Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిది ఒక విస్మత చరిత్ర. ఆ వూరెందుకు రాయగిరయిందో తెలియదు. రాయగిరి రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని పూర్వం తిరుమలగిరి తండ అని పిలిచేవారని రాయగిరి గ్రామస్తుడు మైదబోయిన అంజయ్య అనే పెద్దమనిషి చెప్పాడు. వెనకటికి అక్కడ వున్న గుట్టకు వెంకటేశ్వర్లు వెలిసినందువల్ల ఆ ప్రాంతం తిరుమలగిరి అయిందేమో.
రాయగిరి- అతి ప్రాచీన మానవావాసం
రాయగిరి నుండి రైలు మార్గం వేసే కాలంలో వందలాది ఆదిమాన వుల సమాధులు బయటపడ్డాయి. వాటిలో బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులెక్కువగా బయటపడ్డాయి. ఈ సమాధుల గురించి డా||ఈ.హెచ్.హంట్ అనే బ్రిటిషరు రాయల్ ఆంత్రోపాలజికల్ ఇన్స్టిట్యూట్ జర్నల్ (వాల్యూమ్-×V)లో 'హైదరాబాద్ కెయిర్న్ సమాధులు- వాటి ప్రాముఖ్యత' అనే వ్యాసంలో రాసారు. ఈ సమాధులలో దొరికిన గాజుపూసలు ఇక్కడి పదార్థంతో చేసినవి కాదట. అవి ఆఫ్ఘనిస్తాన్ లో లభించే లాపిస్ తో చేయబడినవట. ఇక్కడ తవ్వకాలు జరిపిన సమాధుల నుండి రెండు పురుషుల అస్థిపంజరాలు, కొన్ని స్త్రీల అస్థిపంజరాలు... అందులో ఒకటి చిన్నమ్మాయి అస్థిపంజరంతో పాటు ఆ పూసలు దొరికాయట. ఆ సమాధులలో ఒక్కొక్కటి 20 మందిని ఖననం చేసేంత పెద్దవి కూడా వున్నాయి. టన్నుల కొద్ది బరువైన కప్పుబండలతో, ఒక వరుస లేదా రెండు వరుసల గుండ్రాళ్ళ వర్తులాలతో ఈ రాక్షసగుళ్ళు లేదా రాకాసిగుళ్ళు లేదా మెగాలిత్స్ లేదా బహత్సమాధులున్నాయి (వుండేయి.. ఇపుడన్నీ తొలగించబడ్డాయి).
వీటి నుండి లభించిన వస్తుసామగ్రిలో అతి తక్కువగా వెండి, బంగారు వస్తువులు, గంటలు, పళ్ళాలు, ఆభరణాలు విరిగిన రూపంలో రాగివస్తువులు దొరికాయి. ఇనుప ఆయుధాలు, గుర్రపు స్వారీకి పనికొచ్చే రికాబులు, అమ్ముల ములుకులు, కత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, త్రిశూలాలు ఎక్కువగా దొరికాయి. ఇక్కడ దొరికిన మట్టిపాత్రలు గోధుమ, ఎరుపు రంగులలో వున్నాయి. వీటి మీద ఈజిప్టు పాత్రల మీద వున్నట్టుగా 'క' గుర్తులున్నాయి. ఈ అక్షరం కుండ చేసినపుడు రాయలేదు. ఈ గుర్తులు తర్వాత కుండల మీద గుర్తులుగా గీరినట్టు తెలుస్తున్నది.
ఒకప్పుడు హైద్రాబాద్ ఆర్కియాలజికల్ సొసైటీవారు, బ్రిటిష్ పరిశోధకులు డా.ఈ.హెచ్.హంట్ ఆధ్వర్యంలో గులాం యాజ్దాని చేపట్టిన తవ్వకాల వల్ల సింధునాగరికతతో సరిపోలిన సంస్కృతి అక్కడి సమాధులలో బయటపడింది. ఈ సమాధులు చరిత్రపూర్వదశకు చెందినవని, అయో (ఇనుప) యుగానికి చెందినవని కె.ఎల్.కె.మూర్తి గారు రాసారు. రాయగిరి సమాధులను తవ్వించిన యాజ్దాని, ఇవి చాలా అపూర్వమైనవని వీటి సంస్కతి సింధునాగరికత కన్న ముందరిదని తన నివేదికలో రాసాడు. ఇంత చరిత్రను మనం విస్మరిస్తున్నాం. కాపాడుకోవలసిన బాధ్యతకూడా మనదే కదా.
