Magazines

నగదే కింగ్‌

12 నిమిషాల క్రితం

Cash
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

143 శాతం పెరిగిన కరెన్సీ చెలామణి

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు జరిగి పదేళ్లు గడిచినా దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గలేదు. వీధి చివరన ఉన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు యుపిఐ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రజలు నగదును వదులుకోవడం లేదు. 2016 నవంబర్‌ 8న రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.17.77 లక్షల కోట్లు కాగా.. 2026 అక్టోబర్‌ 23 నాటికి అది రూ.43.16 లక్షల కోట్లకు చేరింది. అంటే పదేళ్లలో దాదాపు 143 శాతం పెరిగింది. డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ నగదు అవసరం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మరోవైపు డిజిటల్‌ చెల్లింపుల్లో యుపిఐ దూసుకుపోతోంది. 2026 అక్టోబర్‌ ఒక్క నెలలోనే 25.46 బిలియన్‌ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లుగా ఉంది. 2016–17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యుపిఐ లావాదేవీల సంఖ్య 2025–26 నాటికి 24,162 కోట్లకు మించిపోయింది.

లావాదేవీల విలువ కూడా రూ.7,000 కోట్ల నుంచి సుమారు రూ.314 లక్షల కోట్లకు పెరిగింది. కిరాణా సరుకుల కొనుగోలు నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపు వరకు డిజిటల్‌ చెల్లింపులు సాధారణమయ్యాయి. అయితే డిజిటల్‌ చెల్లింపులు నగదుకు ప్రత్యామ్నాయంగా పూర్తిగా మారలేకపోయాయి. ఇతర అవసరాల కోసం ఎటిఎం నుంచి నగదు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఇంట్లోనో, జేబులోనో కొంత నగదును ఉంచుకుంటున్నారు. నగదును కేవలం కొనుగోళ్ల కోసం మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు ఒక సాధనంగా కూడా చూస్తున్నారని 2023లో ఆర్‌‌బిఐ రీసెర్చ్‌ పత్రం వెల్లడించింది. నగదు లావాదేవీల వినియోగం తగ్గుతున్నప్పటికీ.. దాన్ని నిల్వ ఉంచుకోవాలన్న డిమాండ్‌ కొనసాగుతోందని ఆ అధ్యయనం పేర్కొంది. కుటుంబాలు, చిన్న వ్యాపారులు నగదు వినియోగానికే బలమైన ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్‌‌బిఐ 2026 వార్షిక నివేదికలోనూ వెల్లడించింది.

ప్రస్తుతం నోట్ల విలువలో రూ.500 నోట్లదే ఆధిపత్యంగా కొనసాగుతోంది. 2026 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 85.5 శాతంగా ఉంది. అయితే నోట్ల సంఖ్యలో రూ.500 నోట్లు 41.2 శాతమే. రూ.10 నోట్లు 16.1 శాతం, రూ.100 నోట్లు 15.7 శాతంగా ఉన్నాయి. మరోవైపు 2023 మేలో రూ.2,000 నోట్ల ఉపసంహరణ చేపట్టగా.. ఇప్పటి వరకు 98.45 శాతం తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయి. ఈ గణాంకాలు డిజిటల్‌ చెల్లింపుల విస్తరణతో పాటు భౌతిక నగదుకు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన స్థానం ఉందని స్పష్టం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్