తెలుగు సినిమాల్లో అమ్మ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మ. నిర్మలమ్మ గారి తర్వాత అమ్మ పాత్రల్లో ఒదిగిపోయిన వ్యక్తి ఆమె. ఒకటా రెండా సుమారు 700 పైగా సినిమాల్లో నటించారావిడ. మూడు దశాబ్దాల పాటు ప్రతి ఒక్క హీరోకు తల్లిగానో, అత్తగానో ఆమే కనిపిస్తారు. బంగారు గనిలాంటి ఆనాటి సినీ పరిశ్రమని, పబ్లిసిటీనే ముఖ్యమనుకునే ఈనాటి పరిస్థితుల్ని చూసి అర్ధం చేసుకుని వీటి మధ్య పోలిక సరికాదనే సహృదయం ఆమెది. పేరులోనే కాదు, అలవాట్లలో, ఆత్మీయ పలకరింపులో కూడా సంప్రదాయం కనిపిస్తుంది. సామాన్య గృహిణి పాత్రలో సహజంగా ఒదిగిపోయే తత్వం అన్నపూర్ణమ్మది. సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్న ఆమె ఈ మధ్య టీవీ సీరియళ్ళలో కాస్త బిజీ అయినట్టు కనిపించారు. ఓ టీవీ సీరియల్ షూటింగులో కలిసిన సందర్భంలో అన్నపూర్ణమ్మతో జరిపిన సంభాషణా సారాంశం ఆమె మాటల్లోనే 'సోపతి' పాఠకుల కోసం...
పుట్టి పెరిగింది విజయవాడ. నాన్న ఆర్టీసీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మేం నలుగురు తోబుట్టువులం. ముగ్గురు అక్కచెల్లెళ్ళం, ఒక తమ్ముడు. నా అసలు పేరు ఉమామహేశ్వరి. చిన్నప్పటి నుండి చదువు ఒంటబట్టలేదు. వీధి చివర వేసే నాటకాలంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ అక్కడే పడుకునేదాన్ని. ఎప్పటికో ఇంట్లోవాళ్ళొచ్చి తీసుకెళ్ళేవాళ్లు.
1966లో ఒక రోజు నాగయ్య అని మా దూరపు చుట్టం వచ్చి నాటకంలో చిన్నపిల్ల పాత్ర వేయించడానికి నన్ను తీసుకెళ్తానని మా అమ్మని అడిగాడు. అమ్మ ఒప్పుకుంది. సుమారుగా 40 రిహార్సల్స్ వేసిన తర్వాత 1967 జనవరిలో బోయి భీమన్నగారి 'పాలేరు' నాటకాన్ని ప్రదర్శించాం. అందులో 'బాల' అనే చిన్నపిల్ల వేషం వేశాను. అది చూసి అమ్మా నాన్నా బాగా చేశావని మెచ్చుకున్నారు. అలా నాటకాల ప్రస్థానం మొదలైంది.
ఆయన పట్టుదల వల్లే
అప్పట్లో సినిమా ఇండిస్టీ మొత్తం మద్రాసులోనే ఉండేది. ఔట్‌డోర్ షూటింగుల కోసం విశాఖ వచ్చేవారు. నాతోపాటు నాటకాల్లో నటించిన రాజబాబు (హీరో మురళీమోహన్) ఒక రోజు 'నవశక్తి' గంగాధర్‌గారు 'నీడలేని ఆడది' సినిమా షూటింగ్ విశాఖలో తీస్తున్నారని, అనుకున్న సమయానికి ఒక ఆర్టిస్టు రాలేదని, ఒకసారి మీరు వెళ్ళి కలవండని చెప్పారు. ఆ సమయంలో నేను 'పూలరంగడు' నాటకం రిహార్సల్స్‌లో ఉన్నా. నాకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా మురళీమోహన్ గారు పట్టుపట్టడంతో విశాఖ వెళ్ళా. అలా 'నీడలేని ఆడది'లో నూతన్ ప్రసాద్‌గారి భార్యగా తొలిసారి సినిమాలో నటించాను. దాని తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చి నాటకరంగంలోనే ఉన్నా.
