బాసర ట్రిపుల్ ఐటీలో కరపత్రాల విడుదల చేసిన అధ్యాపకులు
నవతెలంగాణ - ముధోల్
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఈ నెల 30న శుక్రవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ బాసర కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ కె. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆర్జీయూకేటీ ప్రాంగణంలో సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల సేవలను యూజీసీ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఏడో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫార్సులతో పాటు యూజీసీ పే స్కేళ్లను అమలు చేయాలని కోరారు. ఈ అఖిలపక్ష సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంటాక్ట్ అధ్యాపకులు కడాక్టర్ వినోద్, శ్రీశైలం, డాక్టర్ ఎన్. విజయ్ కుమార్, జాకీర్, సతీష్ కుమార్, హరికృష్ణ, శ్రీకాంత్, చరణ్ రెడ్డి, తిలక్ రెడ్డి తదితరులు, పాల్గొన్నారు.






కామెంట్లు (0)