తక్కువకు ‘రేషన్’ సరుకు కొని.. పాలిష్ చేసి విక్రయాలు
చుక్కలనంటుతున్న
సన్నబియ్యం ధరలు
పది నెలల్లోనే క్వింటాకు
రూ.2,500 వరకు పెంపు
ప్రజలపై రోజుకు రూ.15 లక్షల
అదనపు భారం
ఎల్‌నినో, నీటి కొరత నెపంతో
కృత్రిమ కొరత
‘జైశ్రీరామ్’ బ్రాండ్ పేర్లతో బహిరంగ మార్కెట్లో వ్యాపారుల విక్రయాలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రోజురోజుకూ సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. పది నెలల్లోనే ఏకంగా క్వింటాపై రూ.2500కుపైగా వ్యాపారులు ధర పెంచారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, కాల్వలకు నీటి విడుదల తగ్గడం, కరెంట్ కోతలతో తగ్గిన వరి సాగు విస్తీర్ణాన్ని సాకుగా చూపుతూనే.. మరోవైపు ఈ సంక్షోభాన్ని అక్రమార్కులు తమకు కామధేనువుగా మార్చుకుంటున్నారు. పేదలకిచ్చే రేషన్ బియ్యాన్ని అడ్డదారిలో కొనుగోలు చేసి, మిల్లుల్లో నూకలు వేరు చేసి పాలిష్ పడుతున్నారు. ఆపై ‘జైశ్రీరామ్’, ‘బీపీటీ’, ‘హెచ్ఎంటీ’ తెలంగాణ సోనా, వంటి పేరుమోసిన బ్రాండ్ల రంగుల సంచుల్లో నింపి, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రకృతి సృష్టించిన కొరతకు తోడు, మిల్లర్ల కృత్రిమ కొరతకు వ్యాపారుల సిండికేట్ తోడవ్వడంతో పెరిగిన బియ్యం ధరలను చూసి సామన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బియ్యం ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. పది నెలల కాలంలోనే క్వింటా బియ్యంపై రూ.2,500 వరకు పెరగ్గా, రెండు నెలల్లోనే రూ.1,700 వరకు పెరగడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో క్వింటా బియ్యం ధర రూ.4,400 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో హోల్‌సేల్ ధర రూ.6,400 నుండి రూ.7వేలు పలుకుతోంది.
హమాలీ, రవాణా ఖర్చులు కలుపుకుని బహిరంగ మార్కెట్లో వినియోగదారునికి క్వింటా రూ.7,100 నుండి రూ.7,300 వరకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 1,400 నుంచి 1,600 క్వింటాళ్ల బియ్యం విక్రయమవుతున్నట్టు వ్యాపారవర్గాలు చెబుతుండగా.. పెరిగిన ధరల ప్రకారం కేవలం బియ్యం రూపంలోనే ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజుకు రూ.15 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. హోటళ్లు, మెస్స్లపైనా ప్రభావం తప్పడం లేదు.
ఎల్‌నినో దెబ్బ.. పంట దిగుబడి పై మబ్బులు
ధరల పెరుగుదలకు ఎల్‌నినో ప్రభావం ప్రధాన కారణమని వ్యాపారులు చెప్తున్నప్పటికీ, అందులో కృత్రిమ కొరతే ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13 శాతం లోటు వర్షమూ తోడైంది. జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ, కాకతీయ కాలువలకు నీటి విడుదల తగ్గడంతో ఆయకట్టు పొలాలు ఎండుముఖం పట్టాయి. పెద్దపల్లి జిల్లాలో కెనాల్ నీరు అందక రైతులు బోరు బావులపై ఆధారపడుతున్నా, తీవ్రమైన కరెంట్ కోతలతో పంటలకు నీరందడం లేదు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఏకంగా 30 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది.
బ్రాండెడ్ సంచుల్లో రేషన్ సరుకు!
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కొరత, పెరిగిన ధరలను మిల్లర్లు దందాగా మార్చు కున్నారు. బియ్యం రీసైక్లింగ్‌లో పంథా మార్చి కొత్త తరహా మోసానికి తెరతీశారు. లబ్ది దారుల నుంచి లేదా దళారుల ద్వారా రూ.15 నుంచి రూ.25కే కేజీ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లుల్లో ప్రత్యేక యంత్రాల ద్వారా నూకలను వేరు చేసి, పాలిషింగ్ పట్టి అచ్చం సన్నబియ్యంలా మెరిసేలా తయారు చేస్తున్నారు. ‘జైశ్రీరామ్’, ‘బీపీటీ’, ‘హెచ్ఎంటీ’, ‘టమాటో గోల్డ్’, ‘నంబర్- 1 కర్నూల్’, ‘కిసాన్’, ‘రాజా గోల్డ్’ వంటి ఆకర్షణీయమైన బ్రాండెడ్ సంచులను ముద్రించి అందులో ప్యాక్ చేస్తున్నారు. రూ.20కి కొన్న బియ్యాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్లో కేజీ రూ.52 నుండి రూ.67 వరకు విక్రయిస్తూ రెండింతల లాభాలు గడిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగుతున్న ఈ అక్రమ బియ్యం దందాపై ఇటీవల పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడుల్లో వెలుగుజూసిన మిల్లర్ల బాగోతం అద్దం పడుతోంది. హుజూరాబాద్‌లో ఆగస్టు 30న రాంపూర్ తిరుమల ఇండస్ట్రీస్‌పై దాడి చేసి 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జప్తు చేశారు. సెప్టెంబరు 29న కరీంనగర్ పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని హనుమాన్ ఇండస్ట్రీస్‌పై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో దాడి చేయగా 307 క్వింటాళ్ల పాలిషింగ్ రేషన్ బియ్యం దొరికింది. ఏకంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ నేత తొడుపునూరి కరుణాకర్ తన సిబ్బందితో కలిసి ఈ ముఠాను నడుపుతున్నట్టు సీఐ సృజన్ రెడ్డి వెల్లడించడం గమనార్హం.





కామెంట్లు (0)