Magazines

సత్తుపల్లి ప్రాంత గ్రామీణ ప్రజల 'ఆరోగ్యానికి'  కొండంత భరోసా

1 గంట క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

- ప్రపంచ స్థాయి వైద్య సేవలకు షిరిడీ సాయి జనమంగళం ట్రస్ట్ శ్రీకారం 

- నారాయణపురంలో రూ. 200 కోట్లతో ఉచిత కేన్సర్ ఆసుపత్రి 

- కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఉచిత టీకాల పంపిణీని ప్రారంభించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో షిరిడీ సాయి జనమంగళ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన రూ. 200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో కూడిన కేన్సర్ ఆసుపత్రి, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఉచిత వైద్య సహాయక కార్యక్రమాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన ట్రస్ట్ నిర్వాహకులు, ప్రతినిధులకు మంచి పొంగులేటి అభినందించారు. కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలు, ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నివారించవచ్చని, అయితే గ్రామీణ ప్రాంత ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, భారీ వైద్య ఖర్చులకు భయపడటం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి  పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించడంతో పాటు, ఒక్కొక్కరికి రూ. 7,000 విలువైన వ్యాక్సిన్ ఉచితంగా అందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ట్రస్ట్ ముందుకు రావడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు.


ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు రహదారి,  మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తాం

​ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు రహదారి సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను కొద్ది రోజుల్లోనే తయారు చేసి తనకు పంపించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనలతో వచ్చే ఈ వినతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. దాతృత్వంతో తమ భూములను స్వల్ప ధరకే విక్రయించి సహకరించిన నారాయణపురం  గ్రామస్తులను ఈ సందర్భంగా మంత్రి  అభినందించారు. భవిష్యత్తులో ఈ బృహత్తర ప్రాజెక్టుకు ఎలాంటి అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 

ఆహారపు అలవాట్లు కాలుష్యం వల్లే కేన్సర్ వ్యాధులు ప్రభలుతున్నాయి: జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 

​

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. మాట్లాడుతూ...  ఒకప్పుడు అరుదుగా వినపడే కేన్సర్ వ్యాధి నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ప్రతీ గ్రామంలోనూ కనిపిస్తూ సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు. కేన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనది కావడంతో సామాన్య, నిరుపేద కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శ్రీ జనమంగళ ట్రస్ట్ వ్యాధి ముదిరిపోకుండా ముందస్తు వ్యాధి నిర్ధారణ (ఆర్లీ డిటెక్షన్), ప్రివెంటేటివ్ కేర్ సేవలపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉచితంగా అందేలా ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచస్థాయి వైద్యం అందడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ 


ప్రపంచ స్థాయి వైద్యవందనం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు రఘునాథరెడ్డి, సతీష్ రెడ్డి ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నారాయణపురం గ్రామస్తులు ఉదార హృదయంతో భూమిని అందించడం వల్లనే ఈ బృహత్తర ప్రాజెక్టు ఈ గ్రామంలో సాకారం అవుతోందని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలైన అశ్వారావుపేట, ములకలపల్లితో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కూడా ఈ ఆసుపత్రి ఎంతో మేలు చేస్తుందన్నారు. నేటి రోజుల్లో ప్రతి పది కుటుంబాల్లో ఒకరికి కేన్సర్ ముప్పు పొంచి ఉన్నందున ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు, ఉచిత వైద్య చికిత్సలు అందించడం ఎంతో అత్యవసరమని తెలిపారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, వేలూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా ఇక్కడే ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యం ఇక్కడే అందటం ప్రజల  అదృష్టమన్నారు. ఈ ఆసుపత్రి విస్తరణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, స్థానిక సర్పంచ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్