నిలిచిపోయిన చెత్త తొలగింపు
మధురై : తమిళనాడులోని ప్రముఖ పట్టణం మధురైలో పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. చెత్త తొలగింపు కోసం అవుట్‌సోర్స్ చేసిన ప్రయివేట్ ఏజెన్సీని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెను ప్రారంభించారు. ప్రయివేట్ ఏజెన్సీని రద్దు చేయాలని ఏడాదికి పైగా కోరుతున్నామని, ఈ ప్రయివేట్ ఏజెన్సీ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, 'కార్మిక వ్యతిరేక' వైఖరిని కూడా అనుసరిస్తుందని కార్మికులు తెలిపారు. సీఐటీయూతో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా మధురై కార్పొరేషన్ ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం. బాలసుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ కూడా ఆదుకోకపోవడంతో కార్మికులకు సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని తెలిపారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి, నిజమైనవి అని బాలసుబ్రమణియన్ చెప్పారు. సుమారు ఇరవై లక్షల జనాభా ఈ నగరంలో చెత్త తొలగింపు, ఇతర కార్యకలాపాల కోసం కనీసం 8000 మంది కార్మికులను నియమించాలని, కానీ కేవలం 3900 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్య సరిపోవడం లేదని చెప్పారు. పండుగ రోజుల్లో, ఇతర సందర్భాలలో పనిభారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రయివేటు ఏజెన్సీతో ఒప్పందం నవంబర్ 16తో ముగుస్తుందని, సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కార్మికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే ఒప్పందాన్ని పునరుద్ధరించమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మికులు కోరగా అధికారులు నిరాకరించారు. దీంతో సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. దీంతో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, ఇతర ప్రతినిధులు- చెన్నై మున్సిపల్ పరిపాలన అధికారులకు మధ్య మంగళవారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
కార్మికుల సమ్మె కారణంగా మధురై నగరంలోని 100 వార్డుల్లోనూ చెత్త పేరుకుపోయింది. మీనాక్షి ఆలయం చుట్టూ, పెరియార్ బస్ స్టాండ్ సమీపంలోనూ, ఇతర ప్రదేశాలు చెత్తతో నిండిపోయాయి.
మధురైలో పారిశుధ్య కార్మికుల సమ్మె
42 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)