Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా పోలీసుల నిర్బంధం
- స్కూళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్న ఖాకీలు
- జిల్లా, మండల నాయకుల ముందస్తు అరెస్టు
- భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం
- గతంలో ఎప్పుడూ లేని విధంగా అణచివేత
- నేడే ఉద్యోగుల 'చలో అసెంబ్లీ'
- అరెస్టులకు ఐక్యవేదిక ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. జిల్లాలు, మండలాల్లో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ముందస్తుగానే పోలీసులు అరెస్టులు చేశారు. పాఠాలు బోధిస్తున్నా లాక్కెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి నియంతృత్వ పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. ఉపాధ్యాయులపై ఉక్కుపాదం సరైంది కాదన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమనీ, ప్రభుత్వం దమనకాండ ప్రయోగించడాన్నీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చలో అసెంబ్లీకి వెళ్లనీయకుండా సకల చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులను పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లి చలో హైదరాబాద్‌కు వెళ్తే కేసులు నమోదవుతాయనీ, అనవసరంగా ప్రభుత్వంతో కొట్లాట ఎందుకనీ పోలీసు అధికారులు అంటున్నట్టు తెలిసింది. చలో అసెంబ్లీ కార్యక్రమం యథాతథంగా చేపడతామని ఐక్యవేదిక ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌కు తరలిరావాలని ఐక్యవేదిక పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పీఆర్సీపై ప్రకటన చేయకుండా అరెస్టులా? : ఐక్యవేదిక
పీఆర్సీపై ప్రకటన చేయకుండా ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం సరైంది కాదని ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు కె లక్ష్మయ్య, జి సదానందంగౌడ్, చావ రవి, సంపత్‌కుమారస్వామి, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, కె కృష్ణుడు, ఈ లక్ష్మణ్‌నాయక్, బాలస్వామి, అశోక్‌కుమార్, మాణిక్‌రెడ్డి తెలిపారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులనో, నేరస్తులనో అరెస్టు చేసినట్టు ఉపాధ్యాయులు విధినిర్వహణలో ఉన్నపుడు బలవంతంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించడం అప్రజాస్వామికమని విమర్శించారు. చలో అసెంబ్లీకి ఇన్ని అడ్డంకులు సృష్టించే బదులు పీఆర్సీపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లకోసారి పీఆర్సీ అమలు చేయడం ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీఆర్సీపై కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టులు, భయభ్రాంతులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో ఇలాగే అణచివేత కొనసాగితే తెలంగాణ వచ్చేదా?అని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి చెన్నరాములు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల అరెస్టులు అక్రమమని ఎస్జీటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రావు, మహిపాల్‌రెడ్డి ఖండించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.