చల్లగాలికి చెవులు బిగుసుకుపోయినట్లు అయిపోవడం, మబ్బుగా వినిపించడం, తల బరువుగా అనిపించడం మామూలే. ఇలా అనిపించినప్పుడల్లా కంగారుపడి డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సిన పనిలేదు. మన వంటింట్లో లభించే వస్తువులతోనే, కొన్ని సింపుల్ టిప్స్‌తో ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. మనం సాధారణ భాషలో ‘చెవులు మూసుకుపోవడం’ లేదా ‘చెవులు దిమ్మెక్కడం/గమ్మున అయిపోవడం’ అంటాం. కానీ మెడికల్ పరిభాషలో దీన్ని ‘ఇయర్ కంజెషన్’ (Ear congestion) అంటారు. మన చెవి మధ్య భాగం నుంచి గొంతు వెనుక భాగాన్ని కలుపుతూ ‘యూస్టాచియన్ ట్యూబ్’ (Eustachian tube) అనే ఒక చిన్న నాళం ఉంటుంది. చెవి లోపల గాలి పీడనాన్ని (Air pressure) బ్యాలెన్స్ చేయడం దీని పని. వింటర్లో వచ్చే జలుబు, అలర్జీల వల్ల ఈ నాళంలో వాపు రావడం లేదా శ్లేష్మం (mucus) పేరుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆ ట్యూబ్ బ్లాక్ అయ్యి గాలి ఆడక చెవి బరువుగా, నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
హోమ్ రెమెడీస్..
బ్లాక్ అయిన మీయూస్టాచియన్ ట్యూబ్‌లను తిరిగి తెరుచుకునేలా చేయడానికి, ఈ నేచురల్ పద్ధతులు ట్రై చేయండి.
లాలాజలం మింగడం లేదా ఆవలించడం :ఇది అందరికీ తెలిసిన, అత్యంత సులభమైన పద్ధతి. చెవి దిబ్బడగా అనిపించినప్పుడు తరచుగా లాలాజలాన్ని మింగుతుండటం లేదా నోరు పెద్దగా తెరిచి ఆవలించడం చేయాలి. కుదిరితే బబుల్ గమ్ నమలడం ఇంకా మంచిది. ఈ పనులు చేయడం వల్ల ముఖం, గొంతు కండరాలు కదిలి.. మూసుకుపోయిన ఆ ట్యూబ్ సహజంగానే తెరుచుకుంటుంది. చెవిలో గాలి ప్రెజర్ సెట్ అయ్యి, వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఆవిరి పట్టడం : ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని, తలపై టవల్ కప్పుకొని ఆవిరి పట్టాలి. ఆ వేడి, తేమ గల గాలిని పీల్చడం వల్ల సైనస్, గొంతులో గడ్డకట్టిన శ్లేష్మం కరుగుతుంది. తద్వారా యూస్టాచియన్ ట్యూబ్ కూడా క్లియర్ అవుతుంది. మంచి ఫలితం కోసం నీటిలో రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయొచ్చు. ఒక 5-10 నిమిషాలు ఇలా చేస్తే చాలు.
వేడి కాపడం : నొప్పిగా లేదా బరువుగా ఉన్న చెవిపై వేడి కాపడం పెట్టడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఒక శుభ్రమైన వస్త్రాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి, గట్టిగా పిండేయాలి. ఆ వస్త్రాన్ని చెవిపై 5-10 నిమిషాలు ఉంచాలి. ఆ వేడి వల్ల రక్త ప్రసరణ పెరిగి, బ్లాక్ అయిన ట్యూబ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.





కామెంట్లు (0)