Magazines

నిర్ణయం ఆమెదే...

1 గంట క్రితం

decision
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 4 నిమిషాల చదవడం

ఈ మధ్య కాలంలో భాగస్వామి ఉన్నప్పటికీ ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం ఓ సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ వాటి ప్రభావం కుటుంబంపై పడుతుంది. ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలూ ఉండవా? కేవలం విడాకులు తీసుకోవడమే దీనికి పరిష్కారమా? వారి వల్ల ఎదుటి వ్యక్తి అనుభవించిన మానసిక క్షోభకు ఎలాంటి శిక్షలూ ఉండవా? సంబంధం పెట్టుకున్న వ్యక్తి హాయిగా జీవిస్తుంటే, దాని వల్ల ఇబ్బందిపడుతున్న వారు మాత్రం బాధపడుతూ జీవించాల్సిందేనా? వీళ్ల జీవితం సంగతి ఏంటీ. ఆ వ్యక్తి కుటుంబం, పిల్లల్ని పట్టించుకోనప్పుడు తాను మాత్రం అన్ని బాధ్యతలూ ఎందుకు భరించాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటి ఓ సమస్య గురించే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)‌లో చదువుదాం...


పల్లవికి 45 ఏండ్లు ఉంటాయి. ఆమె మా దగ్గరకు వస్తూనే ‘మేడమ్‌ సమస్య నాదైతేనే పరిష్కారం చెబుతారా లేదా ఇతరుల సమస్య నేను చెప్పినా పరిష్కారం చెబుతారా?’ అడిగింది. దానికి మేము ‘ముందు మీరు సమస్య ఏంటో చెప్పండి. పరిష్కారం చెప్పగలమో లేదో చెబుతాము’ అన్నాము. ‘సమస్య నాది కాదు, మా తమ్ముడు, మరదలిది’ అన్నది. ‘సమస్య ఏంటో చెప్పండి, మేము వాళ్లను పిలిచి మాట్లాడతాము’ అన్నాము. మా తమ్ముడు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ‘నేను కూడా ఎవరినో ఒకళ్లను చూసుకుంటాను’ అంటుంది మా మరదలు. ఇద్దరూ ఇలా ప్రవర్తిస్తే ఎలా? వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. వారి పరిస్థితి ఏంటీ? ఇక మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్లేమే ‘ఇలాంటి కుటుంబంతో నువ్వు ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు’ అంటున్నారు. ఈ మధ్య కాలంలో మా అమ్మ ఆరోగ్యం బాగోక ఆస్పత్రిలో చేరింది. నన్ను చూడటానికి కూడా వెళ్లనీయలేదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ల ప్రస్తావన తీసుకొచ్చి నన్నూ, నా పిల్లల్ని తిడుతున్నారు.

​ఇలాంటివి వద్దు అని మా తమ్ముడితో ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ‘నా గురించి మీ ఇంట్లో వాళ్లకు ఎందుకు’ అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సమస్యకు మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి’ అంటూ బాధ పడింది. ​మేము ముందు పల్లవి భర్త అశోక్‌‌ను పిలిచి మాట్లాడాము. ‘ఆమె తమ్ముడు చేస్తున్న తప్పు గురించి ఈమెను అనడం సరైనది కాదని నాకు తెలుసు. ఇలాగైనా ఆమె వాళ్ల గురించి పట్టించుకోకుండా, వాళ్ల ఇంటికి వెళ్లకుండా ఉంటుందని అనుకున్నాను. కానీ తాను ఇంత బాధపడుతుందని మీ దగ్గరకు వచ్చిన తర్వాతే తెలిసింది. కానీ ఈమె తమ్ముడు సురేష్‌ ‌ప్రవర్తన వల్ల పిల్లలు కూడా పాడైపోతారని నాకు భయంగా ఉంది. ఎందుకంటే మా అత్తయ్య వాళ్లకు విషయం తెలిసినా అది తప్పు అని కొడుకుని మందలించడం లేదు. పైగా ‘సురేష్‌ ‌మగాడు, ఎంతమందితోనైనా సంబంధం పెట్టుకుంటాడు. మీకేంటి సమస్యా, మీకు నచ్చకపోతే మా ఇంటికి రావొద్దు’ అంటున్నారు. తల్లి అండ చూసుకొని సురేష్‌ ఇలా ప్రవర్తిస్తున్నాడు. దాంతో పల్లవి ఎలాగైనా తన తమ్ముడిని మార్చాలని చూస్తుంది. కానీ మా అమ్మ ఏమో ‘వాళ్ల గురించి నీకెందుకు, నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో’ అంటుంది’ అన్నాడు.

