ఆధ్యాత్మికత గురించి కొందరు ఎంతో గొప్పగా చెపు తుంటారు. ఆది మనిషి ఆలోచనని చిదిమేసి అజ్ఞానంలో బంధించే ఒక మోసం. కొందరి శ్రమ రహిత సుఖ జీవనాన్ని మరెవరూ ప్రశ్నించకుండా ఉండటానికి, తమ కష్టాల్ని దేవుడి అభీష్టంగా అంగీకరించి, తమ బాధలకు కారణాలేవో ఎప్పటికీ విశ్లేషించుకోకుండా ఆధ్యాత్మికత అనే అడ్డుగోడను నిలబెడతారు. తమ శ్రమను దోచుకునే వారిని ప్రశ్నించకుండా ఎదురించకుండా ఉండటం కోసం, వెరసి - పీడితుల నోరు మూయించడానికి తయారు చేయబడ్డ అపోహల సిద్ధాంతం - ఆధ్యాత్మికత! దేవుడు భక్తి అనే మూఢనమ్మకపు చెప్పును ఆధ్యాత్మికత అనే ముఖ్‌మల్ గుడ్డలో చుట్టి తెలియకుండా మెత్తంగా మోసపూరితంగా కొట్టే విధానమే ఇది. మత బోధకులు నేరుగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఆధ్యాత్మిక వేత్తలు విషయం తిప్పి తిప్పి ప్రాపంచిక దృక్పథంలో కొంత మార్మికత రంగరించి - తెలిసినట్టు అనిపిస్తూ తెలియకుండా ఉండేట్టు, అర్థమయినట్టు అనిపిస్తూనే అర్థంకాకుండా ఉండేట్టు - విషయాన్ని పలుచని పొరల మధ్య దాచిపెడుతూ అందులో ఏవో గాఢమైన, లోతైన విషయాలున్నట్టు భ్రమింపజేసేది - ఆధ్యాత్మికత! ఏ దేవుడి వల్లగానీ, ఏ భక్తుడి వల్లగానీ ఏ సమాజమూ పురోగతి సాధించనట్టే - ఏ ఆధ్యాత్మికత వల్ల ఎక్కడ ఏ ప్రగతీ సాధించబడలేదు. దీనికి కొలబద్ధ ఒకటే. ఏ ఆధ్యాత్మిక వేత్తల వల్లా ఎవరి జీవన ప్రమాణాలు ఎప్పుడూ ఎక్కడా పెరిగింది లేదు. మానసిక బలహీనులయిన వారిని మరింత దుర్బలులుగా చేయడం తప్ప, ఆత్మ విశ్వాసాన్నిచ్చి జీవన సమస్యల్ని ఎదుర్కోవడం నేర్పింది లేదు. ఆధ్యాత్మిక రంగంలో గోప్పవాళ్ళుంటే ఉండొచ్చు. వారు ఎంతో మందిని ప్రభావితం చేస్తే చేసి ఉండొచ్చు. కానీ లాభమేమిటీ? దొంగ బాబాలు కూడా జనాన్ని ప్రభావితం చేశారు. దానివల్ల సమాజానికి ఒనగూరిన మేలు ఏమైనా ఉందా? కీడు తప్ప! ఇదీ అలాంటిదే! దేవుడు ఉన్నాడని నేరుగా చెప్పకుండా దృష్టిని అనేక విషయాల మీదికి మళ్ళిస్తూ ఒక బలమైన విశ్వాసం కలగడానికి దోహదపడుతూ, అవిశ్వాసకుల చేతనే తెలివిగా 'ఆవును సుమీ ఎక్కడో ఏదో శక్తి ఉంది. అది మన బాగోగులు చూస్తోంది. దాని దయా దాక్షిణ్యాల వల్ల మనం బతుకుతున్నాం' అనే ఒక పనికి మాలిన విశ్వాసంలోకి మనంతట మనమే వచ్చేట్టు చేసే ఒక మాయాజాలం ఆధ్యాత్మికత! అలాగే దోపిడీని కప్పిపుచ్చే ముసుగే మతం!!