పెళ్ళయిన తర్వాత కూడా నాటకాల్ని వదల్లేదు. ఇంట్లోవారు కూడా పూర్తి సహకారం అందించేవారు. అనుకోకుండా ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు నిర్మాత గంగాధర్‌గారు 'నీడలేని ఆడది' సినిమా ప్రివ్యూ చూడడానికి పిలిచారు. అది చూశాక నా వేషం నాకే నచ్చలేదు. ఆయనతో 'నా వేషం అస్సలు బాలేదండి... మీరేమీ అనుకోకపోతే మీరు మరో సినిమా తీస్తే అందులో నటిస్తాను' అని చెప్పా.
'అమ్మాయిలూ జాగ్రత్త' సినిమా నిర్మాత నన్ను మద్రాసుకు పిలిపించి మేకప్ టెస్ట్ చేశారు. కానీ బాగాలేదని వద్దన్నారు. ఆ నిర్మాతే నన్ను బయట చూసి, 'బయట ఆ అమ్మాయి బాగానే ఉంది కదా' అని మళ్ళీ ఆ సినిమాకు తీసుకున్నారు. అందులో ప్రభ, సుజాత, నేను అక్కాచెల్లెళ్ళుగా నటించాం. ఆ సినిమా చేస్తుండగానే దాసరి నారాయణరావుగారు 'స్వర్గం - నరకం' సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అప్పుడే నా పేరు అన్నపూర్ణగా మార్చారు. ఆ సినిమా బాగా ఆడినా, నాకెందుకో హీరోయిన్‌గా నేను బాగాలేననిపించింది. అందుకే 'నాకు అమ్మ, అక్క, వదిన పాత్రలుంటే చెప్పండి, చేస్తాను' అని చెప్పాను. ఆ సినిమాలో నా నటన బాగుండడంతో, నేను కోరుకున్న పాత్రల అవకాశాలు వచ్చాయి. అలా సినిమాల్లో కొనసాగుతూ వచ్చాను.
పోలిక వద్దు
అప్పట్లో ఆర్టిస్టులందరూ ఒకరికంటే మరొకరు మంచి పేరు తెచ్చుకోవాలని తపనపడేవారు. డైలాగులు మొత్తం బట్టీ పట్టి చెప్పేవాళ్ళం. ఆర్టిస్టులందరూ సమయానికి వచ్చేవాళ్ళు. సిన్సియర్‌గా పని చేసేవాళ్లు. అంతా చక్కగా, పద్ధతిగా ఉండేది. ఒక పాత్రకు ఎవరు న్యాయం చేస్తారనుకుంటారో, వాళ్ళనే ఎంపిక చేసుకునేవాళ్ళు దర్శక నిర్మాతలు. పెద్దా చిన్నా అనే మర్యాద ఉండేది. ఒక కుటుంబంలో తాత, ముత్తాతలకు ఎలా గౌరవం ఇస్తామో ఇండిస్టీలో కూడా అలాగే ఉండేది. లొకేషన్‌కి వచ్చిన దగ్గర్నుండి పని చేస్తూనే ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పటి దర్శక, నిర్మాతలు కథ, డైలాగులు... అన్నీ పకడ్బందీగా, ఆర్నెల్ల ముందే తయారు చేసుకునేవాళ్ళు. ఏ డైలాగ్ ఎన్ని నిముషాలు ఉండాలి? ఒక సీన్‌లో వుండే నటీనటులంతా డైలాగులు చెప్తే ఎన్ని నిమిషాలొస్తది? అదంతా వాళ్ళకి ఓ లెక్క ఉండేది. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తే పిల్లలు ఎలా వినేవారో డైరెక్టర్ల ముందు నటీనటులు అలా నటీనటులు అలా ఉండేవాళ్ళు.
