ఇటీవలికాలంలో రాజకీయ నేతలకన్నా రాష్ట్రాల గవర్నర్లే ఎక్కువగా పతాకశీర్షికలు ఆక్రమిస్తున్నారని విమర్శకులు అంటున్నదాంట్లో ఆశ్చర్యంలేదు. ఏకకాలంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు సంబంధిత ముఖ్యమంత్రులతో ప్రభుత్వాలతో నేరుగా తగాదాపడుతున్నారు. మీడియా ద్వారా బెదిరిస్తున్నారు. ఘర్షణ పడుతున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచీ గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదమే. బీజేపీ దీన్ని మరింత తీవ్రం చేసింది. 1950 తర్వాత ఇంత తీవ్రరాజ్యాంగ ఘర్షణ చూసిందిలేదు. ఇలా రాజ్‌భవన్‌లను వివాదాలయాలుగా మార్చిన గవర్నర్లందరూ పూర్వాశ్రమంలో బీజేపీ కీలక నేతలు, వీరివల్ల అనిశ్చిత పరిస్థితికి గురవుతున్న వన్నీ బీజేపీ యేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైకి తెలంగాణ గవర్నర్‌గిరీ అప్పగించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు తథాగతరారుని త్రిపుర గవర్నర్‌గా నియమించి తర్వాత మేఘాలయకు పంపించింది. జగదీప్ ధంకర్ బెంగాల్ గవర్నర్‌గా అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వంతో చెలగాటమాడగా ఆయనను ఏకంగా ఉపరాష్ట్రపతిని చేసింది. లౌకికముసుగుతో కాంగ్రెస్‌పై తిరుగుబాటుచేసి తర్వాత బీజేపీలో చేరిన ఆరిఫ్ మహ్మద్‌ఖాన్‌ను కేరళకు తరలించింది. తమకెంతో నమ్మకస్తుడైన మాజీ ఉన్నతాధికారి ఆర్‌ఎన్ రవిని తమిళనాడుకు పంపించింది. ఇవన్నీ బీజేపీ హానికరవిధానాలను వ్యతిరేకించే పార్టీల పాలనలోని రాష్ట్రాలు. కనుక ఇది ఉద్దేశ పూర్వకంగా సాగుతున్న రాజకీయ తతంగమే. కేంద్రంలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం రాజ్‌భవన్‌లను వేదికలుగా చేసుకోవడం వల్ల కలిగిన అనర్థం.
సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ వంటి దర్యాప్తు సంస్థలనే గాక, ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టును కూడా వత్తిడికి గురిచేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వ రాజ్యాంగ కుట్రగా ఇది గోచరిస్తుంది. గవర్నర్ల వివాదాలలో అత్యధిక భాగం విశ్వవిద్యాలయాలతో ముడిపడివుండటం కూడా బీజేపీ రాజకీయ ఎత్తుగడలలో భాగమే. వారు ప్రభుత్వంలో ఎప్పుడూ విద్యాశాఖ తమచేతిలోనే పెట్టుకుంటారు. విద్యారంగంలో తలదూర్చి పాఠ్యాంశాలను, అంతర్గత వాతావరణాన్ని కలుషితం చేయడం, విద్యార్థి దశలోనే యువతను ప్రభావితం చేయడం బీజేపీ ఆరెస్సెస్‌ల కీలకవ్యూహాలు. ఇప్పుడు ఈ పని తమ గవర్నర్లకు బదలాయించబడింది. అదే సమయంలో రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించి కేంద్రీకృత పెత్తనానికి ప్రాతిపదిక వేసుకోవాలనేది ఆ పార్టీ మౌలిక విధానం,
గవర్నర్ల పరిధి... పరిమితి
రాజ్యాంగం 153వ అధికరణం గవర్నర్ ఉండాలని నిర్దేశిస్తూనే 13వ అధికరణం ద్వారా ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం తనకు సలహాలిస్తూ సహాయపడాలని చెబతున్నది. రాష్ట్ర పాలన గవర్నర్ పేరుమీద సాగుతుందని చెబుతూనే చట్టబద్దంగా సంక్రమించే అధికారాలు మాత్రమే నెరవేర్చాలని 154(2)(ఎ) ద్వారా స్పష్టం చేస్తున్నది. 123, 213, 311(2), 317, 352(1), 356, 360 వంటివాటి కింద రాష్ట్రపతి, గవర్నర్ సంతృప్తి చెందడం అన్నదే విచక్షణాధికారాలకిందకు వస్తుంది. ఇందులో కూడా ప్రభుత్వాలను బర్తరప్ చేసే 356వ అధికరణం మాత్రమే గవర్నర్ స్వంతంగా చేయగలిగింది. ఈ ఒక్కటి తప్ప మరే ఇతర అంశమైనా ప్రభుత్వంతో సంప్రదించి మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు 1974లో ఇచ్చిన ఒక తీర్పులో స్పష్టం చేసింది. 1967-90 మధ్య కేంద్రం 356 అధికరణాన్ని 90సార్లు దుర్వినియోగం చేసింది. అయితే ప్రతిపక్షాల ఆందోళన, బొమ్మై కేసులో సుప్రీంతీర్పు తర్వాత ఇది 17సార్లకు తగ్గిపోయింది. 2011-16 మధ్య అయిదు సార్లు మాత్రమే వినియోగించగలిగారు .గవర్నర్ల ద్వారా 356తో కేంద్రం ప్రభుత్వాలను కూల్చివేసే పద్ధతికి బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మోడీ అన్న చందంగా మరోసారి గవర్నర్ల ద్వారా ఇష్టారాజ్యం తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు, కానీ బీజేపీ నియమిత గవర్నర్లు అక్షరాలా అలాంటి దుస్సాహస ప్రయత్నాలే చేస్తూ భంగపాటుకు గురవుతున్నారు.
