Magazines

సర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం

52 నిమిషాల క్రితం

కలెక్టరేట్ల ముందు ధర్నాలు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం


6న కలెక్టరేట్ల ముందు ధర్నాలు
8న లోక్ భవన్ ముట్టడి..నవంబర్‌ 1న చలో ఢిల్లీ ఇండియా కూటమి పార్టీల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘సర్‌’కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ జ్ఞానేశ్‌ ‌కుమార్‌‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ ‌చేశాయి. ఈమేరకు శనివారం హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌‌లో సమావేశమైన నేతలు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌‌డీ అబ్బాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహ, పశ్యపద్మ, సింహాద్రి (ఎస్పీ), ఎం నరసయ్య (టీజేఎస్‌), జస్వంత్ కుమార్ (బీసీ జన సమితి), సలీం పాషా (యువజన జన సమితి), పి.శోభా యాదవ్ (ఆర్‌‌జేడీ) తదితరులు పాల్గొన్నారు. సర్‌ ‌ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈనెల 6న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 8న లోక్‌‌భవన్‌ ‌ముట్టడి చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. నవంబర్‌ ఒకటిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ... ఇండియా కూటమి పార్టీలన్నీ సర్‌‌కు వ్యతిరేకంగా ఉధృత ఆందోళనలు చేపట్టబోతున్నాయని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అర్హత కలిగిన లక్షలాది మంది పౌరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేష్ కుమార్ ను తొలగించడమే కాదు...ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ మాట్లాడుతూ ఇండియా కూటమి ఇచ్చిన పిలుపులను విజయవంతం చేయాలని కోరారు. సర్ పేరు తో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని విమర్శించారు. ఫామ్‌ 6లో నిబంధనలతో ఓట్లను చేర్చకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని తిరిగి చేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. సర్‌ ను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణలో తొలగించిన ఓట్లను వెంటనే చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈటీ నర్సింహా మాట్లాడుతూ...అత్యంత దుర్మార్గమైన సర్‌‌పై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయిందని, ప్రధాని మోడీ ఏది చెబితే అది చేయటానికే ఈసీ ఉందని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. మోడీకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినా, అలాంటి వారిని గుర్తించి, ఓటర్‌ లిస్టు నుంచి వారి పేరును తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్