Magazines

భూదార్ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

1 గంట క్రితం

Bhu-Dar title deeds
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 4 నిమిషాల చదవడం

కొంగర గ్రామంలో వందశాతం రీసర్వే పూర్తి

త్వరలో పాలేరు నియోజకవర్గంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు

మూడు దశల్లో సమగ్ర భూసర్వే..285 గ్రామాల్లో సర్వే పూర్తి

అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ

నవంబర్‌ చివరినాటికి మొదటిదశ పూర్తికి సన్నాహాలు

మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సర్వేనెంబర్‌‌కూ దశలవారీగా భూదార్‌ ‌నెంబర్లను కేటాయించనుంది. అందులో భాగంగానే భూదార్‌ ‌నెంబర్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం కొంగ‌ర గ్రామ ప‌రిధిలో ఉన్న మొత్తం 665 ఎక‌రాల‌ భూమి ఉంది. ఆ గ్రామంలో వంద‌శాతం రీస‌ర్వేను రెవెన్యూ శాఖ అధికారులు విజ‌య‌వంతంగా పూర్తిచేశారూ. త్వరలోనే ఆ గ్రామంలో భూదార్ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రీసర్వే ద్వారా ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలను సిద్ధం చేస్తున్నది. ఈ ప్రక్రియ ద్వారా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత పెరగడంతోపాటు భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గుతాయి.

​భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే కోసమే ఈ రీసర్వేను చేపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో రీసర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వేను పూర్తి చేసింది. భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసింది. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్ప‌టికే ఉన్న 411 రోవ‌ర్ల‌కు అద‌నంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లను ఖరారు చేసింది. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

​తొలిదశలో జిల్లాకు 70 గ్రామాల్లో రీసర్వే

రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిలో తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకుని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసింది. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్‌కు ప్రత్యేక భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతున్నది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావడంతోపాటు తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో సమగ్ర రీసర్వే కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.

​నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఆధారం

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నెంబర్ల ఉపవిభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీసర్వేను ప్రభుత్వం చేపడుతున్నది. గతంలో భూముల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్‌స్టాఫ్, మెజరింగ్ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు ప్రభుత్వం స్వస్తి పలికింది. డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. వాటి ద్వారా భూముల కొలతల్లో కచ్చితత్వం పెరగడంతోపాటు సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తులో సరిహద్దులపై వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

​భూభారతి పోర్టల్‌‌లో వివరాలు నమోదు

డీజీపీఎస్ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో వివరాలను నమోదు చేసేందుకు వీలవుతుంది. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2.29 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలోని అన్ని సర్వే నెంబర్లకూ దశలవారీగా భూదార్ నెంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది.శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై ఆయన సమీక్షను నిర్వహించారు. గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు వెళ్లే ముందు సంబంధిత పట్టాదారులకు విధిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని కోరారు. సర్వే నిర్వహించే విషయం భూ యజమానులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. వారు అందుబాటులో ఉండి భూముల హద్దులను నిర్ధారించుకునేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. స‌ర్వేకు ఒక‌టి రెండు రోజుల ముందు ఆయా గ్రామాల్లో త‌ప్ప‌నిస‌రిగా చాటింపు చేయాల‌న్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు స్పష్టమైన మార్కింగ్ చేయాలనీ, గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రయివేటు భూములు, గ్రామకంఠం పరిధుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో స్పష్టత తేవాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి, పరిశీలించి పరిష్కరించాలని కోరారు. సర్వే ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించారు. భూ రీసర్వేను అధికారులు కేవలం ప్రభుత్వ విధిగా భావించకుండా, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి రీసర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.


​భూయజమానులు సంతృప్తి 
చెందేలా సర్వే చేపట్టాలి

సర్వే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ, భూ యజమానులు సంతృప్తి చెందేలా సర్వే చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఆలోచించాలనీ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. - మంత్రి పొంగులేటి

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్