Magazines

అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

14 నిమిషాల క్రితం

Sridar babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 3 నిమిషాల చదవడం

- ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలి

- అధికారులకు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశం

నవతెలంగాణ కాటారం : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, రైతులు, నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగ యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

బుధవారం కాటారం మండల కేంద్రంలోని బి.ఎల్.ఎం. గార్డెన్‌లో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్, ఎస్పి, ప్రజాప్రతినిధులతో కలిసి నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు . అర్హత ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కానివారు ఎంపీడీఓలను సంప్రదిస్తే దరఖాస్తులను పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడత పూర్తయిందని, రెండో విడత అమలులో ఉందని మంత్రి తెలిపారు. రాబోయే విడతల్లో ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులకు తావివ్వకుండా అర్హత ఆధారంగానే ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచించారు. అనర్హుల పేర్లను జాబితాల నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో దాదాపు 99 శాతం అర్హులైన కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా పేద కుటుంబాలకు నెలకు సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఆదా అవుతోందన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు.. ఆధునిక గ్రంథాలయాల ఏర్పాటు

కాటారం ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. వీటిని త్వరలో ఇతర మండలాలకు కూడా విస్తరించే చర్యలు తీసుకుంటామన్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గ్రామీణ ప్రాంత యువతకు మెరుగైన వసతులు కల్పించేందుకు సంక్రాంతి అనంతరం కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ఒక్కో గ్రంథాలయానికి రూ.50 లక్షల చొప్పున, పలిమెల మండలంలో రూ.20 లక్షలతో ఆధునిక గ్రంథాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు

చిన్న కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. చిన్న కాళేశ్వరం భూసేకరణకు సంబంధించిన పరిహారం అందని రైతుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

కాటారం డివిజన్‌లో 2,204 మందికి నూతన పింఛన్లు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 నూతన పింఛన్లు మంజూరు కాగా, కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 2,204 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజాపాలన, మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. కాటారం డివిజన్‌లో నూతన పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా 54, 23,264 రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, డిఆర్డీఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, విద్యుత్తు నియంత్రణ మండలి సలహాదారు శశి భూషణ్ కాచే, కాటారం, మల్హర్, మహా ముత్తారం, పలిమేల, మహాదేవపూర్ మండలాల ఎంపిడివోలు, సర్పంచులు, పిఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్