విద్యుత్‌రంగంపై ఎల్‌నినో పిడుగు
40-45 శాతం మేర అధిక విద్యుత్ డిమాండ్
సరఫరా చేసే వేళల్లో ఫీడర్‌లపై ఒత్తిడితో బ్రేక్‌డౌన్
ముందుకొస్తున్న లోవోల్టేజ్ సమస్యలు
సరిపడా సిబ్బంది లేక.. మరమ్మతులు
ఆలస్యం
కరెంట్ కోతలతో రోడ్డెక్కుతున్న రైతులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఒక్కో రంగంపై తన ప్రభావం చూపుతోంది. ఇది వరకే వర్షాభావ పరిస్థితులతో పలు చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొనగా.. 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి. ఒక వైపు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు, మరో వైపు బోరుమోటార్లతో పంటను కాపాడుకునేందుకు ‘విద్యుత్’పై ఆధారపడటంతో క్రమంగా డిమాండ్ పెరగసాగింది. సాధారణంగా కేటాయించిన కోటా కంటే 40 నుంచి 45 శాతం వరకు అధికంగా సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఫీడర్‌లపై లోడ్ పెరిగి బ్రేక్‌డౌన్, లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కరెంట్ సరఫరాలో కోతలు పడుతుండటంతో వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు సరిపడా సిబ్బంది లేక పనులు ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట చివరి దశలో నీరు ఇవ్వలేకపోతే ఎల్‌నినోను తట్టుకొని ఇప్పటి వరకు గట్టెక్కించిన పంట ఎండిపోయే ప్రమాదం నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్‌కు అనుగుణంగా తర్వాత సంవత్సరానికి విద్యుత్ సరఫరా చేసేందుకు గాను విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని దాని ప్రకారం సరఫరా చేస్తుంటారు. ఆ లెక్కన నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం 6.40 మిలియన్ యూనిట్(ఎంయూ)లు సరఫరా చేసేందుకు కోటా కేటాయించారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో డిమాండ్ పెరిగిపోగా ప్రస్తుతం 10.707 ఎంయూ సరఫరా చేస్తున్నారు. అదే విధంగా కామారెడ్డి జిల్లాకు రోజు వారి కోటా 3.87 ఎంయూ కేటాయించగా.. 7.24 ఎంయూ, 7.118 ఎంయూ సరఫరా కొనసాగుతుంది.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన కోటా కంటే అధిక డిమాండ్ నెలకొనడం, డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి కాని సమయంలో గ్రిడ్‌ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
సరిపడా సిబ్బంది లేక మరమ్మతులు ఆలస్యం
ప్రస్తుతం భూగర్భ జలాలు సైతం తగ్గడంతో.. బోరుమోటార్లు నీటిని ఎత్తిపోసేందుకు సాధారణం కంటే 10 శాతం అదనంగా విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో కూడా డిమాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఫీడర్‌లపై లోడ్ అధికంగా పడటంతో విద్యుత్ సరఫరాల్లో కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు లో వోల్టేజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని సరి చేసేందుకు గాను ప్రస్తుతం సరిపడా సిబ్బంది లేక మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో కరెంట్ కోతలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఫీల్డ్ సిబ్బంది 1709 పోస్టులు మంజూరు కాగా 456 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 274కు గాను ఏకంగా 244 ఖాళీలు ఉండటం గమనార్హం. ఇంజనీర్ పోస్టులు 19 ఖాళీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఫీల్డ్ సిబ్బందిలో 261 ఖాళీలు, సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టుల్లో 130 ఖాళీలు ఆరేండ్లుగా వెక్కిరిస్తున్నాయి. సిబ్బందిని నియమించి, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎల్‌నినోను తట్టుకొని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన పంటలు.. చివరి దశలో కరెంట్ లేక నీరు అందించకుంటే ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.
టైమ్‌కి కరెంట్ రావట్లే
ఒక వైపు వర్షాలు లేవు. ఇంకోవైపు టైమ్‌కి కరెంట్ కూడా వస్తలేదు. పత్తి, వరి ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉన్నాయి. ఈ సమయంలో కరెంట్ ఇవ్వకపోతే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. సరిగ్గా కరెంట్ సరఫరా చేయట్లేదని ఆందోళన చేస్తే ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఇస్తున్నారు. పంటలు చేతికి వచ్చే వరకు సరిగ్గా కరెంట్ సరఫరా చేయాలి.
- తానాజీ,
పెద్దకొడప్‌గల్, కామారెడ్డి
ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నాం
జిల్లాకు కేటాయించిన కోటా కంటే అదనంగా నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా ఓవర్ లోడ్‌తో ఫీడర్ బ్రేక్‌డౌన్ అయిన సమయంలో వెంటనే స్పందిస్తున్నాం. సదరు ఫీడర్ పరిధిలో సరఫరా నిలిచినపోయిన సమయానికి అనుగుణంగా అదనపు సమయం రైతులకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. గృహ వినియోగదారులు కరెంట్ వృథాను అరికట్టాలి. అవసరం మేరకే ఉపయోగించుకోవాలి.
- ఈ.సాలియ, ఎస్‌ఈ, టీజీఎన్‌పీడీసీఎల్, కామారెడ్డి






కామెంట్‌లు (0)