నేటి జీవన విధానంలో వేగం పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. దాంతోపాటే నేటి సినిమాల ట్రెండ్ కూడా మారిపోయింది. ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. వాటికనుగుణంగానే నటీనటుల పని విధానం కూడా వుంటోంది. వేషాన్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు సంపాదించిన వాళ్ళు అప్పటి హీరోలు. ఇప్పుడు డబ్బులో మునిగితేలి, నటిస్తున్న పిల్లలు వీళ్ళు. అప్పట్లా అన్ని విలువలు ఈ కాలం పిల్లలు పాటించాల్సిన అవసరం నాకేం కనపళ్ళా. అందుకని అప్పటికి ఇప్పటికి అనేదాన్ని పోల్చొద్దు. ఎందుకంటే మన తాత, నానమ్మ, అమ్మమ్మకి ఉన్న మర్యాద, గౌరవం మనకి లేదు. కాబట్టి పోలిక వద్దు. ఇండిస్టీ మేమొచ్చిన రోజుల్లో మాకు అదొక బంగారు గని.
అభిమానులే బంధువులు
ఒక్క సినిమా చేయగానే పెళ్ళి చేసుకున్నాను. నాకొక పాప. ఇంటి బాధ్యతలు చూసుకోడానికి ఇంట్లో మా అమ్మ ఉండేవారు. నటించడంలో నా భర్త సహకారం పూర్తిగా ఉంది. సమస్యలు లేవని చెప్పలేను కానీ, సమస్యలు లేకుండా ఎవ్వరి జీవితమూ సాగదుగా. ఇంట్లోవాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చినట్టే, షూటింగ్ అయిపోయి వచ్చాక ఇల్లే ప్రపంచం అయిపోయేది. నేను ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళి కూర్చునిందీ లేదు. క్లబ్బులని, పార్కులని తిరిగిందీ లేదు. కరెక్టుగా చెప్పాలంటే దేవస్థానాలకి వెళ్ళింది కూడా లేదు. ఎందుకంటే షూటింగులకి వెళ్తూ వాటికి సమయం కేటాయించాలంటే కుదరని పని. అలా సొంతవాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్లలేని సందర్భాలెన్నో. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్దామన్నా నేనెక్కడో దూరంగా షూటింగులో ఉంటాను. వెంటనే వెళ్ళి చూడ్డానికి కుదిరేది కాదు. చెప్పాలంటే కొంచెం బంధుత్వాలకి దూరమయ్యేఉంటా. అయితే ఆ బాధ తెలీలేదు. ఎక్కడికెళ్ళినా అభిమానులు ఎంతో ఆత్మీయంగా పలకరించేవాళ్ళు. అదీ ఓ రకంగా బంధుత్వమే. రక్త సంబంధం ఉంటేనే బంధువులు అనుకోను. కాబట్టి బంధువులు దగ్గర్లో లేరనే ఆలోచన వచ్చేది కాదు.
జనరేషన్ మారింది
ఇప్పటి వాళ్ళకి పాతవాళ్ళు ఎక్కువ మేకప్ వేసుకుంటారేమో, మనం చెప్పిన మాట వినరేమో, ఇదింతేనంటారేమో అనుకుంటున్నారని నాకో డౌటు. జనరల్‌గా ఈ తరం పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు వస్తే ఆంక్షలు పెడతారనుకుంటారు. నా విషయంలో కూడా వాళ్ళలా అనుకుని సినిమాల్లోకి తీసుకోవడం లేదేమో! అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు కాబట్టి, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారు. కుటుంబ కథా చిత్రాలు ఉంటే నన్ను పిలుస్తారు. నేనెప్పుడూ వేషాల కోసం ప్రయత్నాలు చేసింది లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. జనరేషన్ మారింది కాబట్టి వేషాలు కూడా మారాయి. నాటకాలు వేసిన అలవాటు పోక కొద్దిగా డైలాగులు ఉంటాయని అప్పుడప్పుడు సీరియళ్ళలో చేస్తున్నా.
నాతో చేసిన కొంతమంది సహనటులు మానేశారు. కొంతమంది పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్ళారు. కొంతమంది ఫోన్ నెంబర్లు తెలీదు. ఫోన్ నెంబర్లు తెలిసినవాళ్ళం మాట్లాడుకుంటున్నాం. శ్రీలక్ష్మితో తరచూ మాట్లాడుతుంటా.