మత విశ్వాసకుల ప్రేమ గురించి, వారు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుంటే మనకు కనువిప్పు కలుగుతుంది. ఇవి ఒక దేశానికో, ఒక మతానికో పరిమితం కాదు. విశ్వవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని మతాలలో ఉన్న విషయం ఒకటే.. ఊరి బయట బతుకీడుస్తున్న నిమ్నకులాల వారిని, పెద్ద కులాల వారు వినాయక చవితి, శ్రీరామనవమి వంటి పండుగల రోజుల్లో రోడ్ల మీద కూచోపెట్టి ఓ పూట అన్నం పెట్టడం.. కట్టు బానిసలుగా పడి ఉన్నవారిపట్ల మమకారం ప్రదర్శించడం ఎందుకూ? పీడించే వారు ఎప్పుడూ తక్కువ సంఖ్యలో ఉంటారు. సమాజంలో పీడించబడే జనాలు ఎప్పుడూ అధిక సంఖ్యలో ఉంటారు. అంటే పీడించేవాడికి ఎప్పటికైనా ప్రమాదమే. అధిక సంఖ్యాకులైన పీడితులు పీడనకు వ్యతిరేకంగా ఎప్పటికీ సంఘటితం కాకుండా కట్టడి చేసే మార్గమే - దైవచిత్తం! ఇది దైవచిత్తమే కానీ, తమ మోసం కాదు అని బురిడీ కొట్టించే ప్రయత్నమే - ప్రేమ - సేవ - అనే మాటలు. దేవుడు తమని పాలించే స్థితిలో ఉంచాడుకాబట్టే, తాము నిరంతరం పాలిస్తున్నామనీ, తమకు పీడితుల పట్ల ఉన్నది గాఢమైన ప్రేమే కానీ మరొకటి కాదన్నది నమ్మకంగా చెపుతుంటారు. అది నిరూపించుకోవడానికి పైపైన సేవా కార్యక్రమాలతో నాటకాలు ఆడుతుంటారు. మతం పేరిట ప్రదర్శించే నైతికత ఏమిటంటే అది కేవలం పీడితులు ఎదురు తిరగకుండా చూసుకునే కుట్ర. అలాగే మతం పేరిట చేసే సేవా కార్యక్రమాలు కేవలం పీడితుల్ని మభ్యపెట్టి మోసం చేయడానికే!
ఆఫ్రికాలో నల్లజాతి వారిని బానిసలుగా చేసుకుని, సంతలో పశువుల్లాగా ఖండాంతరాల్లో అమ్ముకున్నది తెల్ల క్రైస్తవులు కాదా? నల్లజాతి మహిళల్ని అత్యంత జుగుప్సాకరంగా వాడుకున్నది వాళ్ళు కాదా? ఇదంతా చేసిన తెల్లతోలు క్రైస్తవులు తమను తాము భక్తిపరులుగా, దైవదూతలుగా ప్రచారం చేసుకోలేదా? ఇలాంటి క్రైస్తవ భక్తుల ఆగడాలు బహిరంగంగా చరిత్ర పుటల్లో కనిపిస్తూనే ఉన్నాయి. నల్లవారిని బానిసలుగా తమ దగ్గర ఉంచుకోవడమనేది కేవలం దైవేచ్ఛ తప్పితే మరొకటి కాదని వారు ప్రకటించుకుంటూ ఉండటం నిజం కాదా? వారి యజమాని తాము కాక మరొకరయితే వారు చిత్రహింసలకు గురయ్యేవారనీ, తాము కాబట్టి వారిని బాగా చూసుకోగలిగామని ప్రకటించుకోలేదా? అమాయకులైన నల్ల బానిసలు ఆ మాటల్ని నమ్ముతూ ఉండిపోలేదా? ఆ విధంగా వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, పిల్లల పిల్లల్ని.. అంటే తరతరాల్ని బానిసత్వంలో కట్టిపడేసిన ఘనులు ఈ తెల్ల క్రైస్తవులే. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నది కూడా ఇదే. అక్కడ యజమానులు అరబ్బులు. అక్కడికి వలస వచ్చిన శ్రామికులకన్నా వీరి సంఖ్య చాలా తక్కువ. ఆ దేశాల సంపదను సృష్టిస్తున్నది వలస శ్రామికులే. కానీ, వీరిని కుక్కల కన్నా హీనంగా చూసే ఇస్లాం మతవాదులు - పీడితుల దృష్టి మరల్చడానికి 'ఉత్తమ యజమాని'గా నటిస్తుంటారు. ఒక్కోసారి శ్రామజీవుల పట్ల ప్రేమ కురిపించడం, వారికి అప్పుడప్పుడు విందులు ఏర్పాటు చేయడం, చిన్నపాటి బహుమతులు ఇస్తుండటం వగైరా చేస్తుంటారు. ప్రతి మాటలో అల్లాను గుర్తుచేసుకుంటూ తాము గొప్ప దైవభక్తి గలవారిగా ప్రదర్శించుకుంటారు. ఇన్ష అల్లా, సుభా నల్లా, ఖుదాహఫీజ్ వంటి మాటలు ఆ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చినవే. శ్రామికుల పట్లప్రేమ కలిగిన వారమని, దేవుడి పట్ల భక్తిగల వారమని ప్రకటించుకోవడం ఎందుకంటే శ్రామికులు కూడా ఆ భగవంతుణ్ణి తలుస్తూ తమ శ్రమను మరిచిపోవాలని, శ్రమకు కారకులైన తమ పట్ల కూడా గౌరవభావంతో మెలుగుతూ ఉండాలనీ వారి కోరిక! అందుకే ప్రేమ - సేవ వంటి మాటలతో మభ్యపెడుతుంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలు ఏవైనా కానీయండి.. ఫార్ములా ఒక్కటే..యజమాని బానిసల్ని కట్టిపడేయడానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు.
