ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, పని పరిస్థితులను మెరుగుపర్చాలి :
పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణలో నాణ్యత ఉండాలని డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జూడాలు నిరసన, సమ్మె చేపట్టారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసనలో సుమారు 700 మందికి పైగా జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్స్, పీజీ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో ఎలక్టివ్ ఔట్ పేషెంట్ సేవలు, ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్ సేవలను నిలిపేశారు. అత్యవసర సేవలు, ప్రాథమిక రోగుల సంరక్షణకు ఎలాంటి ఆటంకమూ లేకుండా నిరసన కొనసాగించారు.
ఈ సందర్భంగా జూడాలు మాట్లాడుతూ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణలో నాణ్యత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, పని పరిస్థితులను మెరుగుపర్చాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు, వాటి వల్ల వైద్య సేవలకు కలుగుతున్న ఆటంకాలపై పరిష్కారం,క్లినికల్ శిక్షణ, విభాగాధిపతుల పనితీరులో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. పేదల పాలిట పెద్ద దిక్కుగా నిలవాల్సిన ఆస్పత్రి.. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కొరతతో సతమతమవుతోందని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేకపోవడం, వైద్య పరీక్షలకు ఆటంకాలు ఎదురవుతుండటంతో రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ ఆందోళనకు దిగినట్టు వెల్లడించారు. తొలిదశలో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను నిలిపివేసినట్టు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సామగ్రి, శస్త్రచికిత్స పరికరాల సరఫరాపై ప్రభావం పడుతోందని తెలిపారు. ఆర్థోపెడిక్స్ విభాగంలో ఎక్స్‌రే యంత్రం తరచూ మొరాయిస్తోందని, ఎముకల విరుగుళ్లకు కట్లు కట్టేందుకు అవసరమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని వివరించారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రోగికి అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండటం లేదని, వైద్యులు పది రకాల మందులు రాస్తే రెండు, మూడు మాత్రమే ఇచ్చే పరిస్థితి నెలకొందని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న తమకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విశ్రాంతి గదులు, పడకలు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు కొరవడ్డాయని, దోమల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. 24 గంటలతో పాటు కొన్ని సందర్భాల్లో 48 గంటలపాటు విధులు నిర్వహించాల్సి వస్తున్నా విశ్రాంతి తీసుకు నేందుకు అనుకూల పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు నెలలుగా ఉపకార వేతనాలు సకాలంలో అందడం లేదన్నారు. ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయడంతో పాటు కనీసం 40 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయడం, అత్యవసర మందులు, వైద్య పరీక్షల సామగ్రిని అందుబాటులో ఉంచడం, శస్త్రచికిత్స పరికరాలను సమకూర్చడం, ఎంఆర్‌ఐ సేవలను మెరుగుపరచడం, గుండె వైద్య విభాగాన్ని పూర్తిస్థాయిలో పనిచేయించేలా చర్యలు తీసు కోవడం వంటి డిమాండ్ల పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.






కామెంట్‌లు (0)