- జర్మన్ లాంగ్వేజ్ తో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం
- నిర్మాణం పూర్తయిన నర్సింగ్ కళాశాలను త్వరలో ప్రారంభిస్తాం
- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
జర్మనీ వంటి విదేశాల్లో నర్సింగ్ విద్యకు విపరీతమైన డిమాండ్ ఉందని ఈ నేపథ్యంలో మన నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్‌లో ప్రత్యేకం శిక్షణ ఇప్పించేలా నర్సింగ్ కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం సత్తుపల్లి వచ్చిన మంత్రి ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినులకు ఏర్పాటుచేసిన నోట్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... విదేశాల్లో నర్సులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే అధిక వేతనాలు పొందే మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నర్సింగ్ కళాశాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. సత్తుపల్లిలో రూ.19 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీని త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే నర్సింగ్ కళాశాలకు అవసరమైన పూర్తిస్థాయి ఫ్యాకల్టీ నియామకం చేస్తామని మంత్రి చెప్పారు. వైద్యులతో సమానంగా సమాజంలో నర్సింగ్ వృత్తికి ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఉంటాయని విద్యార్థులకు వివరించారు.
సేవా భావంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. విద్యార్థుల పురోగతికి అవసరమైన స్టడీ మెటీరియల్ అందించిన ఆశా ఫౌండేషన్ సేవలను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్ దివాకర టీఎస్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోత్స్న, పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)