న దారుణాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఏఐఎఫ్‌బీ, ఆర్‌ఎస్‌పీలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై వస్తున్న వ్యతిరేకతను ఏకీకృతం చేసేవిధంగా మార్చి 23న కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఆధునిక, సమానత్వ భారతం కోసం భగత్ సింగ్ పనిచేశారని, ఇందులో భాగంగా ఆయన తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఈ ప్రకటన పేర్కొంది. శాంతియుత ఆందోళనలు నిర్వహించుకోవడం ఈ దేశ ప్రజల ప్రాథమిక హక్కు అని, కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ హక్కుపై నిరంకుశంగా దాడి చేస్తున్నాయని విమర్శించింది. దీనికితోడు తమ మతతత్వ రాజకీయాల కోసం బీజేపీ పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కూడా విచ్చలవిడిగా వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మూకలు సాగించిన హింసాకాండలో తాజా గణాంకాల ప్రకారం 53 మంది చనిపోయారనీ, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనీ, వందలాది మంది సాధారణ ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు చెందిన కోట్లాది రూపాయల విలువైన అస్తులు దోపిడికీ గురయ్యాయని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దారుణమని వామపక్షాలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ఈ హింసాకాండపై ప్రేక్షకులుగా మారి, ఉదాసీనంగా వ్యవహరించారనీ, ఈ మొత్తం ఘటనపై కాలపరిమితితో కూడిన జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన తాజాగా బడ్జెట్‌లో కేటాయింపుల తీరుపై కూడా వామపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సాధారణ ప్రజల జీవన విధానంపై నిరంతర దాడులకు పాల్పడుతూ కార్పొరేట్లు, సంపన్నులకు దేశ సంపదను మోడీ సర్కార్ దోచిపెడుతున్నదని విమర్శించాయి. బడ్జెట్ దేశ ఆర్థిక పునాదులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదనీ, ప్రజలపై మరింత భారాలు మోపి వారి కష్టాలను రెట్టింపు చేసే విధంగా ఉందని విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి, అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని ఐదు వామపక్ష పార్టీలు ప్రకటన ద్వారా పిలుపునిచ్చాయి. పలు ప్రాంతాల నుంచి మార్చ్ ద్వారా రాజకీయ పార్టీల నేతలు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు, సాహితీవేత్తలు పాల్గొనే ప్రధాన కార్యక్రమ సభ వద్దకు చేరుకోవాలని తెలిపాయి. సభ ముగింపు సమయంలో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయాలని తెలిపాయి.
మాంద్యంతో అల్లాడుతుంటే సీఏఏనా..? :
ప్రధానికి ఓ యువకుడి బహిరంగ లేఖ
దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని అల్లాడుతుంటే సీఏఏ, ఎన్నార్సీలు అవసరమా అని ఓ యువకుడు ప్రధానిని ప్రశ్నిస్తూ బహిరంగం లేఖ రాశారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్‌లో జర్నలిజం చదువుతున్న ప్రియం మాలిక్.. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 'నేను బీజేపీ మద్దతుదారిడినేం కాదు. కానీ మీరంటే (మోడీ) నాకు గౌరవం. కేంద్ర ప్రభుత్వంలో వారసత్వ రాజకీయాలను ఓడగొట్టి మీరు అధికారం చేపట్టినప్పుడు ఈ దేశానికి మంచి జరుగుతుందని భావించిన వాడిలో నేనొకడిని. కానీ ఆరేండ్ల తర్వాత ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్నది. నిరుద్యోగితరేటు మునుపెన్నడూలేని విధంగా పైకి వెళ్తున్నది. పేదరికం మరింత పెరుగుతున్నది. మీరు ప్రమాణం చేసిన మంచిరోజులు ఏమయ్యాయి..? అభివృద్ధి ఎటుపోయింది..? దేశం ఆర్థిక మందగమనంలో కొట్టుమి ట్లాడుతుంటే దాన్ని సరిచేయాల్సింది పోయి మీరు సీఏఏపై దృష్టి పెట్టారు. పడిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ కంటే కూడా అక్రమ వలసదారుల సమస్య మిమ్మల్ని వేధిస్తున్నదా..? పొరుగుదేశాల్లో వివక్షకు గురైన వారికి భారత పౌరసత్వం ఇస్తామంటున్నారు. మరి అందులో మీకు ముస్లింలు కనబడలేదా..? దేశ రాజధాని తగలబడుతుంటే మీరు మీ అమెరికా మిత్రుడితో గడుపుతారు. కనీసం వాటికి కారకులైన మీ పార్టీ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు' అని ప్రశ్నించారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జస్టిస్ మురళీధర్ 'తొందరపాటు' బదిలీపై దర్యాప్తు
రాష్ట్రపతి కోవింద్‌కు అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం వినతి
న్యూఢిల్లీ : జస్టిస్ ఎస్. మురళీధర్‌ను ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు 'తొందరపాటు' బదిలీపై అంతర్జాతీయ న్యావాదుల సంఘం ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే ఆయన బదిలీపై దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 'ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ (ఐబీఏహెచ్‌ఆర్‌ఐ) బహిరంగ లేఖ రాసింది. ఈశాన్య ఢిల్లీలో మత అల్లర్లకు ముందు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో బీజేపీ నేతలు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదులో విఫలమైన ఢిల్లీ పోలీసులపై మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఫిబ్రవరి 26 రాత్రి ఆయనను బదిలీచేసిన విషయం తెలిసిందే. 'భయంకరమైన సామాజిక అశాంతి నెలకొని ఉన్న సమయంలో ఈ అసాధారణమైన బదిలీ భారతదేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే అవకాశం ఉన్నది. ప్రభుత్వ లోపాలను కూడా గుర్తించి, దానిని హెచ్చరించే ప్రాథమిక హక్కు న్యాయవ్యవస్థకున్నది' అని పేర్కొంది. మానవ హక్కులను పరిరక్షణ, ప్రపంచవ్యాప్తంగా న్యాయ వృత్తి స్వతంత్రతను కాపాడటానికి ఐబీఏహెచ్‌ఆర్‌ఐ పనిచేస్తున్నది.
జస్టిస్ మురళీధర్‌పై బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే : ఐలూన్యూఢిల్లీ : జస్టిస్ మురళీధర్ బదిలీని ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించింది. కొంతమంది వ్యక్తులకు సంబంధించి నిఘా విభాగం(ఐబీ) నివేదికలను బహిరంగ పరచాల్సి ఉంటుందని మురళీధర్ బదిలీ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇలా జరిగితేనే ఎవరు ఏ కారణంతో బదిలీ అయ్యారు అన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆమె అన్నారు. స్వతంత్రంగా ఉండే ఒక న్యాయవ్యవస్థ, వ్యక్తులకు సంబంధించి బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరిత జ్యోక్యాన్ని తెలియజేస్తున్నా యని ఐలూ పేర్కొంది. మీనాక్షి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 121ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల వ్యవహారశైలి గురించి చర్చించకూడదని ఈ అధికరణ చెబుతున్నని, ఒక్క అభిశంసన తీర్మానం సందర్భంగా మాత్రమే న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత అంశాలపై కలుగచేసు కోవడం ఒక్క మోడీ సర్కార్‌కే చెల్లిందని, న్యాయ మూర్తులను కూడా భయపెట్టాలని అనుకుంటోం దని పేర్కొంది. తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా లేనప్పు డు సదరు జడ్జిలపై బదిలీ వేటు వేయడం పరిపాటిగా మారిందని, ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని పేర్కొంది. స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఈ దాడులను ఐలూ ఖండిస్తూ శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది.