నవతెలంగాణ–రాయపోల్
రాయపోల్ మండలం మంగీస్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహిళ సమైక్య భవనం నిర్మించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగీస్ పల్లి గ్రామానికి మహిళ సమైక్య భవనం నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని, భవనాన్ని ఎస్సీ కాలనీలో నిర్మించాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే గ్రామ సర్పంచ్, ఇతరులు భవనాన్ని గ్రామ పరిధిలో మరో చోట నిర్మించాలని పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ కాలనీలో ఐకేపీ కార్యాలయం ఏర్పాటు చేస్తే అక్కడికి రావాల్సి ఉంటుందనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కులం పేరుతో వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ కాలనీలో సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాలనీలో మహిళ సమైక్య భవనం నిర్మిస్తే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అధికారులు సమస్యను పరిశీలించి నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొనింటి రాజు, ఎల్లం, లక్ష్మణ్, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)