ఏడేండ్లలో మోడీ సర్కారు లెక్క ఇది
ఫలితాలు శూన్యం.. కాలుష్యకోరల్లో 90 శాతం నగరాలు
నిధులు ఖర్చవుతున్నా పెరుగుతున్న విషవాయువులు
ప్రజలకు అందని స్వచ్ఛమైన గాలి
కేంద్ర పథకం అమలుపై సీఆర్ఈఏ విశ్లేషణ
దేశ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వానికి, ఆ లక్ష్యాన్ని సాధించడంలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. వాయు కాలుష్య నియంత్రణ కోసం జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, నగరాల్లో కాలుష్యం కట్టడి కావడం లేదు. ఏడేండ్ల తర్వాత కూడా మెజారిటీ నగరాల్లో గాలి నాణ్యత నిర్దేశిత ప్రమాణాలను దాటడం కేంద్ర ప్రభుత్వ విధానాల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పనాజీ : స్వచ్ఛమైన గాలి హామీలు.. భారీగా నిధుల విడుదల.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మారని పరిస్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) ఏడేండ్ల ప్రస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం రూ.12,087 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. 2025–26 నాటికి పరిశీలించిన 130 నగరాలకు గానూ 117 నగరాల్లో పీఎం10 కాలుష్యం జాతీయ ప్రమాణాలను మించి నమోదైంది. పథకం లక్ష్యాలు, నిధుల వినియోగం, క్షేత్రస్థాయి ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) విశ్లేషణ బయటపెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీని ప్రారంభించింది. కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్న నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం దీని ఉద్దేశం. 2017–18ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకునీ.. 2024–25 నాటికి పీఎం10 కాలుష్యాన్ని 20–30 శాతం తగ్గించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో ఈ లక్ష్యాన్ని 40 శాతానికి పెంచి, గడువును 2025–26 వరకు పొడిగించారు. అయినప్పటికీ, లక్ష్యాల సాధనలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
పీఎం10 అంటే రోడ్ల దుమ్ము, నిర్మాణ పనులు, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సూక్ష్మ కాలుష్య కణాలు. పీఎం2.5 కణాలు మరింత చిన్నవిగా ఉండటంతో ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి రక్తంలోకి కూడా చేరగలవు. ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. ఇంతటి ప్రమాదం ఉన్నప్పటికీ, కాలుష్య నియంత్రణ చర్యలు ఎందుకు ఆశించిన ఫలితాలివ్వడం లేదన్నది కీలక ప్రశ్నగా మారింది. 2017–18లో 130 నగరాల్లో 125 నగరాలు పీఎం10 జాతీయ ప్రమాణాన్ని మించి నమోదయ్యాయి. 2019–20 నాటికి ఈ సంఖ్య 112కు తగ్గినా, 2025–26లో మళ్లీ 117కు పెరిగింది. అంటే కేంద్ర పథకం అమలులోకి వచ్చిన తర్వాత సాధించిన ఆ కొంత పురోగతి కూడా నిలకడగా కొనసాగలేదు. 2019–20తో పోలిస్తే 43 నగరాల్లో కాలుష్యం పెరిగింది. 40 శాతానికి పైగా కాలుష్యాన్ని తగ్గించగలిగిన నగరాలు ఎనిమిది మాత్రమే కావడం గమనార్హం.
రూ.16,824 కోట్లు విడుదల.. ఖర్చు రూ.12,087 కోట్లు
ఎన్సీఏపీ కింద రూ.16,824 కోట్లు విడుదల కాగా, అందులో రూ.12,087 కోట్లు ఖర్చయ్యాయి. ఖర్చు చేసిన నిధులు కాలుష్యాన్ని తగ్గించడంలో ఎంతవరకు ఉపయోగపడ్డాయన్న ప్రశ్నకు నగరాల గణాంకాలు ఆందోళనకరమైన సమాధానమిస్తున్నాయి. చెన్నైలో రూ.449 కోట్లు ఖర్చు చేసినా.. 2017–18తో పోలిస్తే పీఎం10 కాలుష్యం 9.1 శాతం పెరిగింది. బెంగళూరులో రూ.313 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. 2019–20తో పోలిస్తే కాలుష్యం 6.8 శాతం పెరిగింది. పూణేలో రూ.289 కోట్లు ఖర్చు చేసినా కాలుష్యం 24.7 శాతం పెరిగింది. విశాఖపట్నంలో రూ.74 కోట్లు ఖర్చు చేసినప్పటికీ 2017–18తో పోలిస్తే కాలుష్యం 67.1 శాతం పెరిగింది. ఈ గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రశ్నలను సంధిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా కాలుష్యం ఎందుకు తగ్గడం లేదు? నిధులు సరైన పనులకు వినియోగించారా? ఖర్చు చేసిన డబ్బుతో ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగింది? పథకం అమలులో వైఫల్యాలకు బాధ్యత వహించేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
పర్యవేక్షణలోనూ లోపాలు
గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు 2024 నాటికి 1,500 మాన్యువల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి ఇంకా 465 కేంద్రాల కొరత ఉంది. ఎన్సీఏపీ పరిధిలోని 130 నగరాల్లో 113 నగరాల్లో మాత్రమే నిరంతర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కాలుష్యాన్ని సమర్థంగా అంచనా వేయడానికి అవసరమైన వ్యవస్థలే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం కార్యక్రమ అమలులోని లోపాలను సూచిస్తోంది.
ప్రచార హామీలు కాదు ఫలితాలే ముఖ్యం
కాలుష్యం నగరాల సరిహద్దుల్లో ఆగిపోదు. ఒక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మరో ప్రాంతానికీ వ్యాపిస్తుంది. అందువల్ల నగరాల వారీగా చర్యలు తీసుకోవడంతోపాటు రాష్ట్రాలు, పొరుగు ప్రాంతాలు కలసి సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్ఈఏ విశ్లేషణ సూచిస్తోంది. పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, వాహనాలు, ఇంధన దహనం నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు స్పష్టమైన లక్ష్యాలు, కఠినమైన అమలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పీఎం2.5 వంటి ప్రమాదకర కాలుష్య కారకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి ప్రజల ప్రాథమిక అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ విజయాన్ని ప్రకటనలు, నిధుల విడుదల, ఖర్చుల లెక్కలతో కాకుండా ప్రజలు పీల్చే గాలి నాణ్యతతోనే అంచనా వేయాలని అంటున్నారు. ఏడేండ్ల తర్వాత కూడా 90 శాతం నగరాలు కాలుష్య ప్రమాణాలను దాటుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను సమీక్షించి, లోపాలను సరిదిద్ది, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టమవుతోందని చెప్తున్నారు.






కామెంట్లు (0)