బొగ్గు దిగుమతుల పేరుతో దోచిపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
ఎన్టీపీసీకి ఇచ్చిన 31 టెండర్లలో 24 అదానీ ఎంటర్ ప్రైజేస్ కే..
దేశీయ బొగ్గు కొరత పేరుతో
10 శాతం తప్పని సరి చేసిన మోడీ సర్కార్
రూ.99,386 కోట్లకు చేరిన అదానీ బొగ్గు వ్యాపారం
దేశంలో బొగ్గు కొరత ఉందంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదానీ గ్రూపునకు భారీ లాభాలు తెచ్చిపెట్టిందా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో దిగుమతులను తప్పనిసరి చేయడం, ఆ అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపేందుకు అనుమతించడం వెనుక ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ ఇచ్చిన 31 బొగ్గు దిగుమతి టెండర్లలో 24 అదానీ ఎంటర్ప్రైజెస్ దక్కించుకోవడం ఈ వ్యవహారంలో కీలక అంశంగా నిలిచింది.
న్యూఢిల్లీ : దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, కొరత పేరుతో దిగుమతులను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అదానీ గ్రూపునకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు భారీగా పెరిగిన సమయంలో దిగుమతులపై ఒత్తిడి పెంచిన కేంద్రం.. అదనపు ఖర్చులను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు కూడా అనుమతించింది. ఫలితంగా దిగుమతి దారులకు లాభాలు పెరిగితే, ఆర్థిక భారం మాత్రం సామాన్య ప్రజలపై పడింది. ఈ వ్యవహారంలో మోడీ ప్రభుత్వ విధానాలు ఎవరికి ప్రయోజనం చేకూర్చా యనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2022 మేలో దేశంలో బొగ్గు కొరత ఉందని పేర్కొంటూ.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ అవసరాల్లో 10 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతర్జాతీయ బొగ్గు ధరలు అప్పటికే తీవ్రంగా పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి మధ్య ధరలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం పెరిగినట్టు 16వ ఆర్థిక సంఘం కోసం రూపొందించిన నివేదిక పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు విద్యుత్ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం దిగుమతి బొగ్గు, దేశీయ బొగ్గు ధరల మధ్య టన్నుకు రూ.25 వేల తేడా ఉందని కూడా తెలిపింది.
తమ విద్యుత్ సంస్థ 10 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఏడాదికి అదనంగా రూ.3,750 కోట్ల భారం పడుతుందని కేంద్రానికి వివరించింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇక కొన్ని ప్రయివేటు విద్యుత్ సంస్థలు తమ ప్లాంట్లలో దిగుమతి బొగ్గును వినియోగించడం సాంకేతికంగా సాధ్యం కాదని తెలిపాయి. మరికొన్ని సంస్థలు దిగుమతుల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగుతాయని అభ్యంతరం చెప్పాయి. అయినా కేంద్ర విద్యుత్ శాఖ వెనక్కి తగ్గలేదు. నిర్దేశించిన దిగుమతి లక్ష్యాలను చేరుకోకపోతే దేశీయ బొగ్గు కేటాయింపుల్లో ఐదు శాతం కోత విధిస్తామని హెచ్చరించింది.
ప్రజలపై అదనపు భారం
దిగుమతి బొగ్గు వల్ల పెరిగే ఖర్చులను విద్యుత్ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు విద్యుత్ చట్టంలోని సెక్షన్ 11 కింద కేంద్రం అనుమతించింది. ఈ దిగుమతుల వల్ల యూనిట్ విద్యుత్ ధర 75 నుంచి 80 పైసల వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చాయి. కేంద్ర విద్యుత్ మంత్రి మాత్రం ఈ భారం 50 నుంచి 60 పైసలకు మించదని అన్నారు. అయితే 2022-23లో విద్యుత్ కొనుగోలు సగటు వ్యయం యూనిట్కు 71 పైసలు పెరిగినట్టు ఏడాది తర్వాత కేంద్ర మంత్రే అంగీకరించడం గమనార్హం.
అదానీకి రెట్టింపు ఆదాయం
అదానీ ఎంటర్ప్రైజెస్ బొగ్గు దిగుమతుల విభాగం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.99,486 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 72 శాతంగా ఉంది. పన్నులకు ముందు లాభం రూ.3,417 కోట్లకు చేరింది. దిగుమతి బొగ్గు పరిమాణం కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం పెరిగింది. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ.. గనుల నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగ్గడంతో 2021లో నిల్వలు తీవ్రంగా పడిపోయాయని కేంద్ర ప్రభుత్వ అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, 2021 అక్టోబరులో దేశంలో బొగ్గు కొరత లేదని కేంద్రం బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. ఆ తర్వాత దిగుమతులను తప్పనిసరి చేయడం, ఖర్చులను వినియోగదారులపై మోపేందుకు అనుమతించడం, అదే సమయంలో అదానీ సంస్థకు భారీ స్థాయిలో టెండర్లు దక్కడం ప్రభుత్వ విధానాలపై సందేహాలను పెంచుతున్నాయి. బొగ్గు కొరతను అధిగమించడమే లక్ష్యమని కేంద్రం చెప్పినప్పటికీ.. ఆ నిర్ణయం వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం చేకూరింది? విద్యుత్ బిల్లుల రూపంలో అదనపు ఖర్చును చెల్లించిన ప్రజలకు మాత్రం ఉపశమనం లభించిందా? ప్రభుత్వ రంగ సంస్థల టెండర్లలో పోటీ, ధరల నిర్ణయం, ప్రజాధన వినియోగంపై సమగ్ర పరిశీలన అవసరమనే ప్రశ్నలు ఈ బొగ్గు దిగుమతుల వ్యవహారం లేవనెత్తుతోంది.






కామెంట్లు (0)