రాయగిరికోట
రాయగిరి చరిత్ర అసంపూర్ణంగానే వుంది. తిరుమలగిరి గుట్టకు పడమట వున్న మల్లన్న గుట్ట మీద ఒక పురాతన చరిత్ర మరుగునపడి వుంది. రాయగిరి రైల్వేస్టేషన్‌కు పడమరగా, ఫ్లై వోవర్ మొదలయేచోట మల్లన్నగుట్ట వుంది. మల్లన్నగుట్ట ఒక అద్భుతం. పురాతనస్మతుల విషాదం. తూర్పు దిశ మధ్యలోనే కోట గోడ కనిపిస్తుంది. ఇది మట్టిగోడ. చిన్న చిన్న రాళ్ళని కడుపులో పెట్టుకున్న పెద్దరక్షణ కవచం. అక్కడికి దగ్గరలో చేదబాయికోట వుంది. కోటగోడ మూడు ప్రాకారాలుగా వుంది. ఒకటి మట్టిగోడ, రెండవది చెక్కిన పెద్ద రాతిబండలతో రెండవ వరుస కోటగోడ. మూడవది చక్కగా గోడలకోసం చెక్కిన రాతిబిళ్ళలతో కట్టిన గోడ. సరిగా కోట మధ్యలో మల్లన్నగుడి. మల్లన్నగుడి రాతిద్వారం రెండు శేరలమీద కలశాలు వున్నాయి. ఇది జైనబసది లేదా గుడికి వుండే గుర్తులు. అంటే మొదట జైనదేవాలయంగా వున్న ఈ గుడి తర్వాత శివాలయంగా మార్చబడిందన్నమాట. గుడి ముందు వినాయకుడు, తలలేని నంది, ఆంజనేయుడు వున్నారు. గుడికి దగ్గరలో రెండు సహజసిద్ధమైన నీటికుండాలున్నాయి. ఒకదానిలో నిరంతరం తామరలు వుండేవి. వర్షాభావం వల్ల తామరలను చూడలేకపోయాం. అట్లే అక్కడికి దగ్గరలో వుండే 'దూసరి వడ్లు' పండే మరో కుండం చూసాం. నీళ్ళులేక ఆ కుండం కళతప్పింది.
కోటకు నైరుతిలో రెండురాతిగుండ్ల నడుమ చిన్నసొరికెలో వెలసివున్న నరసింహస్వామిని చూసాం.
కోటగోడ దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టబడి వుంది. కాని ఇపుడు కనిపించేవి కోట శిథిలాలే. 7,8 కి.మీ.పొడవు, 5 కి.మీ.ల వెడల్పుండే గుట్టపై మైదానప్రాంతం 40 కి.మీ.ల వైశాల్యంతో వుంది. నాలుగు కొలనులు, ఎన్నో నివాస గృహాల ఆనవాళ్ళు కనిపించాయక్కడ. అంతేకాదు, పెద్ద పరిమాణంలో ఉన్న ప్రాచీన ఇటుకలు దొరికాయక్కడ. స్తూపనిర్మాణం వుండవచ్చ నిపించే ఇటుకలతో కట్టిన తొట్లు, ఇతర నిర్మాణాలు అక్కడక్కడ కనిపించాయి.
రాయగిరికోట భువనగిరికోట కన్నా ముందే నిర్మాణం చేసినకోట. ఇక్కడి కోట నిర్మాణం, భవనాల కట్టుకం, కుండాల నిర్వహణ, దేవాలయాలు, స్తూపాలవంటి నిర్మాణాలు... ఇవన్నీ ఈ రాయగిరి కోట విష్ణుకుండినుల కాలం, అంతకన్నా ముందే ఇక్కడ కట్టివుంటారని భావించవచ్చు.
రాయగిరి- దేవాలయాలు
రాయగిరి గ్రామం నుండి యాదగిరిగుట్టకు వెళ్ళేదారిలో రైల్వేస్టేషన్‌కు ఉత్తరాన అందమైన నిర్మాణంతో చతురస్రాకారపు కోనేరు, దానికి సమీపాన కళ్యాణమంటపం, రథశాల, వీటికి కొంచెం ఎడంగా శిథిలశివాలయం ఆనవాళ్ళు, ఆరడుగుల లింగం, గుండ్రని పానవట్టం, జైనయక్షిణుల విగ్రహాలు పడివున్నాయి. రైల్వేస్టేషన్‌కు దక్షిణాన అనంతపద్మనాభుని గుడి, ఆంజనేయుని గుడి, నాలుగు ధ్వజస్తంభాలు, వాటిలో ఒకదానిపై వైష్ణవ మతగురువులు, మరొకదానిపై కూర్మం, సర్పం, ఆంజనేయుడు, ఇంకొక స్తంభంపై భూదేవీ, లక్ష్మీ సహిత విష్ణుమూర్తి, గరుడుడు, వాటికెదురుగా గుట్టమీద వేంకటేశ్వరాలయం వున్నాయి. అనంతపద్మనాభుని దేవాలయాలు అనంతగిరిలో, మణికొండలో వున్నాయి. కాని పద్మనాభునిగుడి గోపురం కపోతేశ్వరాలయ పద్ధతిలో కట్టబడివుండడం వల్ల ఒకప్పుడది జైనబసది కావొచ్చు ననిపిస్తున్నది.
- ఎస్.హరగోపాల్, 9949498698