సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమష్టి పోరు
పోలీసు సంస్కరణలు నిరంతరం కొనసాగాలి
ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు సమర్థవంతమైన, నిష్పక్షపాతమైన పోలీసు సేవలు అందించాలని ఆయన సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాల మధ్య సరిహద్దులు దాటి సహకారాన్ని పెంపొందించేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీసీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సమాజంలో భద్రత, రక్షణకు పోలీసు వ్యవస్థ పునాది వంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసు శాఖకు అందించే వనరులను ఖర్చుగా కాకుండా మెరుగైన సమాజ నిర్మాణానికి చేసే పెట్టుబడిగా భావిస్తున్నట్టు తెలిపారు. నేరాల నియంత్రణలో ఒక్క రాష్ట్రం చేసే ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఉమ్మడి సమస్యలపై చర్చించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు దోహద పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరా బాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిష నరేట్లుగా విభజించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం కలిగిందని ముఖ్యమంత్రి వివరించారు. వివిధ రకాల నేరాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు ప్రస్తుతం ప్రధాన సవాళ్లుగా మారాయని, వీటిని ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించు కోవాలని సూచించారు.
నేరాల నియంత్రణలో జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో తెలంగాణ పోలీసు శాఖ గుర్తింపు పొందుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని గుర్తు చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగిల్ విభాగం కేంద్ర ప్రభుత్వ అంచనాల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిందని పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందన్నారు.
సరిహద్దులు దాటి సహకారం పెరగాలి
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతర్రాష్ట్ర నేరగాళ్ల కదలికలు, సైబర్ నేరాల నెట్‌వర్క్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలపై సమష్టి కార్యాచరణ అవసరమని సూచించారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థను పంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రకటించారు.
సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, రాష్ట్రాల మధ్య సమన్వయానికి ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తేనే నేరాలను సమర్థంగా నియంత్రించి, ప్రజలకు మరింత భద్రత కల్పించడం సాధ్యమ వుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు రాష్ట్రాల డీజీపీలు సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆహార పదార్థాల కల్తీల భరతం పట్టాలని, నేర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, మావోయిస్టుల కార్యకలపాలపై నిఘాను కొనసాగించాలని తీర్మానం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్ఛేరి, డీజీపీలు డాక్టర్ ఎం.ఏ. సలీమ్, డాక్టర్ మహేష్ అగర్వాల్, షాలిని సింగ్,లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ,ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట , లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ,ఆపరేషన్స్ విభాగం డీజీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆహార కల్తీ నియంత్రణకు టీజీ-సేఫ్
ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణను పటిష్ఠం చేయడం కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు అమెరికా ఎఫ్‌డీఏ తరహాలో టీజీ-సేఫ్ వ్యవస్థను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
చెరువులు, సరస్సులు, ఇతర జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణతో పాటు ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కాపాడటంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించడం ద్వారా తెలంగాణ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు.
సంక్షేమానికి ప్రాధాన్యం
విధి నిర్వహణలో పోలీసులు తమ ప్రాణా లను సైతం పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని, వారి సంక్షేమం, కుటుం బాల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు సిబ్బంది పిల్లలు ఈ పాఠశాలలో విద్య నభ్యసించే అవకాశం కల్పించినట్లు వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారి హోదా, సర్వీ సును బట్టి కనీసం రూ.కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. అటువంటి కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయించడంతో పాటు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.






కామెంట్‌లు (0)