చినిగిపోవు..తడిసిపోవు..లామినేషన్ అవసరం లేదు
ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇకపై ‘మీసేవ’ ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లకు లామినేషన్ అవసరం లేదు. చిరిగిపోని, తడిసిపోని కొత్త రకం పేపర్‌పై వీటిని ముద్రించి ఇస్తారు. దీనికోసం 15 రకాల అధునాతన ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజాభవన్‌లో వీటిని ప్రారంభించారు. ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) కమిషనర్ టీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈ నూతన సర్టిఫికెట్ల ప్రాధాన్యతలు వివరించారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందించామన్నారు. భద్రతా కారణాల వల్ల నూతన ఫీచర్ల పూర్తి వివరాలను వెల్లడించడం లేదని తెలిపారు. ‘‘ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పేపర్ సులభంగా చినిగిపోదు. నీళ్లు పడినా త్వరగా దెబ్బతినదు. సాధారణ వినియోగం, మడతపెట్టడం, ఎక్కువ కాలం భద్రపరచడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో సర్టిఫికెట్లను ఏండ్ల తరబడి మంచి స్థితిలో దాచుకునే అవకాశం ఉంటుంది’’ అని మంత్రి వివరించారు. జీవితాంతం అవసరమయ్యే పత్రాలైన జనన, మరణ ధ్రువపత్రాలు, విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు ఉపయోగించే సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ధ్రువపత్రాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.






కామెంట్‌లు (0)