ముగ్గురు గవర్నర్ల చిందులు
కేరళగవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదేపదే పినరాయి విజయన్ ప్రభుత్వంతో అడుగడుగునా ఘర్షణకు దిగుతున్నారు. శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠం సరిగా చదవలేదు. విశ్వవిద్యాలయ ప్రసంగాలలో ప్రగతిశీల మేధావుల ప్రసంగాలపై పేచీపెట్టుకున్నారు. ఆరెస్సెస్ వారినే సహాయకులుగా నియమించాలని పట్టుపట్టారు. ప్రభుత్వ విధానం తనకు ఆమోదం కాదని అనేకసార్లు బహిరంగ వివాదం ప్రకటించారు. మంత్రులతో గిల్లికజ్జాలు పెట్టుకున్నా మొదట ముఖ్యమంత్రి సర్దుబాటు ధోరణి కనపర్చడంతో తర్వాత మరింత రెచ్చిపోయారు. విద్యామంత్రి రాజీవ్ తనపై వ్యాఖ్యలు చేశారు గనక ఆయన నియామకానికి తన ఆమోదం ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించి నవ్వుల పాలైనారు. ఎందుకంటే రాజ్యాంగం ముఖ్యమంత్రి సలహామేరకు మంత్రులను నియమించాలని చెబుతున్నదే గాని ఏకపక్షంగా తొలగించే అధికారం ఇవ్వడంలేదు. విశ్వవిద్యాలయాలలో నియామకాలను శాసించేందుకు సిద్ధపడ్డారు. ఒక లెక్చరర్ నియామకం పక్షపాతంతో చేశారంటూ తగాదా పెట్టుకున్నారు. ఒక వైస్‌ఛాన్సలర్ విషయంలోనూ పేచీకి దిగి అందరు విసిలను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీనిపై హైకోర్టు సుప్రీంకోర్టులలో కేసు వేయగా ఆయన ఉత్తర్వులను నిలిపేశారు. తెలంగాణ గవర్నర్ తీరు కూడా ఇంచుమించు డిట్టోగా ఉంది. తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు ఒకే అంశంపై వివాదం పెట్టుకోవడం బట్టి చూస్తే ఇది దేశమంతటా బీజేపీ పెట్టుకున్న విధానమని అర్థమవుతుంది. వీరందరూ పప్పులో కాలేసిన అంశం ఒకటే. విశ్వవిద్యాలయ చాన్సలర్లుగా గవర్నర్ల అధికారం రాష్ట్రాల శాసనసభలు ఇచ్చిందే గాని రాజ్యాంగం ఇచ్చింది కాదు.
ఎందుకంటే విద్య ఉమ్మడి జాబితాలోది. వాటిపై కేంద్రం ముందు శాసనం చేస్తే అదే చెల్లుతుంది. ఈ లొసుగును ఆధారం చేసుకునే కేంద్రం విద్యారంగంపై రాష్ట్రాలను సంప్రదించకుండా అనేక ఏకపక్ష విధానాలను రుద్దుతున్నది. ఛాన్సలర్ హోదా విషయంలో అదే విధమైన అధికారం రాష్ట్రాలు ఉపయోగిస్తే రాజ్యాంగ విరుద్ధమైనట్టు గవర్నర్లు గాని, కేంద్రం గాని గగ్గోలు పెట్టడం చట్టం ముందు నిలిచేదికాదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలోనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా ఉంటారని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ చట్టం చేసింది. గవర్నర్ల రాజకీయ కుట్రల కారణంగా ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ కూడా అలాంటి శాసనాలు లేదా ఆర్డినెన్సులు చేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి సలహా మేరకు వాటిని ఆమోదించే బదులు ఈ ముగ్గురు గవర్నర్లు మా అధికారాలను మేమే ఎందుకు తగ్గించుకుంటామని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై దాదాపు ఇరవై బిల్లులకు ఆమోదం వేయకుండా తొక్కిపట్టడమే గాక విద్యామంత్రి వచ్చి వివరించాలని షరతు పెట్టారు. బిల్లులపై సంతకానికిి కాలవ్యవధి ఏదీ రాజ్యాంగంలో లేదని వితండవాదన చేస్తున్నారు. వ్యవధి చెప్పకపోవడమంటే వెంటనే చేసేయాలని అర్థం తప్ప ఎడతెగని జాప్యం చేయొచ్చని కాదు. ఈ సందర్బంగా తమిళిసై రాజ్‌భవన్‌కూ ప్రగతిభవన్‌కూ పోటీ పెట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి పట్టించుకోని విషయాలు తన దర్బారులో తీరుస్తానన్నట్టు చెప్పారు. ఆఖరుకు