Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమానులు లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ
- టెలివిజన్, డిజిటల్ మీడియాలోనే వీక్షణ భాగ్యం
- ఆటను ఆపం, ఆడమని చెప్పం : క్రీడా శాఖ
- 14న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటి
కరొనా వైరస్ (కోవిడ్-19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ) మహమ్మారిగా ప్రకటించింది. అతి వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ఇప్పటికే క్రీడా రంగాన్ని కుదిపేస్తోంది. ఎవరెస్ట్ ప్రీమియిర్ లీగ్ (నేపాల్) వాయిదా పడింది. అంతర్జాతీయ క్రికెటర్లు మ్యాచ్ సందర్భంగా కరచాలనం మానేశారు. రోడ్డు భద్రతా దిగ్గజాల సిరీస్ మ్యాచులకు అభిమానులను అనుమతించటం లేదు. ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ టీ20 సిరీస్ వాయిదా పడింది. బాస్కెట్‌బాల్ (3,3) ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు సైతం బ్రేక్ పడింది. భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో లక్నో, కోల్‌కత మ్యాచులకు అభిమానులకు అనుమతి లభించే పరిస్థితి కనిపించటం లేదు. కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 8 లక్షల కోట్ల లావాదేవీలు అందించే ఐపీఎల్ తొలిసారి అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం నివారణకు పలు సూచనలు చేసింది. వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రజా సమావేశాలు (ప్రజలు గుంపులు గుంపులుగా ఒక చోటకు చేరకూడదు) శ్రేయస్కరం కాదని ప్రధాని నేతృత్వంలోని మంత్రుల కమిటీ సూచనలు చేసింది. క్రీడా ఈవెంట్లకు, ప్రత్యేకించి ఐపీఎల్ మ్యాచ్‌కు 40,000 మంది అభిమానులు హాజరు అవుతారు. దీంతో ఐపీఎల్ మ్యాచులకు అభిమానుల హాజరు, ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ సందిగ్ధంలో పడ్డాయి. ఐపీఎల్ ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థకు రూ.8 లక్షల మేరకు లావాదేవీలు అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో టోర్నీ రద్దు విపరీత నష్టాలను మిగిల్చే ప్రమాదం ఉంది.
విదేశీ ఆటగాళ్లకు ఇబ్బంది లేదు! : కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ విదేశీయులకు వీసాలు రద్దు చేసింది. మార్చి 13, 2020 నుంచి వీసాలు రద్దు చేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దౌత్య, ఐక్యరాజ్య సమితి/ అనుబంధ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్ట్ వీసాలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది. ఐపీఎల్‌లో ఆడేందుకు భారత్‌కు రానున్న విదేశీ క్రికెటర్లు ప్రాజెక్ట్ వీసా/ బి-స్పోర్ట్స్ విభాగం కిందకు వస్తారు. కరోనా వైరస్ లేదనే మెడికల్ సర్టిఫికెట్ సమర్పిస్తే, విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్ ఆడేందుకు వీసా లభించనుంది.
ప్రభుత్వం ఏం చెబుతోంది : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను బుధవారం మహమ్మారిగా ప్రకటించింది. 106 దేశాలకు వ్యాపించిన కోవిడ్-19ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధాని నరెంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ కరోనా వైరస్‌పై కీలక విధానాలను సూచించింది. ప్రజలు గుంపులుగా గుమికూడవద్దని ప్రధానంగా సూచించింది. తప్పనిసరి ప్రజా సమావేశం అయితే, కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు కచ్చితంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
క్రీడా మంత్రి ఏమన్నారు? : ఐపీఎల్ 13 సీజన్ ఖాళీ స్టేడియాల్లోనేనని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. గురువారం పార్లమెంట్ వెలుపుల మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఆరోగ్య శాఖ సవివరణ ఆదేశాలు జారీ చేసింది. క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సంఘం, బీసీసీఐలకు క్రీడా శాఖ నోటీసులు పంపించింది. ప్రభుత్వం ఎటువంటి క్రీడా ఈవెంట్లను ఆపటం లేదు. కరోనావైరస్ నివారణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మ్యాచులను నిర్వహించుకోవచ్చు. ఐపీఎల్ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి ఇదే. ఒకవేళ అభిమానులను స్టేడియాలకు రప్పించాలని బీసీసీఐ కోరుకుంటే, తప్పనిసరిగా కరోనా వైరస్ స్క్రీనింగ్ మెషిన్లు విధిగా ఏర్పాటు చేసుకోవాలి' అని మంత్రి పేర్కొన్నారు. ఐపీఎల్ సహా ఏ ఆటను ఆపము, అలాగని ఆడమని సూచనలు చేయలేము. దేశ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు అత్యవసరమని రిజుజు తెలిపారు.
వన్డే సిరీస్ నుంచే : భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో తొలి వన్డే వర్షార్పణం అయ్యింది. మిగిలిన రెండు మ్యాచులకు అభిమానులకు అనుమతి లభించే అవకాశం లేదు. మార్చి 18న మూడో వన్డేకు ఆతిథ్యం ఇవ్వాల్సిన కోల్‌కతలో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో అభిమానులను స్టేడియానికి అనుమతించే అవకాశం లేదు. సౌరాష్ట్ర, బెంగాల్ రంజీ ట్రోఫీ ఫైనల్లో నేడు అభిమానులను అనుమతించటం లేదని రాజ్‌కోట్‌లో అధికారికంగా ప్రకటించారు.
14న కీలక నిర్ణయం! : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ మార్చి 14న సమావేశం కానుంది. ఐపీఎల్ నిర్వహణపై వెల్లువెత్తుతున్న ఆందోళనలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో 60 మ్యాచుల నిర్వహణపై కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. చివరకు ఖాళీ స్టేడియాల్లోనైనా మ్యాచులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న బీసీసీఐ, అభిమానులను మైదానాలకు సురక్షిత మార్గంలో తీసుకువచ్చే అంశాలపై ఆలోచన చేయనుంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 13 ఆరంభం కానుంది. వేసవి ఊపందుకుంటే కరోనా వైరస్ భయాలు నెమ్మదిగే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రథమార్థం మ్యాచులను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించే వీలుంది.
మెగా ఫైనల్స్ అభిమానికి కరోనా : మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు హాజరైన అభిమానికి కరోనా వైరస్ సోకింది. ఈ వార్త మెల్‌బోర్న్ ఫైనల్స్ మ్యాచ్‌కు హాజరైన 90,000 మందిలో గుబులు రేపుతోంది. మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు వచ్చిన ఓ అభిమానికి (నార్త్ స్టాండ్, లెవల్ 2లో కూర్చున్నాడు) కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ వార్త ఐపీఎల్ మ్యాచులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.