అంతర్జాతీయ చట్టాలు బేఖాతరు
ఇరాన్‌పై దాడిని మోడీ ప్రభుత్వం ఖండించాలి :గ్వాలియర్‌లో అమెరికా వ్యతిరేక నిరసనలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఇరాన్‌పై అమెరికా దాడిని అనాగరికమైన, నేరపూరిత చర్య అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ సాగించిన ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని
గ్వాలియర్‌లో అమెరికా దాడికి వ్యతి రేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్‌పై దాడి విషయంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరాశ కలిగిస్తోందని అన్నారు. భారత విదేశాంగ విధానానికి ఉన్న సంప్రదాయాలకు ఈ వైఖరి విరుద్ధమని పేర్కొ న్నారు. ఇరాన్ ఎప్పటి నుంచో భారత్‌కు మిత్రదే శమని, అనేక క్లిష్ట సమయాల్లో దేశానికి మద్దతుగ ా నిలిచిందని గుర్తుచేశారు. అటువంటి దేశ సార్వ భౌమాధికారంపై దాడి జరిగినప్పుడు భారత్ అండగా నిలవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
అయితే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం అమెరికా పక్షాన నిలుస్తున్నట్టు కనిపి స్తోందని, దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ విశ్వ సనీయత, ప్రతిష్ట దెబ్బతింటాయని విమర్శించారు.
అణుబాంబు సాకుతో దాడి
ఇరాన్‌పై దాడికి అమెరికా చెబుతున్న కారణాల్లో నిజం లేదన్నారు. యూఎస్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మార్చి, మే నెలల్లో ఆ దేశ పార్లమెంటరీ కమిటీల ముందు చేసిన ప్రకటనలతో పాటు జూన్ 17న వెల్లడించిన వివరాలను ప్రస్తావించారు. ఇరాన్ అణుబాంబును తయారు చేయలేదని, ఆ సామర్థ్యం కూడా లేదని ఆమె పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటప్పుడు అణ్వాయుధాల సాకుతో ఇరాన్‌పై దాడి చేయడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ కూడా ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదన్న విషయాన్ని బేబీ ప్రస్తావించారు.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేసిన ఇరాన్, అణుబాంబు తయారీకి దూరంగా ఉంటామని హామీ ఇచ్చిందన్నారు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలతో కుదిరిన జేసీపీఓఏ ఒప్పందంలోనూ అణ్వాయుధాల తయారీని నిరోధించే ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేయడం మధ్య ఆసియాపై ఆధిపత్యం సాధించడంతో పాటు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేసే చర్యగా ఉందని విమర్శించారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధానికి వ్యతిరేకంగా నిలవడం భారత విదేశాంగ విధాన సంప్రదాయమని గుర్తుచేశారు. ఇటీవల ప్రధాని మోడీ సైతం ఇది యుద్ధాలకు సమయం కాదని చెప్పారని, ఆ మాటలకు అనుగుణంగా ఇరాన్‌పై దాడిని, పాలస్తీనాలో కొనసాగుతున్న మారణహోమాన్ని బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఐ(ఎం) మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జస్వీందర్ సింగ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ సీనియర్ నాయకుడు గురుదత్ శర్మ తదితరులు ప్రసంగించారు.
ఇరాక్‌లోనూ ఇదే మోసం
గతంలో ఇరాక్‌పై దాడి చేసేందుకు అమె రికా, సామ్రాజ్యవాద శక్తులు ఇలాంటి అబద్ధాలనే ప్రచారం చేశాయని బేబీ గుర్తు చేశారు. ప్రాచీన నాగరికతకు నిలయమైన ఇరాక్‌ను ధ్వంసం చేసిన తర్వాత తమ సమాచారం తప్పని అంగీకరించాయని అన్నారు. ఇప్పుడు ఇరాన్ విషయం లోనూ అదే తరహా మోసపూరిత ప్రచా రానికి పాల్ప డుతు న్నాయని విమర్శిం చారు. గాజాలో రెండేండ్లుగా కొనసాగు తున్న మారణ హోమాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలు, పిల్లలు సహా వేలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాకు భారత్ అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా దాడులకు, పాలస్తీనాలో మారణహోమానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)