Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరజ్ పవార్ హత్యపై బీజేపీ నోరు విప్పదా?: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
- నీరజ్ కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-ధూల్‌పేట్
హైదరాబాద్ నడిఒడ్డున బేగంబజార్‌లో నీరజ్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బేగంబజార్‌లోని నీరజ్‌పవార్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ పవార్‌ను నడిరోడ్డుపై అతికిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు కారకులైన వారు మానవత్వం మరిచి ప్రవర్తించడం దారుణమన్నారు. కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకుంటున్న యువతీ, యువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చట్టం చేయకపోవడం వల్లనే ఇటీవల కాలంలో వరుస హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాగరాజు హత్యలో హిందూ, ముస్లిం మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ మతోన్మాద సంస్థలు నీరజ్ హత్యపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కులదురహంకార హత్యల్లో కూడా మతవిద్వేషాలను రెచ్చగొట్టే సంఫ్‌ు పరివార్ శక్తుల మాయమాటలు నమ్మొద్దన్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే నియోజకవర్గంలో జరిగిన ఘటనపై స్పందించాలన్నారు. పోలీసు అధికారులు దర్యాప్తు బృందాల సంఖ్యను పెంచి నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీరజ్ పవార్‌కు 2 నెలల బాబు ఉన్నాడని, ఆయన భార్య సంజనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నీరజ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి పి నాగేశ్వరరావు, కేవీపీఎస్ నాయకులు ఎన్. గోపాల్, ఎన్. శ్రీరాములు, ఆంజనేయులు, బాలరాజు, వెంకటేష్, గంగాపూరి, రాజు తదితరులు పాల్గొన్నారు.