Magazines

ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రజా సంఘాల ఆగ్రహం

1 గంట క్రితం

voter list
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

- ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

- అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల నిరసన

నవతెలంగాణ-సత్తుపల్లి 

ఓటర్ల జాబితా అక్రమాలపై శుక్రవారం సత్తుపల్లిలో ప్రజా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓట్ల దొంగ సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఈ‌సీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ​జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడారు. ​దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసం కోల్పోయి, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేష్ కుమార్ ఇంకా పదవిలో కొనసాగడం


ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమని వారు తీవ్రంగా విమర్శించారు. భారత రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకుని ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రజల ఓటు హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతోందని నాయకులు ఆరోపించారు. అర్హులైన అనేకమంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ​


ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన ఎన్నికల కమిషన్‌పైనే ఆరోపణలు రావడం తీవ్ర విచారకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జ్ఞానేష్ కుమార్‌కు మద్దతుగా నిలవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్ర శక్తులు నిరసనలు తెలుపుతుంటే, వాటిని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.


ప్రజాస్వామ్యాన్ని, ఓట్ల హక్కును కాపాడుకుందామని ప్రతిన పూనారు. ​ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌కే వలి, భాస్కర్, మీసాల వెంకట్రావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, దాట్ల రాంబాబు, మహిళా సంఘం నాయకురాలు పాకలపాటి ఝాన్సీ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్