Magazines

యాస నుంచి అభినయం వరకు...

15 గంటల క్రితం

acting
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 3 నిమిషాల చదవడం

నిజజీవితాన్ని (బయోపిక్‌) వెండితెరపై ఆవిష్కరించడం నటీనటులకు పెద్ద సవాలు. ఆ వ్యక్తి మాటతీరు, జీవనశైలి, భావోద్వేగాలను అర్థం చేసుకుని తెరపై ప్రతిబింబించాలి. నటి ఆనంది నటించిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రం అలాంటి ప్రయత్నమే. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాన్ని ఆవిష్కరిస్తూ, టైటిల్‌ పాత్రలో ఆమె తన నటనా ప్రతిభను చాటుకున్నారు. యాస, హావభావాలు, భావోద్వేగాల విషయంలో ఆమె చేసిన సాధన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


ఆనంది అసలు పేరు రక్షిత. వరంగల్‌లో పుట్టి పెరిగిన ఆమెకు తొలుత చదువుపైనే ఆసక్తి ఉండేది. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ‘ఆట జూనియర్స్‌’, ‘డాన్స్‌ ఇండియా డాన్స్‌’ వంటి టెలివిజన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత దర్శకుడు మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాలో అవకాశం ఇవ్వడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘బస్టాప్‌’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రసీమలోకి వెళ్లారు. భాష తెలియకపోయినా నటనను కొనసాగిస్తూ, ఇతరులతో మాట్లాడుతూ తమిళం నేర్చుకున్నారు. 2014లో వచ్చిన ‘కయల్‌’ ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత ‘చండివీరన్‌’, ‘విసారణై’, ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తదితర చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత.

గరివిడి లక్ష్మి పాత్రే సవాలు..

ఉత్తరాంధ్ర జానపద కళారంగంలో బుర్రకథ ప్రదర్శనలతో గుర్తింపు పొందిన గరివిడి లక్ష్మి జీవితాన్ని తెరకెక్కించడం దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము చేసిన ప్రత్యేక ప్రయత్నం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 17న విడుదలై బాక్సాఫీసు వద్ద టాలీవుడ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా ఒక జానపద కళాకారిణి జీవితాన్ని విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు గరివిడి లక్ష్మి గురించి, బుర్రకథ కళారూపం గురించి పెద్దగా తెలియదని ఆనంది ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కథ విన్న తర్వాత ఆమె జీవితం మరింతమందికి తెలియాలని అనిపించిందని, ఇలాంటి పాత్ర లభించడం తనకు దక్కిన మంచి అవకాశం’ అని ఆమె అన్నారు.

యాస.. హావభావాలు.. బుర్రకథ

‘పాత్రలో సహజంగా ఒదిగిపోవడానికి వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను. ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు పలకడం, మాటల్లో సహజత్వాన్ని తీసుకురావడం సవాలుగా అనిపించింది. బుర్రకథ కళాకారుల ప్రదర్శనలను అర్థం చేసుకోవడానికి వీడియోలు చూశాను. కొందరు కళాకారులను ప్రత్యక్షంగా కలిసి వారి ప్రదర్శనలను పరిశీలించాను. వేదికపై కళాకారులు ప్రదర్శించే ఉత్సాహం, శరీర భాష, ముఖ కవళికలు, చేతుల కదలికలను ఆకళింపు చేసుకుని సాధన చేశాను. కళపై ప్రేమ, జీవితంలోని సంఘర్షణలు, గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని సహజంగా పలికించేందుకు ప్రయత్నించాను’ అంటున్నారు ఆనంది. వేదికపై కళాకారిణిగా కనిపించే ఉత్సాహానికి, వ్యక్తిగత జీవితంలోని ఆవేదనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపడంలో ఆనంది నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో ఆనంది చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తుచేశాయి. అవకాశాలు, లెక్కలు, రాజకీయాల మధ్య కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ముందుకు నడిపిస్తున్నాయన్నారు. మరోవైపు, సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకుల స్పందన ఆమెకు సంతోషాన్నిచ్చింది. తెరపై ఆనంది కనిపించలేదని, గరివిడి లక్ష్మి మాత్రమే కనిపించిందని ప్రేక్షకులు చెప్పడం నటిగా గొప్ప సంతృప్తినిచ్చిందని ఆమె సంతోషం వ్యక్తంగా చెశారు.

కథ.. నిర్మాణం.. సాంకేతికత

దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము జానపద కళాకారిణి జీవితాన్ని కథాంశంగా ఎంచుకోవడం చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. బుర్రకథ ప్రదర్శనల వెనుక ఉన్న కళాకారుల కష్టాలు, గుర్తింపు కోసం వారు చేసే ప్రయత్నాలను తెరపైకి తీసుకురావడం ప్రశంసనీయం. కథాగమనం ప్రధాన పాత్ర జీవితంలోని సంఘర్షణలు, కళతో ఆమెకున్న అనుబంధం చుట్టూ సాగుతుంది. గ్రామీణ వాతావరణం, జానపద ప్రదర్శనలను తెరపై ఆవిష్కరించడంలో ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం, శబ్ద రూపకల్పన కీలకంగా వచ్చాయి. బుర్రకథలోని ఉత్సాహం, భావోద్వేగ సన్నివేశాల తీవ్రత ప్రేక్షకులకు చేరువ కావడానికి ఈ సాంకేతిక అంశాలు తోడ్పడ్డాయి. కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ఆవిష్కరించడంలో సన్నివేశాల సహజత్వం, నటీనటుల అభినయం ముఖ్య పాత్ర పోషింశాయి.

నటిగా మరో మెట్టు

తెలుగు నుంచి తమిళ చిత్రసీమకు వెళ్లడం, కొత్త భాషను నేర్చుకోవడం, విభిన్న కథాంశాల్లో నటించడం ఆనందికి పరిణతిని అందించాయి. ‘గరివిడి లక్ష్మి’ వంటి జీవిత చరిత్ర ఆధారిత చిత్రంలో నటించడం ఆమె ప్రయాణంలో మరో మైలురాయి. పాత్ర కోసం కొత్త విషయాలను నేర్చుకోవడం, తనను తాను మలచుకోవడం ఆమె నిబద్ధతను తెలియజేస్తాయి. ఈ చిత్రం ఒక కళాకారిణి కథకే పరిమితం కాకుండా, జానపద కళాకారుల జీవితాలు, వారి ఆత్మగౌరవం, కళకు లభించాల్సిన గుర్తింపు గురించి ఆలోచింపజేస్తుంది. కనుమరుగవుతున్న కళారూపాలను కాపాడుకోవడంతోపాటు, వాటిని సజీవంగా ఉంచుతున్న కళాకారులను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ప్రేక్షకుల మనసుల్లో పాత్రగా నిలవడం ఏ నటికైనా గొప్ప గుర్తింపు. ‘గరివిడి లక్ష్మి’గా ఆనంది చేసిన ప్రయత్నం ఆమె సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే మైలురాయిగా నిలుస్తుంది. యాస నుంచి అభినయం వరకు పాత్ర కోసం ఆమె చేసిన సాధన, ప్రేక్షకుల స్పందనకు తోడై మరిన్ని విభిన్న పాత్రలను ఎంచుకునే స్ఫూర్తినిస్తుంది.


– యడవల్లి శ్రీనివాసరావు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్