ఇష్టంగా చేశా
చిన్న వయసులోనే వయసుకు మించిన పాత్రలు చేసినప్పుడు నాకెందుకో ఇబ్బందేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇష్టంగా చేశాను. పైగా నాటకాల అనుభవం వుండటం వల్ల ఆ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. ఇష్టం లేకపోతే అన్నీ ఇబ్బందులే. నా మనసు కోరుకున్న పాత్రలు కాబట్టి కష్టమనిపించలేదు. ఫలానా పాత్ర నచ్చిందా, నచ్చలేదా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఇష్టంగా చేశాను. ఇంకా స్టూడెంటునే. లెక్చరర్ చెప్తే స్టూడెంట్లు ఎలా తలకాయ ఊపుకుంటూ రాసుకుంటారో నేనూ అంతే.
గ్యాప్ వస్తే మర్చిపోలేను
నా జీవితంలో నటనకి ఎక్కువ గ్యాప్ రావడమే మర్చిపోలేని సంఘటన. తీరిక లేని పనితో ఉంటే ఇంకేం గుర్తుండదు. శ్రమ కూడా తెలీదు. తమాషా ఏంటంటే... ఈ ఫీల్డులో కష్టమనేది ఇప్పటిదాకా తెలీదు. ఈ వయసులో కూడా నటించడమంటే కష్టమనిపించదు.
నేను పొరపాటు చేయనని నా అభిప్రాయం. నాదేమైనా పొరపాటు ఉంటే ఒప్పుకుంటాను. ఎవరైనా అవమానంగా మాట్లాడితే మాత్రం భరించలేను. కొన్ని విషయాల్లో సరిపెట్టుకుని పర్వాలేదండీ... అని నవ్వి ఊరుకోలేను. నాలో ఉన్న లోపం అదే అనుకుంటున్నాను. అది కూడా ఈ వయసుకు ఓర్చుకోవాలి. కానీ అదింకా అలవాటు కాలేదు. ఆ మెంటాలిటీకే కొన్ని అవకాశాలు పోయుండొచ్చు.
ఇప్పటి వాళ్లు అప్పట్లాగా నిశితంగా సినిమాలు చూడడం లేదనిపిస్తుంది. అంతా లైట్ తీస్కో అనే ధోరణిలో రెండున్నర గంటల సేపు కాలక్షేపం చేసి వెళ్దామనుకుంటున్నారు. కథాపరంగా, స్ఫూర్తిపొందదగ్గ సినిమాలు సంవత్సరానికి ఒకటో రెండో వస్తున్నాయి.
భగవంతుడు ఆయుష్షు ఇచ్చినంతకాలం, జనాలు నన్ను ఇష్టపడినంతకాలం సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాను. ఆశావాదిని. భవిష్యత్తు బాగుంటదనుకునే మనస్తత్వం నాది. నేననే కాదు, ఈ తరం పిల్లలు కూడా... రేపటిని నమ్మాలి. నిన్నటిని తలచుకోకూడదు. ఈ రోజు హాయిగా ఉండాలి.
కష్టమైన పని
కామెడీ చేయడం కష్టం. అది ఆర్టిస్టు బాడీలో, ఎక్స్‌ప్రెషన్‌లో ఉండాలి. ఇవి రెండూ లేకుండా కామెడీ చేయలేరు. నా బాడీ కామెడీకి పనికిరాదని అనుకుంటాను. హలో బ్రదర్‌లో మోడ్రన్ మదర్‌గా చేశాను. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకి నచ్చిందంటే కారణం... అన్నపూర్ణమ్మని మోడ్రన్‌గా చూపిస్తే ప్రేక్షకులకి కొత్తగా ఉంటుందనుకున్న ఇ.వి.వి దే ఆ గొప్పతనమంతా. ఆ పాత్రలో నన్ను ప్రేక్షకులు ఒప్పుకుని మెచ్చారంటే మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేయాలనిపిస్తుంది.
ఇంటర్వ్యూ: బి.మల్లేశ్వరి
Authorization