మహిళా ఎమ్మెల్యేలపై దురుసు కేసులో హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
అసెంబ్లీ ప్రాంగణంలో సభా నియమాల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన వ్యవహారంపై స్పీకర్‌కు రిపోర్టు ఇవ్వాలని కోరింది. ఒకవేళ అసెంబ్లీ గేటు బయట అంటే శాసనసభ వెలుపల ఎమ్మెల్యేల పట్ల పోలీసుల చర్యలు ఉన్నట్టు తేలితే రిపోర్టుకు తమకు ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు డీజీపీకి హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అదే సమయంలో సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన, చేయి చేసుకున్న పోలీసు సిబ్బందిని గుర్తించి విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. గుర్తించిన పోలీసుల వివరాలను స్పీకర్‌కు నివేదించాలని పేర్కొంది.
అయితే ఘటన అసెంబ్లీ ప్రాంగణంలో కాకుండా ప్రవేశ ద్వారం వెలుపల జరిగిందని విచారణలో తేలితే, ఆ వివరాలను హైకోర్టుకు నివేదించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి మంగళవారం ఈ మేరకు సెప్టెంబర్ 7న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించారు.
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ విచారణ జరిగింది. అసెంబ్లీ ఎనిమిదో సెషన్ ప్రారంభమైన సెప్టెంబర్ 7న నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించారని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేను పోలీసులు పట్టుకున్న తీరుపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పోలీసులు వేసిన అనుబంధ పిటిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు, నినాదాలు, కరపత్రాల పంపిణీ, ప్రదర్శనలు, పికెటింగ్, ధర్నాలను నిషేధిస్తూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. నల్ల టీషర్టులపై రాజకీయ నినాదాలతో ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగిందని, కొందరు మహిళా పోలీసులకు కూడా గాయాలయ్యాయని వివరించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించలేదని, బిఆర్‌ఎస్ భవన్ కు తరలించామని తెలిపారు. నినాదాలున్న టీషర్టులు ధరించిన ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని చీఫ్ మార్షల్‌కు స్పీకర్ ఆదేశించారని, ఆ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారని వాదించారు.
దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ నినాదాలు లేని దుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అడ్డుకున్నారని, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా వ్యవహరించారని తెలిపారు. ఈ వాదనల నేపథ్యంలో హైకోర్టు.. అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు, గుమిగూడడాన్ని నిషేధిస్తూ సెప్టెంబర్ 5న పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు ఎమ్మెల్యేలు సభకు వెళ్లడాన్ని నిషేధించేవి కావని పేర్కొంది. ఆ నిషేధాజ్ఞలను ఎమ్మెల్యేలు ఉల్లంఘించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో లేదని తెలిపింది. అసెంబ్లీ వ్యవహారాల్లో సభా నియమాల ఉల్లంఘన జరిగితే నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని, ఎమ్మెల్యేలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడానికి అది కారణం కాదని స్పష్టం చేసింది. ఘటన అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిందా, గేటు వెలుపల జరిగిందా అన్న అంశాన్ని డీజీపీ విచారణ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ విచారణార్హతపై ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరంపై కూడా విచారిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పోలీసులను గుర్తించాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)