తమ దాష్టీకాన్ని, దోపిడీని, మోసాన్ని మతం ముసుగులో - దేవుడి ముసుగులో కప్పి పుచ్చుకుంటారు. దానివల్ల తమ జీవితం శ్రమలేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా గడిచిపోతూ ఉందని, అది అలాగే గడిచిపోతూ ఉండాలని వారు భావిస్తూ ఉంటారు. ఇక మరికొందరు తెలియకుండానే ఆ చట్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకు హిందూ సమాజంలోని శూద్రులయిన మత భక్తులు ఇలాంటి వారే. మతానికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తూ, దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంటారు. కానీ వీరికి శ్రమ నుంచి విముక్తి లభించదు. అగ్రవర్ణం వారిలాగా సమాజంలో గౌరవమూ లభించదు. వారికి లభించిన విధంగా వీరికి అప్పనంగా ఏ సౌఖ్యాలూ దక్కవు. అయినా తమ ధర్మ ప్రవర్తన వల్ల, సంప్రదాయ బద్ధమైన 'మంచి' ప్రవర్తన వల్ల, దైవభక్తి వల్ల తమకు కూడా గౌరవం, ఘనతా దక్కాలని ఆరాటపడుతుంటారు. ఎప్పుడూ నుదుట కుంకుమ ధరిస్తారు. ముంజేతికి కాశీదండ కట్టుకుంటారు. దేవుడి పేరుతో గుండు కొట్టించుకుంటారు. మెడలో తాయెత్తు వేలాడేసుకుంటారు. అయినా శూద్ర భక్తుడికి అగ్రవర్ణం వాడికి గల స్థాయి లభించదు. అందుకే స్థాయీ భేదాలు పాటిస్తున్న దేవుడు, మతం అవసరమా? అనేది ఆలోచించుకోవాలి. పూజలు, వ్రతాలు చేసినా - మైసమ్మ, పోచమ్మలకు యాటల్ని కోసినా, కల్లు పొంగించినా అవన్నీ వారు, వారి బంధుగణం తిన తాగడానికే.. వేడుకలు చేసుకోవడానికే తప్ప.. వాటివల్ల వారు నీతిమంతులు కారు. గుళ్ళు, గోపురాలు కట్టించడానికి భూరి విరాళాలు ఇవ్వొచ్చు గాక వాటివల్ల ఎవరూ మహాత్ములుగా గుర్తింపబడరు. వీరి మానవసేవ కేవలం వీరి మతాంధకారానికి వేసుకున్న ముసుగు మాత్రమే! ఇది సమాజ ఉద్ధరణలో భాగంగా పరిగణింపబడదు. తోటి వారి జీవితాలు బాగుపరిచే విషయాలు ఇందులో ఉండవు. తోటి వారి ఆకలి తీర్చే పనులేవీ కావు. ధర్మకర్తగా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న దుగ్ధ తప్పించి మరోటి కాదు. ఇలాంటి ప్రేమ - సేవా కార్యక్రమాల్లో మానవీయ విలువల్ని నిలబెట్టిందెక్కడీ గుళ్ళ ముందు, ఇతర ప్రార్థనా స్థలాల ముందు అన్నార్తులు, పేదలు ఎంతో మంది కూర్చుని ఉంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. అలాంటి వారి బాగోగులు ఆలోచించే ధర్మ పరిరక్షకులు ఏరి? ఎక్కడా?