మీ ఉద్దేశం ఇదే అయితే చెప్పే పద్దతిలో ఆమెకు మీరు చెప్పాలి. అలా కాకుండా వాళ్ల తమ్ముడి ప్రవర్తన అడ్డు పెట్టుకొని ఆమెను, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? తమ్ముడు తప్పు దారిలో వెళుతుంటే అక్కగా అతన్ని సరిచేయాలని చూస్తుంది. అందులో తప్పేముంది. వీలైతే మీరూ సాయం చేయండి, లేదంటే తన ప్రయత్నం తనని చేయమనండి. మీరు, మీ అమ్మ ఆమెను ఎలా పడితే అలా మాట్లాడడం సరైనది కాదు. మేము సురేష్‌‌తో కూడా మాట్లాడతాము. కానీ మీరు మాత్రం పల్లవిని అనవసరపు మాటలతో బాధపెట్టొదు’ అని చెప్పి పంపించాము. ​తర్వాత వారం సురేష్‌ ‌వాళ్లను పిలిపించాము. ముందు సురేష్‌ ‌భార్య మాట్లాడుతూ ‘మేడం నేను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. ఈయన అలా అంటేనైనా మారతాడేమో అని అన్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. తల్లిదండ్రులుగా మేము ఇలా ప్రవర్తిస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? నేను ఎంత చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. పైగా మా అత్త ఆయనకే సపోర్ట్‌ ‌చేస్తుంది. ఆమె అండ చూసుకొని సురేష్‌ ఎప్పుడో ఇంటికి వస్తుంటాడు. ఇల్లు, పిల్లల్ని పట్టించుకోడు. పిల్లలేమో ‘మమ్మీ మనకు డాడీ వద్దు, మనం వేరేగా వుందాం’ అంటున్నారు.

మా వల్ల పల్లవి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. మా పెండ్లికి ముందు మేమిద్దరం మంచి స్నేహితులం. సురేష్‌, నేను ఇష్టపడి పెండ్లి చేసుకోవడానికి కారణం పల్లవినే. ఇప్పటి వరకు మా వల్ల తను పడిన ఇబ్బంది చాలు. అందుకే మేము ఎక్కడికైనా వెళ్లి దూరంగా ఉండాలనుకుంటున్నాము. కానీ పిల్లల చదువు కోసం ఆలోచిస్తున్నాను. మరో రెండేండ్లయితే పిల్లల చదువు అయిపోతుంది. అప్పుడు ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అన్నది. ​పిల్లల్ని పిలిచి మాట్లాడితే ‘మా చిన్నతనంలో వాళ్లు ఎలా ఉన్నారో మాకు తెలియదు. మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడూ గొడవలే. నాన్న వల్ల మా అమ్మ చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే మేము నాన్నకు దూరంగా వెళ్లిపోవాలను కుంటున్నాము. అమ్మకు ఇంకో పెండ్లి చేయాలనుకుంటున్నాము. కానీ అమ్మనే మా మాట వినడం లేదు. పైగా మాతో ‘ఎంతైనా అతను మీ నాన్న, ఆయన గురించి అలా మాట్లాడకూడదు’ అంటుంది. కానీ నాన్న చేస్తుంది కరెక్టు కాదు. అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో అన్ని ఖర్చులు అమ్మనే చూసుకుంటుంది. ఈ మధ్య నాయనమ్మ ఆస్పత్రిలో చేరినప్పుడు కూడా అమ్మనే చూసుకుంది’ అని చెప్పారు.

​చివరగా సురేష్‌‌తో మాట్లాడితే నా భార్య అంటే నాకు ఇష్టమే కానీ నాకు తెలియకుండానే నేను ఇతరులతో సంబంధం పెట్టుకుంటున్నాను. వాళ్ల దగ్గరకు వెళితే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, బాధ్యతలు ఏమీ ఉండవు. పైగా మీ అమ్మ నన్ను ఇలా అంది అలా అంది అనే గొడవలు ఉండవు. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్లొచ్చు, ఇష్టం లేకపోతే వచ్చేయవచ్చు. నన్ను అడిగే వాళ్లే ఉండరు. నాకు ఈ జీవితమే బాగుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ​దానికి మేము ‘ఇలాంటి సంబంధాలు నువ్వు డబ్బు సంపాదించే వరకు బాగానే ఉంటాయి. రేపు నీ ఆరోగ్యం బాగోక మంచాన పడితే నిన్ను ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు పిల్లల ఫీజు కట్టాలి, బాధ్యతలు ఉన్నాయి, భార్యకు సమా ధానం చెప్పాలని తప్పించుకు తిరుగుతున్నావు. నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. రేపు నువ్వు లేవలేని పరిస్థితుల్లో నువ్వు సంబంధాలు పెట్టుకున్న ఎవ్వరూ నీకు సాయం చెయ్యరు. సేవలు అంతకన్నా చెయ్యరు. అప్పుడు నీకు కావల్సిం ది భార్యా, పిల్లలే. ఇప్పటికైనా నువ్వు మారితే నీకే మంచిది. లేదంటే నీ ఇష్టం. నీ భార్య పిల్లలు వాళ్ల జీవితం వాళ్లు చూసుకుంటారు. నువ్వు నీ ఇష్టం వచ్చి నట్టు ఉండొచ్చు. నువ్వే ఆలోచించికో’ అన్నాము. సురేష్‌ ‌భార్యతో ‘ఎలాగో మరో రెండేండ్లు పిల్లల చదువు కోసం భరిస్తానని చెబుతున్నావు. ఈలోగా అతనిలో మార్పు వస్తే ఉండు. లేదంటే నీ నిర్ణయం నువ్వు తీసుకో. నీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము నీకు అండగా ఉంటాము’ అని చెప్పి పంపించాము.


- వై వరలక్ష్మి, 9948794051

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్