అంచనాలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి లేఖ
నవతెలంగాణ - పరకాల
పట్టణంలోని వైకుంఠధామాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముందుకొచ్చారు. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పనులకు సంబంధించిన సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని కోరుతూ పరకాల మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు.
05-09-2026న నిర్వహించిన పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఇప్పటికే తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఆధునిక సౌకర్యాలతో మోడల్ వైకుంఠధామాన్ని నిర్మించినట్లు తెలిపారు. పరకాల మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు అక్కడి వైకుంఠధామాన్ని సందర్శించి, అదే తరహాలో పరకాల శ్మశానవాటిక అభివృద్ధికి అవసరమైన అంచనాలు రూపొందించాలని కమిషనర్‌ను కోరారు.
తాను పూర్వపు పరకాల మండలంలోని వరికోలు గ్రామానికి చెందినవాడినని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. మున్సిపల్ అధికారులు వీలైనంత త్వరగా అంచనాలు సమర్పిస్తే, పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ లేఖలో పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)