దేవుణ్ణి చూపి జనాన్ని బానిసలుగా చేసిన మనువాదులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. వీరి ఫార్ములా కూడా అదే. కొంచెం ఇటు అటుగా మారుతుంటుంది. ఆకలి, ఉద్యోగం, అభివృద్ధి, ఆర్థిక స్థితి గురించి జనాన్ని ఆలోచించనీయకుండా పౌరసత్వం చట్టం తెచ్చారు. ముఖ్యమైన విషయం నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చాలంటే ఏదో ఒక సమస్య తాజాగా తెచ్చిపెట్టాలి. ప్రతి దానికీ పక్కన ఉన్న పాకిస్థాన్‌ని చూపడం దేశ ప్రజల్ని హింసించడం... ఉగ్రవాదుల పేరు చెప్పడం తామే ఉగ్రవాదులుగా వ్యవహరించడం... పరీక్షలు రాసిన అనుభవం లేనివాడు పరీక్షలపై చర్చ పెట్టడం? పదోతరగతి సర్టిఫికేట్ చూపలేనివాడు మన ముత్తాత బర్త్ సర్టిఫికేట్ చూపాలని అనడం..!? దేశ ప్రజల దుస్థితి చూసి, జీవితాంతం చిన్నపాటి ధోతితో గడిపిన జాతిపిత గుజరాత్‌వాడే. దేశాన్ని అప్పుల్లో ముంచి రెండుకోట్ల విలువగల కోటుతో తిరిగేవాడూ గుజరాత్‌వాడే. మత ప్రాతిపదికన దేశ పౌరసత్వమంటే ఏదీ నైతికత? ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి? మతాన్ని బూచిగా చూపి భయపెట్టిన నియంతలు చరిత్రలో నికృష్ట జీవులుగా మిగిలారు.
ఈ ఆధునిక యుగంలో పరిస్థితి చాలా సంక్లిష్టమైపోయింది. అనాకానేక పరిస్థితుల వల్ల సమాజ స్వరూపం మారింది. ఇప్పుడు అగ్రవర్ణాల వారంతా పీడించేవారు కాదు. నిమ్నకులాల వారంతా పీడించబడేవారు కాదు. ధనవంతులంతా చెడ్డవారూ, పేదలంతా మంచివారూ కాదు. వర్గీకరణ ఇప్పుడు మరొక రకంగా చేసుకోవాల్సి ఉంది. యాదృచ్ఛికంగా అగ్రవర్ణాల్లో పుట్టినా, మనువాదానికి వ్యతిరేకంగా గళం ఎత్తేవారున్నారు. నిమ్నకులాలలో పుట్టి కూడా పరాయీకరణ చెంది మనువాదులుగా మారిపోయిన వారున్నారు. అందువల్ల మనువాదాన్ని నిరసిస్తూ మానవజాతి అంతా ఒక మిశ్రమ సంతతి - అన్న నిజాన్ని గ్రహిస్తూ మానవీయ విలువల కోసం, సమానహక్కుల కోసం పోరాడుతూ ఒక మా'నవ'వాదాన్ని సమాజంలోకి తీసుకుపోయేవారు కావాలి? మన భారతదేశంలో పరిస్థితి ఘోరంగా ఉంది. కారణం.. ఇక్కడ హిందువులు ఎక్కువ. హిందూ మతంలో వర్గాలు, వర్ణాలు, కులాలు, గోత్రాల పేర విభజనలు మరీ ఎక్కువ. మనిషిని జంతువుకన్నా హీనంగా చూడగల సంప్రదాయం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. పరిస్థితి మారి మనిషి మనిషిగా బతకగలిగే స్థితి, మనిషిని మనిషిగా గుర్తించగలిగే ఔదార్యం ఇప్పటి ఈ తరం వారు సాధించుకోవాల్సి ఉంది. ఒక అద్భుతమైన ఆదర్శ ప్రాయమైన మానవ సమాజాన్ని, సమానత్వ విలువలతో రాగల తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ తరం పౌరుల మీదే ఉంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
Authorization