నవతెలంగాణ–వేములవాడ : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేములవాడ 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ పాలకవర్గం, ఆర్అండ్బీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రహదారి దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధితోపాటు పట్టణ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజన్న ఆలయం, వేములవాడ పట్టణ అభివృద్ధి తమకు రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
రూ.250 కోట్లకు పైగా నిధులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధికి సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులు సుమారు 55 శాతం, అన్నదాన సత్రం పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా రూ.99.40 కోట్ల నిధులు మంజూరు కావడంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అన్నదాన సత్రానికి రూ.35 కోట్లు, దేవాలయ అభివృద్ధికి రూ.51 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
రూ.6.5 కోట్లతో 80 అడుగుల రహదారి
వేములవాడ పట్టణంలో 80 అడుగుల రహదారి విస్తరణ పనులను సుమారు రూ.6.5 కోట్లతో చేపట్టినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రహదారి నిర్మాణంతోపాటు విద్యుత్ స్తంభాలు, లైటింగ్ ఏర్పాట్లకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రహదారి విస్తరణకు సంబంధించి రూ.47 కోట్ల జీవో తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పట్టణంలో రాకపోకలు మరింత సులభతరం కావడంతోపాటు రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రహదారి విస్తరణలో నిర్వాసితులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.
మూడో బ్రిడ్జి పనుల వేగవంతం..
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా వేగవంతం చేసినట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత..
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పునరుద్ధరణ, విస్తరణ, జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి సుమారు రూ.2,000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలు, సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు.
గతంలో 2015 జూన్ 18న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ మేరకు నిధులు అందలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
అన్ని రంగాల్లో వేములవాడ అభివృద్ధే లక్ష్యం..
రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాబోయే రోజుల్లోనూ అవసరమైన నిధులు తీసుకొస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వేములవాడను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, నిర్ణీత ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
రాజన్న ఆలయ అభివృద్ధి ఒకవైపు.. పట్టణ అభివృద్ధి మరోవైపు.. ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఎఎంసి వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మధు, కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్ ,కో ఆప్షన్ నెంబర్స్ కట్కూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)