Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు నిధులు కాదు....
- మనకు రావాల్సినవే: హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయంగా అదనంగా నిధుల సంగతి పక్కన బెడితే అసలు రావాల్సిన నిధులే ఇవ్వడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. శాసనమండలిలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ, రావాల్సిన దానిలో రూ.3900 కోట్లు తగ్గించారని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా జీఎస్టీ తగ్గితే ఆ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలని చట్టం ఉన్నా అలా చేయడం లేదన్నారు.ఐజీఎస్టీ కింద రూ.2819 కోట్లు బకాయి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.450 కోట్లు విడుదల చేయడం లేదన్నారు. మొత్తంగా రూ.4595 కోట్లు తగ్గినట్టు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం లో రూ.2300 కోట్లు తగ్గాయనీ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ సంఘం రూ.723 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే దాన్ని తిరిగి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించిందన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఆరు మెట్రో నగరాలకు నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదనీ, దీంతో రాష్ట్రమే హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రం నుంచి కోతలే తప్ప అదనంగా ఏమీ రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పరిమితికి లోబడే చేసిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెప్పిందని గుర్తుచేశారు. విద్య కోసం రూ.16,450 కోట్లు కేటాయించామన్నారు.1,23,000 ఉద్యోగాలను భర్తీ చేశామనీ, మరో 27 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు.
ఇవ్వడం లేదు.... ఇచ్చినట్టు ప్రచారమెందుకు?
ప్రజలేమనుకుంటరు...: ఎర్రబెల్లి
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆయా పథకాలు పెట్టిందే తప్ప వాటికి నిధులను ఇవ్వడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండలిలో పల్లె ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. నిధులు రాకున్నా బీజేపీ నాయకులు వస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజంగా నిధులు వస్తున్నాయని అనుకునే అవకాశముంది. తెలంగాణకు అన్నింటిలో అవార్డులు మాత్రం ఇస్తున్నారు. ప్రతిసారి అవార్డులతో పాటు డబ్బులిస్తారని అనుకుని అధికారులందరిని తీసుకొని ఢిల్లీకి పోతున్నాను. కాని అవార్డులతోనే మళ్లి వెనక్కి పంపిస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల నిధులతో గ్రామాలను ప్రగతిబాట పట్టిస్తున్నామని తెలిపారు.
15 ఏండ్లుగా నిధులు లేవు: గుత్తాసుఖేందర్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ పథకానికి గత 15 ఏండ్లుగా నిధులు రావడం లేదని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ, గ్రామాల కోసం కేంద్రం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తదితర పథకాలను అమలు చేస్తున్నదనీ, ఆ నిధులను వాడుకోవాలన్నారు. దీంతో చైర్మెన్ జోక్యం చేసుకొని పథకం పెట్టినా నిధులివ్వ లేదుగా అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీ కార్యాల యాల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనీ, ట్రాక్ట ర్లకు బీమా కల్పించాలనీ, గ్రామ రహదారుల్లో కంప చెట్లను తొలగించాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు.