గ్రామీణ ఆడబిడ్డల చేతి ఉత్పత్తులకు నగర మార్కెట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతల అందం, మరోవైపు గ్రామీణ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు.. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలు ఒకే వేదికపై కనిపించనున్నాయి. గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌ను కల్పించే సారస్ (సేల్ ఆఫ్ ఆర్టీకల్స్ ఆఫ్ రూరల్ ఆర్టీసన్స్ సొసైటీ) మేళా అక్టోబర్ 7 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనుంది.హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు వందల స్టాళ్లు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా వినియోగదారులకు విక్రయించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడం సారస్ మేళా ప్రత్యేకత. తయారీదారులు నేరుగా వినియోగదారులను కలుసుకోవడం ద్వారా తమ ఉత్పత్తులకు ఆదరణను అంచనా వేసుకోవడంతో పాటు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యత, ప్యాకేజింగ్, ఉత్పత్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం పొందుతారు.
గ్రామీణ జీవనోపాధులను బలోపేతం చేయడం, మహిళా పారిశ్రామికతను ప్రోత్సహించడం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడంలో సారస్ మేళా కీలకంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మహిళలు ఉత్పత్తిదారులుగా మాత్రమే కాకుండా మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ వేదిక తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో, “ఆడబిడ్డల చేతిలో ఉన్న నైపుణ్యానికి మార్కెట్‌ను జోడిస్తే అదే వారి ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది అవుతుంది. ప్రభుత్వం వారికి ఆ అవకాశాలను కల్పించే దిశగా పనిచేస్తోంది” అని సీతక్క పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి రావడం సారస్ మరో ప్రత్యేకత. దీంతో కొత్త ఉత్పత్తులను తెలుసుకోవడంతో పాటు, ఇతర ప్రాంతాల మార్కెటింగ్ పద్ధతులు, నైపుణ్యాలను పరస్పరం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మార్కెట్ లింకేజీలు, బల్క్ ఆర్డర్లు, వ్యాపార భాగస్వామ్యాలకు కూడా ఇది దోహద పడుతుంది. తెలంగాణ నుంచి పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతలు, కలంకారి, ఎంబ్రాయిడరీ చీరలతో పాటు చెక్క బొమ్మలు, జూట్ బ్యాగులు, లెదర్ బ్యాగులు, మట్టి పాత్రలు, బంజారా కళాకృతులు, హెర్బల్ ఉత్పత్తులు, వివిధ ఆర్ట్ వర్క్స్ ప్రదర్శనలో ఉంటాయి. తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్లు, వివిధ రకాల పొడులు, మిల్లెట్స్ తదితర ఆహార ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. “హైదరాబాద్ ప్రజలు కుటుంబ సమేతంగా సారస్ మేళాను సందర్శించాలి. మన ఆడబిడ్డలు ఎంతో శ్రమించి తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలి. మనం చేసే ప్రతి కొనుగోలు వారి శ్రమకు ఇచ్చే ప్రోత్సాహం మాత్రమే కాదు. వారి ఆర్థిక స్వావలంబనకు అందించే అండ” అని సీతక్క పిలుపునిచ్చారు.
అక్టోబర్ 7 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో సారస్ మేళా
52 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)