Magazines

భయాందోళనలు వద్దు

1 గంట క్రితం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

మాది ప్రేమను, ఆప్యాయతను చూపించే సర్కారు : ఎస్టీయూటీఎస్ 80 వసంతాల వైభవోత్సవంలో 
మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎవరూ భయాందోళనలతో ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పాటు అన్ని వర్గాల పట్ల ప్రేమ, అప్యాయతలు కలిగి ఉందని చెప్పారు. ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందం గౌడ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన 80 వసంతాల వైభవోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సర్కారు భయపెట్టి, అణచివేసే ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వమని సాటి మనుషులను గౌరవించే ప్రభుత్వమని తెలిపారు. గత పదేండ్లలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25 వేల కోట్లకు చేరితే దానిని రూ.11 వేల కోట్లకు తగ్గించినట్టు తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసిందనీ, డీఏ, పీఆర్సీ అంశాల్లో వేగవంతమైన కదలిక ఉందన్నారు. సాంకేతికంగా విద్యా రంగానికి, ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఎస్టీయూటీఎస్ ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడుతూనే, విద్యావిధానాలపై విలువైన సలహాలిస్తూ నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతుందని అభినందించారు. శాసనమండలికి నిబద్ధత కలిగిన 10 మంది ఉపాధ్యాయులను పంపిన చరిత్ర ఎస్టీయూకు ఉందని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న సకల ఉపాధ్యాయ సంఘాలకు మాతృత్వం ప్రసాదించిన ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ ఎస్టీయూ అని అన్నారు. ఎందరో మహనీయులను సమాజానికి అందించిన చరిత్ర ఎస్టీయూ సొంతమని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్టీయూ నాయుకున్ని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవాళి ఉన్నంత వరకు ప్రజాస్వామిక ఉద్యమాలకు ఎస్టీయూ దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే కార్పొరేట్ సంస్థల కంటే మిన్నగా ఫలితాలు వస్తాయని తెలిపారు.
అంచలంచలుగా ఉద్యమం
ఉద్యమం యుద్ధం మాదిరిగా ఉండదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్ తేల్చి చెప్పారు. ఉద్యమం అంచెలంచలుగా ఉంటుందని, ఫలితాలు కూడా అదే క్రమంలో ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, మహాభారత యుద్ధాన్ని ఉదహరిస్తూ పాటలతో తనపై, జేఏసీపై వచ్చిన విమర్శలు సహేతుకం కావని ఆయన కొట్టిపారేశారు. మార్చి నాటికి మిగిలిన రూ. రూ. 11 వేల కోట్ల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


చర్చలు పూర్తి కాలేదు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లపై ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఇంకా పూర్తి కాలేదని టీజీఈజేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమస్యలపై ముఖ్యమంత్రితో పూర్తి స్థాయి చర్చలు జరగాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల మనుగడకే స్వేచ్ఛ లేని పరిస్థితిని ఆయన గుర్తుచేశారు. ఆ ప్రభుత్వంలో మూడు డీఏలు, రూ.12 వేల కోట్లు బకాయి పెట్టారని విమర్శించారు. పీఆర్సీ అమలు చేసి, 2028 ఎన్నికల వరకు మరో పీఆర్సీని ప్రకటిస్తే మరో ఐదేండ్లు కాదు.... మరో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందన్నారు. సదానందం గౌడ్ మాట్లా డుతూ నాటి తరం చేసిన అనేక పోరాటాల ఫలితాలను అనుభవిస్తున్నామనీ, వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన ఏకైక సంఘం ఎస్టీయూ అని, అందుకు ఈ సంఘం గుర్తింపును కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అష్టపది ప్రత్యేక సంచిక సంపాదకులు దాసరి శ్రీధర్, ఎస్టీయూటీఎస్ పూర్వ అధ్యక్షులు పర్వత్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సాబేర్ ఆలీ, ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్