ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చడానికి తాము ప్రయత్నించడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. 'ట్రంప్‌ను కానీ, ఆయన కుటుంబసభ్యులను కానీ హత్య చేయడానికి ప్రత్యక్షంగా కానీ, రహస్యంగా కానీ ప్రయత్నించడం ఇరాన్ వైఖరి కానే కాదు' అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ వచ్చిన ఆయన మిలీనియం హిల్టన్ హోటల్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ యుద్ధం, అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై తమ వైఖరిని పునరుద్ఘాటించారు. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. 'మొజ్తాబా ఆరోగ్యంలో కానీ, శారీరక స్థితిలో కానీ ఎలాంటి పెద్ద సమస్యలు కనిపించలేదు' అని అన్నారు. తాను మొజ్తాబాను సుమారు నెల రోజుల క్రితం కలిశానని, ఆ సమావేశం ఏడు గంటల పాటు జరిగిందని తెలిపారు. ఇరాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లను ఆయన ప్రస్తావించారు. తాము ఓ ఒప్పందాన్ని కోరుకుంటున్నామని, అయితే అమెరికా మధ్యంతర ఎన్నికలకు దీనికీ సంబంధం లేదని చెప్పారు. ఇరాన్‌కు మునుపెన్నడూ లేనంతగా కష్టమైన సమస్యలు ఉన్నాయని అంటూ అమెరికా ఆంక్షలను 'నిశ్శబ్ద హంతక ప్రచారం'గా అభివర్ణించారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అంతిమ విజయం ఇరాన్‌దేనని పెజెష్కియాన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్‌పై దాడికి మధ్యప్రాచ్యంలోని కొన్ని స్థావరాలను అమెరికా ఉపయోగిస్తోందని, కాబట్టి అవి తమకు చట్టబద్ధమైన లక్ష్యాలేనని చెప్పారు. ఆ ప్రాంతంలోని అనేక అమెరికా స్థావరాలు ఇక ఉపయోగపడవని అన్నారు. ఎక్కడైనా, ఏ దేశాన్ని అయినా నాశనం చేసే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ ఇరాన్‌ను లంగిపోయేలా చేయడం అసాధ్యమని పెజెష్కియాన్ తెలిపారు.
న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ అధికారుల చర్చలు
హార్ముజ్ జలసంధిని తెరిచే విషయం పైన, ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేసే అంశం పైన న్యూయార్క్‌లో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతిష్టంభనను తొలగించాలంటే అత్యంత ఆచరణీయమైన మార్గం దశలవారీ ఒప్పందమేనని సీనియర్ ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు. దీని ప్రకారం అమెరికా తన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే దానికి బదులుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరుస్తుంది. అదే సమయంలో అమెరికా స్తంభింపజేసిన ఆస్తులను ఇరాన్ తిరిగి పొందుతుంది. ఒప్పందాన్ని రూపొందించడంతో పాటు ఇరు పక్షాలు విశ్వసించే విధంగా రాయితీలు ఉండేలా మధ్యవర్తులు ప్రయత్నించాల్సి ఉంది.
ట్రంప్ హత్యకు ప్రయత్నించడం లేదు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)