గతంలో కట్టెలు, పిడకలతో వంట చేస్తుంటే పొయ్యి నుంచి వచ్చే పొగ మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా ఉండేది. ఇపుడు ఎక్కడ చూసినా గ్యాస్ స్టవ్లే. వాని నుంచి పొగరాదని, ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని అందరూ భావిస్తున్నారు. కానీ గ్యాస్ మండే సమయంలోనూ హానికర వాయువులు వెలువడతాయి. చిన్న వంటగదులు, కిటికీలు లేని గదులు, గాలి బయటకు వెళ్లే మార్గం లేని అపార్ట్మెట్లలో ఈ కాలుష్యం పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. వంటింటి పొగ కేవలం దగ్గు, కళ్ల మంటలకే పరిమితం కాకుండా తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా గృహ వాయు కాలుష్యంతో లక్షల సంఖ్యలో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గ్యాస్ మండే సమయంలో నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వెలువడే అవకాశం ఉంది. ఆహార పదార్థాలను వేయిస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు నూనెలు వేడెక్కి సూక్ష్మధూళి కణాలు గాలిలో కలుస్తాయి.
ముఖ్యంగా చిన్న వంట గదులు, సరైన వెంటిలేషన్ లేనిచోట్ల కాలుష్యకారకాలు పేరుకుపోతాయి. వంటగదిలోని గాలి ఇల్లంతా వ్యాపించవచ్చు. దీనివల్ల చాలా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. వంట పొగలోని సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా ప్రవేశించి రక్తప్రవాహంలోకి చేరే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలం ఈ కాలుష్యానికి గురయితే దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గృహ వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాల్లో గుండె సంబంధిత వ్యాధుల వాటా 12శాతం, పక్షవాతం 23శాతం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 21శాతం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీఓపీడీ) 19 శాతంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంట్లో వంట బాధ్యతలు ఎక్కువగా మహిళలపైనే ఉంటాయి. చిన్నారులు తల్లుల దగ్గరే ఉండటం, వంటగదిలో సమయం గడపడం వల్ల వారికీ ముప్పు తప్పట్లేదు. ముఖ్యంగా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
మరి పరిష్కారం ఏంటీ?
వంటగదిలో కిటికీ ఉంటే సరిపోదు. బయటిగాలి లోపలికి వచ్చి, వంట సమయంలో ఏర్పడే కాలుష్య గాలి బయటకు వెళ్లేలా ఏర్పాట్లుండాలి. వీలైతే ఎదురెదురుగా కిటికీలులేదా కిటికీ, తలుపుండేలా చూసుకోవాలి.
వంట చేసేప్పుడు కెటికీలు తెరిచి ఉంచడం మంచిది. బయట గాలిలో దుమ్ము, పొగ ఎక్కువుంటే పరిస్థితిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవడం మరో మంచిమార్గం. గదిలోని గాలిని నేరుగా బయటకు పంపేలా అమర్చాలి. చిమ్నీ ఏర్పాటు చేసుకుంటే ఆవిరి, పొగ, కాలుష్య కారకాలను మూలం దగ్గరే తొలగించవచ్చు.
వంట చేస్తున్నంత సేపు చిమ్నీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి ఉంచాలి. వంట పూర్తయ్యాక 10-20 నిమిషాల పాటు చిమ్మీని అన్లో ఉంచాలని పర్యావరణ పరిరక్షణ సంస్థ సూచిస్తోంది.
వీలైనంత వరకు స్టవ్ వెనక బర్నర్లను ఉపయోగిస్తే చిమ్నీ కాలుష్యాన్ని సమర్థంగా పీల్చుకునే అవకాశం ఉంటుంది, చిమ్నీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
గ్యాస్ బర్నర్లు సరిగ్గా మండుతున్నాయో లేదో పరిశీలించాలి. మంట నిరంతరం పసుపు రంగులో కనిపిస్తే నిపుణుడితో తనిఖీ చేయించాలి.
నూనెను పొగలు వచ్చేంతవరకు వేడి చేయవద్దు. వండేటప్పుడు పాత్రలపై మూతలు పెట్టాలి. వంట సమయంలో కిటికీలు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి.
అవసరమైతే పీఎం 2.5, వీవోసీలను తగ్గించే హెపాయాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిపైయర్ ఉపయోగించాలి.





కామెంట్లు (0)