Magazines

పంజాబ్‌దే పైచేయి!

1 గంట క్రితం

upper hand
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయిన హైదరాబాద్‌
రంజీ ట్రోఫీ మూడో రౌండ్‌ మూడో రోజు


నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసి మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది!. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగుల భారీ స్కోరు చేయగా, హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులకే ఆలౌటైంది. దీంతో పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగుల విలువైన ఆధిక్యం దక్కించుకుంది. మూడు రోజుల ఆట ముగిసినా, మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే సాధ్యపడ్డాయి. నేడు ఆఖరు రోజు ఆటలో స్పష్టమైన ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విలువైన మూడు పాయింట్లు ఖాతాలో వేసుకోనుంది. ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (97, 140 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్‌ రాదేశ్‌ (86, 195 బంతుల్లో 9 ఫోర్లు), కొడిమెల హిమతేజ (81, 168 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రజ్ఞయ్‌ రెడ్డి (65, 106 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు.


343/4 తో ఓ దశలో తొలి ఇన్నింగ్స్‌లో పైచేయి సాధించేలా కనిపించిన హైదరాబాద్‌.. 37 పరుగులకే ఆఖరు ఆరు వికెట్లు కోల్పోయింది. వరుణ్‌ గౌడ్‌ (25), కెప్టెన్‌ సీవీ మిలింద్‌ (2), ఆల్‌రౌండర్‌ రుతిక్‌ యాదవ్‌ (1), తనయ్‌ త్యాగరాజన్ (2), అనికెత్‌ రెడ్డి (1) దారుణంగా నిరాశపరిచారు. ఓ ఎండ్‌లో వికెట్‌ కీపర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి ఆఖరు వరకు పోరాడినా.. మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. టెయిలెండర్లు పేకమేడలా కుప్పకూల టంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగుల వెనుకంజలో నిలిచింది. పంజాబ్‌ పదో వికెటకు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లకు వ్యత్యాసం చూపించింది. మూడో రోజు ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు విహాన్‌ మల్హోత్రా (26 నాటౌట్‌, 76 బంతుల్లో 3 ఫోర్లు), హర్నూర్‌ సింగ్‌ (27 నాటౌట్‌, 68 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసేసరికి పంజాబ్‌ 108 పరుగుల ముందంజలో కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్