ఎంఎల్‌ఎల కొనుగోలు కోసం బీజేపీ సాగించిన ఆపరేషన్ ఫాంహౌస్‌ను కూడా అధికారికంగా ప్రస్తావించడం ఆమె రాజకీయ పక్షపాతానికి పరాకాష్ట. ఈ ఆపరేషన్‌లో తన సహాయకుడైన తుషార్ పేరు వచ్చిందని భుజాలు తడుముకున్నారు. (వాస్తవానికి అది కేరళలో బీజేపీ మిత్రపక్షం నాయకుడి పేరు) ఇవన్నీ నిలవకపోవచ్చనే సందేహంతో ఆమె తన ఫోన్‌నే ట్యాప్ చేసినట్టు ఆరోపణలు చేశారు. ఈ ఘర్షణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై చేసిన ఆరోపణలను సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా బలపర్చడం ఇక్కడ గమనించదగింది. మర్యాదలు ఇవ్వకపోయినా ఈ సర్కారును రద్దు చేసే అధికారం తను ఉపయోగించకుండా ఉదారంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకున్నారు
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయితే రాజ్‌భవన్‌కు వచ్చి తేల్చుకోండని బహిరంగ సవాళ్లతో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపుతామని బెదిరిస్తున్నారు. అత్యంత అరుదైన సందర్భాలలో తప్ప ఈ అవకాశం ఆయనకు ఉండదని రాజ్యాంగ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. తమిళనాడు గవర్నర్ రవి కూడా నీట్ ఆర్డినెన్సు తిరస్కారం, ఇడబ్య్టుఎస్ రిజర్వేషన్లు, మతతత్వ రాజకీయాలు ఇలా చాలా విషయాల్లో అవరోధాలు సృష్టిస్తూ తగాదా పడుతూనే ఉన్నారు. ఆయనను వెనక్కు పిలిపించాలని డిఎంకె, వామపక్షాలు, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతికి లేఖ రాయాల్సివచ్చింది. గతంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆదరాబాదరగా తొలుత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రమాణస్వీకారం చేయించి అభాసుపాలైనారు. తర్వాత వచ్చిన ఉద్భవ్ ఠాక్రే ప్రభుత్వం పట్ల శత్రుపూరితంగా ఉంటూ ప్రతిపాదనలన్ని తిరగ్గొట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లుగా వచ్చిన వారందరూ ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం నిత్యకృత్యం... ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న విజయకుమార్ సక్సేనా తనే ప్రభుత్వమన్నట్టు వ్యవహరించడంపై సర్కారు న్యాయపోరాటం చేస్తున్నది. ఇలాంటి వివాదాలపై వివిధ రాష్ట్రాల నుంచి ఇంకా అనేక కేసులపై న్యాయస్థానాల విచారణలో ఉన్నాయి. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, వ్యాఖ్యలు అనేకం గవర్నర్ల ఏకపక్ష పోకడలను తోసిపుచ్చేవిగా ఉండటం స్వాగతించదగింది. ఏమైనా ఈ కేసులలో స్సష్టమైన ఉత్తర్వులతో రాజ్యాంగ స్పష్టత వస్తేనే గవర్నర్లకు కళ్లెం పడుతుంది.
ఏది ఏమైనా రాష్ట్ల్రాలు రాజ్‌భవన్‌ల నిరంకుశత్వాన్ని ఆమోదించే ప్రసక్తి ఉండదు. ఉండకూడదు. రాష్ట్రపతి హర్షామోదం(ప్లెజర్) ఉన్నంత వరకూ గవర్నర్లు పదవిలో ఉంటారని మాత్రమే రాజ్యాంగం చెబుతుంది. అంటే ఎప్పుడైనా తొలగించవచ్చు, ఎంతకాలమైనా కొనసాగించ వచ్చు. ఇలాంటి అవకాశం ఉన్న పదవి ఇదొక్కటే. అసలు రాష్ట్రపతిగారే నామకార్థపు దేశాధినేత కాగా ఆయన నియమించే గవర్నర్ రాష్రాధినేతనంటే ఎలాకుదురుతుంది? రాజ్యాంగపరంగా మర్యాదపూర్వకంగా విధులు నిర్వహించే బదులు సైంధవ పాత్రధారులుగా మారిన ప్రస్తుత పరిస్థితి ప్రజాస్వామ్యానికి, ప్రత్యేకించి రాష్ట్రాల హక్కులకు గొడ్డలిపెట్టు. ప్రజలెన్నుకున్న సర్కార్లపై కేంద్రం నియమించిన ఏజంట్ల వంటి గవర్నర్లను అడ్డుపెట్టుకునే కేంద్ర కౌటిల్యం సహించరానిది.
- తెలకపల్లి రవి
Authorization