Magazines

కొబ్బరి, పామాయిల్‌లో కోకో అంతర పంటగా సాగు చేయాలి

59 నిమిషాల క్రితం

coconut and palm oil.
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

- కొబ్బరి అభివృద్ధి బోర్డు డీఓ హెఛ్.ఎన్ శరత్

నవతెలంగాణ - అశ్వారావుపేట

కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందాలని కొబ్బరి అభివృద్ధి బోర్డు డెవలప్‌మెంట్ అధికారి హెచ్‌.ఎన్‌. శరత్ సూచించారు. శుక్రవారం స్థానికంగా కాసాని పద్మశేఖర్‌కు చెందిన కొబ్బరి క్షేత్రంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొబ్బరి సాగు అభివృద్ధికి బోర్డు అందిస్తున్న రాయితీ పథకాలను వివరించారు.

అంతర పంటలతో అదనపు ఆదాయం:

కొబ్బరి ఆధారిత అంతర పంటల సాగు విధానం ద్వారా ఉత్పాదకత పెంపు పథకం కింద కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు కొబ్బరి అభివృద్ధి బోర్డు డీఓ శరత్ తెలిపారు. కోకోతో పాటు ఇతర అనుకూల అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. బోర్డు నిబంధనల ప్రకారం అర్హులైన రైతులు రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


అనంతరం మాండలీజ్ కంపెనీ మేనేజర్ రవీందర్ కోకో సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి కొబ్బరి రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షత వహించారు. ఉద్యాన శాఖ స్థానిక అధికారి ఈశ్వర్, ఆత్మ (బీఎఫ్‌ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, కాసాని పద్మశేఖర్, సీమకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వేపపిండి సరఫరా చేయాలి:

కొబ్బరి రైతులకు నేచురల్ పొటాష్‌తో పాటు వేప పిండి కూడా సరఫరా చేయాలని రైతు సంఘం నాయకులు తలసిల ప్రసాద్ డిమాండ్ చేశారు. గత ఏడాది వేప పిండి సరఫరా చేసి, ఈ ఏడాది దానికి బదులుగా లింగాకర్షక బుట్టలు ఇవ్వాలని నిర్ణయించడం అర్థరహితమన్నారు. లింగాకర్షక బుట్టలతో పాటు వేపపిండిని కూడా ఈ ఏడాది సరఫరా చేయాలని కోరారు.అశ్వారావుపేటలో కోకో సాగు విస్తీర్ణం పెంచేందుకు కోకో నర్సరీ ఏర్పాటు చేయాలని, రైతులకు రాయితీపై కోకో మొక్కలు పంపిణీ చేయాలని తలసిల ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్